నాలుగు నెలలైనా.. అవస్థలే!

ABN , First Publish Date - 2022-08-18T04:48:19+05:30 IST

పార్వతీపురం మన్యం జిల్లా ఆవిర్భవించి నాలుగు నెలలు గడించింది. అయితే ఇంకా పాలన గాడిన పడలేదు.

నాలుగు నెలలైనా.. అవస్థలే!
జిల్లాకేంద్రంలో సర్వశిక్షా అభియాన్‌ కార్యాలయంలో కంప్యూటర్లు, సిబ్బంది లేని పరిస్థితి

 నూతన జిల్లాలో ఇంకా గాడిన పడని పాలన  

  నేటికీ పూర్తిస్థాయిలో నియామకం కాని అధికారులు

  కార్యాలయ సముదాయాలను వేధిస్తున్న సమస్యలెన్నో..

   అంతంతమాత్రంగానే వసతుల కల్పన

  ఉద్యోగులకు తప్పని ఇబ్బందులు

  దృష్టిసారించని సర్కారు 

(పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)

పార్వతీపురం మన్యం జిల్లా ఆవిర్భవించి నాలుగు నెలలు గడించింది. అయితే ఇంకా పాలన గాడిన పడలేదు. ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలకు   వసతులు కల్పించ లేదు. అసలు ఏ కార్యాలయం ఎక్కడుందో జిల్లా వాసులకు తెలియని పరిస్థితి. ఉన్నతాధికారుల పోస్టుల భర్తీ కూడా జరగలేదు. కొన్ని శాఖల కార్యాలయాలకు పూర్తిస్థాయిలో అధికారులు లేరు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మొత్తంగా కొత్త జిల్లాపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఎంతో ఆర్భాటంగా ఏర్పాటైన నూతన జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాల యాలకు అనేక సమస్యలు వేధిస్తున్నాయి. ప్రధానంగా ఫర్నీచర్‌, కంప్యూటర్లు, స్టేషనరీ వంటివి నేటికీ పూర్తిస్థాయిలో సమకూర్చని పరిస్థితి. అనేక  కార్యాలయాల్లో పాత ఫర్నీచర్‌నే ఉపయోగిస్తున్నారు. వైరింగ్‌ పనులు కూడా అరకొరగానే జరిగాయి. సిబ్బందికి మరుగుదోడ్ల సమస్య కూడా వేధిస్తోంది. ఇదిలా ఉండగా కార్యాలయాల్లో పై అంతస్థుల్లో పనిచేసే కొంతమంది ఉద్యోగుల ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకోని లిఫ్ట్ట్‌ ఏర్పాటు చేస్తామన్న హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు.  మొత్తంగా ఉద్యోగులు అనేక  ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. తమ సమస్యలు బయటకు చేప్పుకోలేక సతమతమవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకం, వసతులను కల్పించాలని జిల్లావాసులు కోరుతున్నారు. 

జిల్లాలో  వివిధ శాఖల పరిస్థితి ఇలా.. 

  సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ)కు సంబంధించి ప్రత్యేక ప్రాజెక్టు అధికారి  లేరు. ప్రస్తుత డీఈవోగా వ్యవహరిస్తున్న బ్రహ్మాజీరావు ఇన్‌చార్జి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యాలయానికి సంబంధించి పూర్తిస్థాయిలో కంప్యూటర్లు కూడా లేవు. సిబ్బంది నియామకం నేటివరకు జరగలేదు. అసిస్టెంట్‌ మానటరింగ్‌ ఆఫీసర్‌ (ఏఎంవో)గా డి.ప్రసాదరావు డిప్యుటేషన్‌పై కొన్ని రోజుల పాటు విధులు నిర్వహించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని పాఠశాలలకు చెందిన పార్ట్‌ టైం ఇనస్ట్రక్టర్లు ఎస్‌ఎస్‌ఏలో విధులు నిర్వహిస్తున్నారు.  

  జిల్లా మత్స్యశాఖ విషయానికొస్తే.. సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు ఇద్దరేసి చొప్పున ఉండాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ ఒక్కొక్కరినే నియ మించారు. నలుగురు ఎఫ్‌డీవోలకు ఇద్దరిని మాత్రమే నియమించారు. 

  మెప్మా కార్యాలయంలో ఇన్‌చార్జి పీడీగా సుధాకర్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యాలయానికి సంబంధించి సిబ్బంది నియామకం జరగలేదు. 

  జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి  ఒక కంప్యూటర్‌ను మాత్రమే అందించారు. ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లకు సంబంధించి కనీసం మూడు కంప్యూటర్లు అయినా ఉండాల్సి ఉన్నప్పటికీ ఒక కంప్యూటర్‌తోనే కాలం నెట్టుకొస్తున్నారు. పూర్తిస్థాయిలో టేబుల్స్‌ కూడా లేవు. పాత టేబుల్స్‌ను వినియోగిస్తున్నారు. సిబ్బంది సర్వీసు రిజిస్ట్రర్లు పెట్టుకొనేందుకు కూడా అవసరమైన బీరువాలు లేవు. 

  జిల్లా సెట్విజ్‌శాఖ అధికారి కార్యాలయంతో పాటు ఎస్‌ఎస్‌ఏ కార్యాలయాలు బోర్డులకే పరిమితమవుతున్నాయి. 

  జిల్లా ఫుడ్‌ సేఫ్టీ కార్యాలయానికి సంబంధించి ఇన్‌చార్జి అధికారిగా విజయనగరం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఈశ్వరి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

  విద్యాశాఖకు సంబంధించి ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆఫీస్‌, ఏపీజీఎల్‌ఐ ఆఫీసులు ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. తొలుత జిల్లా విద్యాశాఖాధికారిగా ఎస్‌డీవీ రమణ నియామకమయ్యారు. కొన్ని రొజులకే  అనారోగ్యంతో ఆయన సెలవు పెట్టి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇన్‌చార్జి డీఈవోగా బ్రహ్మాజీరావు ఉన్నారు. 

  ఏపీఎంఐపీ (డ్రిప్‌ ఇరిగేషన్‌)కి ప్రాజెక్టు డైరెక్టర్‌ను ఇంకా  నియమించలేదు. జిల్లా ఉద్యానశాఖ అధికారి సత్యనారాయణరెడ్డి ఏపీఎంఐపీ పీడీగా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 

సమస్యలుంటే పరిష్కరిస్తాం..

ప్రభుత్వ కార్యాలయాలకు ఫర్నీచర్‌, కంప్యూటర్లను అందించాం. ఎక్కడైనా సమస్యలుంటే పరిష్కరిస్తాం. కార్యాలయ నిర్వహణకు సంబంధించి ఏమైనా కావాలంటే  ఆయా శాఖల  ఉన్నతాధికారులకు ముందుగా తెలియజేస్తే సమ కూరుస్తారు. కొత్త జిల్లాలో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నాం.

- జె.వెంకటరావు, డీఆర్‌వో, పార్వతీపురం

 

Updated Date - 2022-08-18T04:48:19+05:30 IST