ఆగిన ఇళ్లు

ABN , First Publish Date - 2022-07-18T05:33:49+05:30 IST

‘వెంటనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి.. లేకుంటే స్థలాలు తిరిగి తీసుకుంటాం ’ అని అధికారులు హెచ్చరించడంతో వారంతా చేతిలో డబ్బుల్లేకపోయినా ఇళ్ల నిర్మాణం ప్రారంభించేశారు.

ఆగిన ఇళ్లు
కొప్పెర్ల జగనన్న కాలనీలో స్లాబ్‌వరకు వచ్చి నిలిచిపోయిన గృహనిర్మాణాలు

జగనన్న గృహాల వద్ద కానరాని మౌలిక వసతులు
మంజూరు కాని బిల్లులు
కొప్పెర్లలో నిలిచిపోయిన నిర్మాణాలు
పూసపాటిరేగ, జూలై 17:
‘వెంటనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి.. లేకుంటే స్థలాలు తిరిగి తీసుకుంటాం ’ అని అధికారులు హెచ్చరించడంతో వారంతా చేతిలో డబ్బుల్లేకపోయినా ఇళ్ల నిర్మాణం ప్రారంభించేశారు. అప్పులు చేసి కొంతవరకూ నిర్మించారు. మౌలిక సౌకర్యాలు లేక.. బిల్లులూ కాక ప్రస్తుతం ఎక్కడి నిర్మాణాలను అక్కడే ఆపేశారు. ఇదీ కొప్పెర్ల జగనన్న ఇళ్ల పరిస్థితి. జిల్లాలో చాలా గ్రామాల్లో ఇదే స్థితిలో లబ్ధిదారులు కొట్టుమిట్టాడుతున్నారు.
పూసపాటిరేగ మండలంలోని కొప్పెర్ల పంచాయతీలో సుమారు 70కి పైగా గృహనిర్మాణాలను చేపట్టారు.   నీరు అంతగా లేకపోయినా ఇప్పటివరకు ఏదోలా నిర్మించుకున్నారు. స్లాబ్‌ నుంచి నీరు కూడా కీలకం. అయితే కరెంటు లైన్‌ ఇవ్వక నీరు అందించే పరిస్థితి లేదు. దీంతో చాలా వరకు గృహనిర్మాణాలు స్లాబు స్థాయి వరకూ తీసుకొచ్చి నిలిపేశారు. మరోవైపు ఇసుక సరఫరా కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఐరన్‌ అందజేయడంలేదని కొందరు లబ్ధిదారులు వాపోతున్నారు. స్లాబ్‌స్థాయి వరకు వచ్చినా నేటి వరకు ఒక్కరూపాయి బిల్లుకూడా అందలేదని ఇంకొందరు చెబుతున్నారు. మరోవైపు లేఅవుట్‌ అభివృద్ధి పనులు నిర్వహించిన కాంట్రాక్టర్‌ కూడా తనకు రూపాయి కూడా బిల్లు అందలేదని చెబుతున్నాడు.

బిల్లులు చెల్లించడం లేదు
గృహనిర్మాణాలను వెంటనే మొదలు పెట్టాలని అధికారులు, నాయకులు చెప్పడంతో వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాం. ఇప్పటివరకు విద్యుత్‌ సరఫరా లేదు. నీరు అందే పరిస్థితి లేదు. ఒక్కపైసా బిల్లు  అందజేయలేదు. ఇసుకను కూడా ఇవ్వడం లేదు. ఇలా అయితే ఇళ్ల నిర్మాణాలు ఏవిధంగా చేపట్టాలి.
                    -  కింతాడ లక్ష్మి, లబ్ధిదారు, పాతకొప్పెర్ల

త్వరలోనే అందజేస్తాం
జగనన్న లేఅవుట్‌కు త్వరలోనే విద్యుత్‌ సరఫరా చేస్తామని ఆ శాఖ అధికారులు చెప్పారు. బిల్లులు కూడా కొద్దిరోజుల్లో అందజేస్తాం. లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూస్తాం.
                     - మురళీ,  డీఈ, గృహనిర్మాణశాఖ


Read more