పంచాయతీలు పటిష్టమేనా?

ABN , First Publish Date - 2022-04-24T05:37:45+05:30 IST

పంచాయతీల్లో పాలన గాడి తప్పింది. స్థానిక సంస్థలను బలోపేతం చేసే సంకల్పంతో తీసుకొచ్చిన ఈ వ్యవస్థ పాలకుల విధానాల కారణంగా లక్ష్యాన్ని చేరడం లేదు. వైసీపీ వచ్చాక పంచాయతీ పాలన మరింత భిన్నంగా నడుస్తోంది.

పంచాయతీలు పటిష్టమేనా?

మౌలిక సూత్రాలకు భిన్నంగా పాలన

నిధుల మళ్లింపుతో కానరాని అభివృద్ధి

అవాంతరాలను ఎదుర్కొంటున్న స్థానిక సంస్థలు

నేడు జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం


పంచాయతీల్లో పాలన గాడి తప్పింది. స్థానిక సంస్థలను బలోపేతం చేసే సంకల్పంతో తీసుకొచ్చిన ఈ వ్యవస్థ పాలకుల విధానాల కారణంగా లక్ష్యాన్ని చేరడం లేదు. వైసీపీ వచ్చాక పంచాయతీ పాలన మరింత భిన్నంగా నడుస్తోంది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి ఉంది. వాటి నిధులను ప్రభుత్వం మళ్లించడంతో నేతలు మొక్కుబడిగా మిగిలారు. తప్పనిసరిగా చేయాల్సిన పనులనూ చేపట్టలేకపోతున్నారు. ఆదివారం జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక సంస్థల ఆవశ్యకత, ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పత్యేక కథనం.


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

మూడంచెల పంచాయతీ వ్యవస్థ వచ్చాక స్థానిక సంస్థలకు విశేష ప్రాధాన్యం పెరిగింది. స్వపరిపాలన ద్వారా స్థానికంగా ఉన్న సమస్యలను వారికి వారే గుర్తించి పరిష్కరించడం ద్వారా గ్రామీణాభివృద్ధికి దోహదపడాలన్నది పంచాయతీరాజ్‌ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. తాగునీరు, రోడ్లు, విద్యుత్‌, విద్య, వైద్యం, ఉపాధి కల్పన, పచ్చదనం-పరిశుభ్రత తదితర అంశాలను గ్రామ సభల్లో ప్రస్తావించడం ద్వారా స్వయంగా పరిష్కరించుకోవచ్చు. నిధుల లభ్యత ఆధారంగా నేతలు చర్యలు తీసుకునేవారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సాధారణ నిధులను సైతం మళ్లించేస్తోంది. దీనిపై సర్పంచులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల తీవ్ర విమర్శలు రావడంతో తిరిగి వారివారి ఖాతాలకు సాధారణ నిధులు జమచేశారు. ఆర్థిక సంఘ నిధులను మాత్రం అప్పగించలేదు. ప్రతి పంచాయతీ నుంచి రూ.2 లక్షలకు తక్కువ కాకుండా రూ.8 లక్షల వరకు ఆర్థిక సంఘ నిధులను మళ్లించేసుకున్నారు. 

గ్రామ సభలు నిర్వహిస్తున్నారా?

మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా గ్రామసభ నిర్వహించాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి పరిష్కరించాలి. అయితే ఈసభలు నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. రికార్డుల్లో వార్డు సభ్యుల సంతకాలు సేకరించి మమా అనిపిస్తున్నారు. ఉపాధి హామీ పనుల విషయంలో కూడా సర్పంచి తీసుకున్న నిర్ణయాలపై రికార్టుల్లో తీర్మానాల్ని రాసి సభ్యుల సంతకాలు సేకరించే పరిస్థితి ఉంటోంది. పంచాయతీల్లో మహిళా నేతలు ఎన్నికవుతున్నా స్వయంగా వారు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. కనీసం సభలకూ హాజరు కావడం లేదు. వారి ప్రతినిధులుగా భర్త, లేకుంటే ఇతర కుటుంబ సభ్యులే చక్రం తిప్పుతున్నారు. విజయనగరం జిల్లాలో 777 గ్రామ పంచాయతీ లున్నాయి. 27 మండల పరిషత్‌లు, 34 జిల్లా (ఉమ్మడి జిల్లా) ప్రాదేశిక సభ్యులున్నారు. ఇందులో సగానికి పైగా మహిళా ప్రజాప్రతినిధులే కావడం విశేషం. జిల్లా వ్యాప్తంగా 530 సచివాలయాలు, మూడు రెవెన్యూ డివిన్లున్నాయి.


అధికారాలు తుంచేస్తున్నారు

స్థానిక సంస్థలకు అధికారాలు పెరగాల్సి ఉంది. ఉన్నవాటికి కోత పడేలా పరోక్షంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. సర్పంచి ప్రమేయం పెద్దగా ఉండడం లేదు.  ఈ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి, సంక్షేమ పథకాల పంపిణీ, నిర్వహణ, మంజూరులో సర్పంచ్‌ నిర్ణయంతో పనిలేకుండా పోయింది. పంచాయతీలకు మంజూరైన నిధులను సైతం మళ్లించుకుపోతుంటే గ్రామాల అభివృద్ధి ఎలా సాధ్యం. స్థానిక సంస్థలను ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. సర్పంచుల అధికారాలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. 

                           - పాలవలస పార్వతి, సర్పంచి, లక్షింపురం, బాడంగి.


ప్రతి మూడు నెలలకు సమావేశం

 అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రతి మూడు నెలలకు సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇందుకు సంబంధించిన తీర్మానాలు, ఫొటోలు వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేస్తున్నాం. విధిగా సమావేశాలు నిర్వహించేలా ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నాం. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని తొమ్మిది అంశాల్లో ప్రగతి సాధించాలని కేంద్ర నిర్దేశించింది. రక్షిత నీరు, విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత, సామాజిక న్యాయం తదితర అంశాల్లో ప్రగతి సాధించాలని చెప్పింది. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు గ్రామ సభలు నిర్వహించి జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవ ఆవశ్యకత తెలియజెప్పాలని సూచించాం. సభ నిర్వహించి ఫొటోలు, తీర్మానం కాపీలు అప్‌లోడ్‌ చేయాలని కార్యదర్శులకు ఆదేశాలిచ్చాం.

                          - ఎస్‌ సుభాషిణి, జిల్లా పంచాయతీ అధికారి.


Read more