-
-
Home » Andhra Pradesh » Vizianagaram » A sand tractor collided with an auto-NGTS-AndhraPradesh
-
ఆటోను ఢీకొన్న ఇసుక ట్రాక్టర్
ABN , First Publish Date - 2022-08-17T05:41:31+05:30 IST
ఆటోను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతిచెందగా, మరో మహిళకు చేయి తెగిపడింది. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

మహిళ మృతి
మరొకరికి తెగిపడిన చేయి.. ఇద్దరికి స్వల్ప గాయాలు
బొబ్బిలి /తెర్లాం: ఆటోను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతిచెందగా, మరో మహిళకు చేయి తెగిపడింది. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. తెర్లాం మండలం నందబలగ గ్రామానికి చెందిన పదిమంది కూలీలు బాడంగి మండలం రేజేరు గ్రామంలో వరినాట్లు పనిముగించుకొని మంగళవారం రాత్రి ఆటోలో ఇంటికి వెళ్తున్నారు. ఆ సమయంలో నందబలగ గ్రామ సమీపంలోని నాగళ్లమదుము దగ్గర ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్, ఆ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొట్ట చిన్నమ్మి(45) అక్కడికక్కడే మృతిచెందింది. బొట్ట గంగమ్మ ఎడమ చేయి తెగిపడింది. లక్ష్మమ్మ పేరుగల ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటోలో మొత్తం పదిమంది కూలీలు ప్రయాణిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటారనగా ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని బొబ్బిలి ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన చిన్నమ్మి మృతదేహాన్ని బొబ్బిలి తీసుకొచ్చారు. మృతురాలి భర్త గత కొద్దికాలం కిందట చెన్నైలో రోడ్డు ప్రమాదంలో మరణించగా, ఆమె తన ఇద్దరు కుమార్తెలకు వివా హం చేసింది. ఆ ఒంటరి మహిళా కూలీ బతుకు కాస్త ముగిసినట్లయింది. నందబలగలో ఇసుక రీచ్ ఉండడంతో ఇక్కడ నుంచి బొద్దాం కు ట్రాక్టర్‌లో ఇసుకను తరలిస్తూ ప్రమాదానికి కారణమయ్యింది. గాయపడ్డ గంగమ్మకు తెగిపడిన చేయిని కలిపి కట్టి బొబ్బిలి ఆసుపత్రిని విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించారు. తెర్లాం ఎస్‌ఐ బి.రమేష్ తన సిబ్బందితో సహా ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.