45 ఏళ్ల తర్వాత..

ABN , First Publish Date - 2022-10-19T05:22:37+05:30 IST

ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు 45 ఏళ్ల తర్వాత వారంతా కలుసుకున్నారు. నాడు విద్యార్థి దశలో చేసిన అల్లరి, మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.

45 ఏళ్ల తర్వాత..
45 ఏళ్ల తరువాత కలిసిన పూర్వ విద్యార్థులు

  ఒక చోట చేరిన పూర్వ విద్యార్థులు 

గుమ్మలక్ష్మీపురం, అక్టోబరు 18 : ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు 45 ఏళ్ల తర్వాత వారంతా కలుసుకున్నారు. నాడు విద్యార్థి దశలో చేసిన అల్లరి, మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. యోగక్షేమాలు అడిగితెలుసుకున్నారు. నాటి టీచర్లు, పాఠశాల గొప్పతనాన్ని మరోసారి స్మరించుకున్నారు. ఈ అ‘పూర్వ’ కలయికకు వేదికైంది గుమ్మలక్ష్మీపురం జడ్పీ ఉన్నత పాఠశాల. 1977-78లో ఈ స్కూల్‌లో టెన్త్‌ చదువుకున్న విద్యార్థులంతా మంగళవారం మండలకేంద్రంలోని కల్యాణమండపంలో కలుసుకున్నారు. ఇంజినీర్లు, వైద్యులు, టీచర్లు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, వ్యాపారవేత్తలుగా హైదరాబాద్‌, చెన్నైలలో, విశాఖ, విజయనగరం తదితర ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఒకచోట చేరి, ఆట పాటలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. అనంతరం పూర్వ విద్యార్థుల్లో ఇద్దరికి రూ.40 వేల వరకూ ఆర్థిక సాయం అందించారు. వాట్సాప్‌ గ్రూపు ఏర్పరచుకుని భవిష్యత్‌లో ఒకరికొకరు సహకారం అందించుకోవాలని, పాఠశాల అభివృద్ధికి కూడా కృషి చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత పాఠశాలను సందర్శించారు. వారిని చూసి గ్రామ ప్రజలు, పెద్దలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆత్మీక కలయికకు కృషి చేసిన పూర్వ విద్యార్థులు మద్ది సుధాకర్‌, కింతలి వెంకటరావు, రాంప్రసాద్‌, కొండలరావు, బీహెచ్‌ ఉమామహేశ్వరరావు, దేవానంద్‌ తదితరులను పలువురు అభినందించారు. 


Read more