ఆనలైనలో వివరాలేవీ?

ABN , First Publish Date - 2022-04-10T05:48:53+05:30 IST

జిల్లాలో 4.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, సంబంధిత మిల్లులకు తరలించినప్పటికీ వాటి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచలేదని, తక్షణం ఆ ప్రక్రియను పూర్తిచేయాలని ఆర్డీవో శేషశైలజ ఆదేశించారు.

ఆనలైనలో వివరాలేవీ?
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో శేషశైలజ

వెంటనే కొనుగోళ్ల సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయండి

ఆర్డీవో శేషశైలజ

బొబ్బిలి రూరల్‌, ఏప్రిల్‌ 9: జిల్లాలో 4.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, సంబంధిత మిల్లులకు తరలించినప్పటికీ వాటి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచలేదని, తక్షణం ఆ ప్రక్రియను పూర్తిచేయాలని ఆర్డీవో శేషశైలజ ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాల యంలో శనివారం ఎనిమిది మండలాల తహసీల్దార్లు, వ్యవసాయశాఖాధికారులు, ఆర్‌బీకే నిర్వాహకులు, మిల్లర్లతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. సివిల్‌ సప్లయిస్‌ సంస్థ జిల్లా మేనేజరు కె.మీనాకుమారి కూడా పాల్గొన్నారు. ఆర్డీవో మాట్లాడుతూ లాగిన్‌లో ధాన్యం కొనుగోలు, మిల్లులకు తరలింపు తదితర అంశాలన్నిటినీ పూర్తి చేయాలన్నారు. రైతులకు బిల్లుల చెల్లింపులను సత్వరం జరిగేందుకు అవసరమైన సాంకేతిక పనులు చేపట్టాలన్నారు. అర్జీలేవీ పెండింగ్‌లో ఉంచకుండా క్లియర్‌ చేయాలని ఆదేశించారు. ఆన్‌లైన్‌లో జీరో పెండింగ్‌ అని చూపించగలిగేలా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అనంతరం సివిల్‌ సప్లయిస్‌ సంస్థ జిల్లా మేనేజరు కె.మీనాకుమారి మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం రైతులకు సుమారు రూ.7 నుంచి 8 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉందని, ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తయితేగాని చెల్లింపులు సాధ్యం కాదన్నారు. ధాన్యం సేకరణలో భాగంగా  ఇంకా 21.130 టన్నుల ధాన్యాన్ని సంబంధిత మిల్లులకు తరలించాల్సి ఉందన్నారు. వీటికి సంబంధించిన ట్రక్‌షీట్లను తీసుకోవాలన్నారు. సమావేశంలో తహసీల్దార్లు, బొబ్బిలి, గజపతినగరం  వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్లు మాలకొండయ్య, మహారాజన్‌, సీఎస్‌డీటీలు, మిల్లర్లు, ఆర్‌బీకే సిబ్బంది పాల్గొన్నారు. 



Updated Date - 2022-04-10T05:48:53+05:30 IST