ఒడిషా వద్దు.. ఏపీ కావాలంటున్న సరిహద్దు గ్రామాలు..

ABN , First Publish Date - 2022-02-19T16:22:17+05:30 IST

ఆంధ్రా కావాలి.. ఒడిషా వద్దుని సరిహద్దు గ్రామాల ప్రజలు అంటున్నారు.

ఒడిషా వద్దు..  ఏపీ కావాలంటున్న సరిహద్దు గ్రామాలు..

అమరావతి: ఆంధ్రా కావాలి.. ఒడిషా వద్దుని సరిహద్దు గ్రామాల ప్రజలు అంటున్నారు. ఒడిషాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మరోమారు సరిహద్దు సమస్య తెరపైకి వచ్చింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి చర్చించినా ఈ సమస్యకు తెరపడలేదు. విజయనగరం జిల్లా, సాలూరు, పాచిపెంట మండలాలకు ఆనుకుని ఉన్న ఆంధ్రా, ఒడిషా సరిహద్దు వివాదాస్పద గ్రామాలు మరోసారి నివురుగప్పిన నిప్పులా మారాయి. లేదు లేదుంటూనే ఒడిషా తన అధిపత్య పన్నాగాలకు పావులు కదుపుతోంది. బ్రిటిష్ కాలం నుంచి రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు సమస్య కొనసాగుతోంది. ఇక్కడున్న కొటియా గ్రామాల్లో లక్షల కోట్లు విలువచేసే ఖనిజాలు ఉన్నాయన్న నేపథ్యంలోనే ఈ గిరిజన గ్రామాలు మావంటే మావని ఆంధ్రా, ఒడిషా రాష్ట్రాలు అంటున్నాయి.


రెండు రాష్ట్రాలు సాధారణ స్థితిని కొనసాగించాలని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఒడిషా ప్రభుత్వం వాటిని పక్కనపెట్టి తన పని తాను చేసుకుపోతోంది. ఈ దశలోనే ఇక్కడ పలుమార్లు రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులకు, నాయకులకు, గిరిజనులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ దశలో సామరస్యంగా పరిష్కరించుకుందామన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటీవల ఒడిషాలో సమావేశం కూడా జరిపారు. ఒడిషాలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న 21 గ్రామాల్లో కూడా ఒడిషా స్థానిక ఎన్నికలు జరిపింది. ఆంధ్రాకు చెందిన ప్రజానీకంతోపాటు పలు గ్రామాల్లోని ఆంధ్రా మీడియాను కూడా పోలీసు యంత్రాంగం అడ్డుకుంది. అయితే ప్రజల నుంచి ఓటింగ్ కనిపించకపోవడం గమనార్హం. 

Read more