ఎగరని డ్రోన్‌

ABN , First Publish Date - 2022-07-19T04:46:29+05:30 IST

శృంగవరపుకోట మండలం మామిడిపల్లి, చామలాపల్లి, కొత్తకోట గ్రామాల పరిధిలో భూముల రీ సర్వే కోసం గురువారం డ్రోన్‌ కెమెరాలను తీసుకువచ్చారు. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ రోజు ఒక్కసారీ వినియోగించలేకపోయారు.

ఎగరని డ్రోన్‌
ఎస్‌.కోట: కొత్తకోట గ్రామ పరిధిలో డ్రోన్‌ సర్వే చేస్తున్న అధికారులు (ఫైల్‌)


 తరచూ సాంకేతిక సమస్యలు
చినుకు పడితే కదలని యంత్రం
ఆలస్యమవుతున్న భూముల రీ సర్వే
త్వరగా పూర్తిచేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు

శృంగవరపుకోట, జూలై 18:

 శృంగవరపుకోట మండలం మామిడిపల్లి, చామలాపల్లి, కొత్తకోట గ్రామాల పరిధిలో భూముల రీ సర్వే కోసం గురువారం డ్రోన్‌ కెమెరాలను తీసుకువచ్చారు. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ రోజు ఒక్కసారీ వినియోగించలేకపోయారు. శుక్రవారం కూడా సాంకేతిక సమస్య వచ్చింది. మూడు రోజుల తర్వాత సోమవారం మధ్యాహ్నానికి సరిచేయడంతో కొత్తకోట, చామలాపల్లి గ్రామాల్లో రీ సర్వే చేశారు. ఇంకా మామిడిపల్లిలో చేయాల్సి ఉంది. ఇలా డ్రోన్‌ ద్వారా ఒక రోజులో పూర్తికావాల్సిన సర్వే నాలుగైదు రోజులు పట్టింది.

 శృంగవరపుకోట మండలం దారపర్తి పంచాయతీ శివారు కురిటి రెవెన్యూ గ్రామం కొండ శిఖరాన ఉంది. ఆ గ్రామంలో నెట్‌ పనిచేయదు. దీంతో రీ సర్వేకి డ్రోన్‌ తిరిగే అవకాశం లేదు. ఈటీఎస్‌ యంత్రాల  ద్వారా సర్వే చేస్తున్నారు. రోజుకు ఆరుగురు నుంచి పది మంది గ్రామ సర్వేయర్‌లు అక్కడ పనిచేస్తున్నారు. దీంతో సర్వే పూర్తయ్యేందుకు దాదాపు వారం రోజులు పైబడుతుంది. వసతి, భోజనానికి సొంత ఖర్చులపై ఆధారపడుతున్నారు. ఎన్నాళ్లిలా అంటూ లోలోన వాపోతున్నారు.


ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే పరిస్థితి ఇలా ఉంది. వారు పనిచేసేందుకు కనీస ఖర్చులు ఇవ్వకుండా.. డ్రోన్‌లో సాంకేతిక లోపం తలెత్తితే సరిచేయకుండా రీసర్వేను తొందరగా చేయాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లాలో భూముల రీసర్వే ఏడాదిగా జరుగుతోంది. సర్వేకు పైలెట్‌ ప్రాజెక్టు కోసం దత్తిరాజేరు మండలం లక్ష్మిపురం, రామభద్రపురం మండలం మర్రివలస, రాజాం మండలం రామునుజపేట గ్రామాలను తీసుకున్నారు. ఈ మూడు గ్రామాల్లో రీ సర్వేను పూర్తిచేసినట్లు జిల్లా సర్వే శాఖ ప్రకటించింది.  భూ రికార్డులను గ్రామ సచివాలయాలకు అప్పగించినట్లు జిల్లా సర్వే భూ రికార్డుల అధికారి టి.త్రివిక్రమరావు తెలిపారు. ఇదే విధంగా జిల్లాలో 983 రెవెన్యూ గ్రామాల్లో రీ సర్వే చేయాల్సి ఉంది. ఇంతవరకు డ్రోన్‌ల ద్వారా 445 రెవెన్యూ గ్రామాల వరకు పూర్తి చేయగలిగారు. డ్రోన్‌ సర్వే జరిగినంత మాత్రన రీ సర్వే పూర్తయినట్లు కాదు. గ్రామ రెవెన్యూ అధికారులు, సర్వేయర్‌లు క్షేత్రస్థాయిలో పొలాలకు వెళ్లాలి. డ్రోన్‌ కెమెరాలతో తీసిన ఫొటోల ఆధారంగా సర్వే నంబర్ల వారీగా భూముల విస్తీర్ణాన్ని నమోదు చేయాలి. యజమానులను గుర్తించాలి. ఉన్నతాధికారుల సూచనలకు అనుగుణంగా రికార్డులను తయారు చేయాలి. అనంతరం వాటిని ప్రభుత్వానికి పంపించాలి. అక్కడి నుంచి సానుకూలత లభిస్తేనే రీ సర్వే పూర్తయినట్లు భావించాలి.

వాతావరణం అనుకూలిస్తేనే..
డ్రోన్‌ ఎగిరేందుకు వాతావరణం అనుకూలించాలి. గట్టిగా ఎండ కాయకూడదు. వర్షం పడకూడదు. చిన్నపాటి చినుకులు పడినా డ్రోన్‌ పని చేయడం లేదు. ప్రస్తుతం రుతుపవనాల ప్రభావంతో రోజూ వర్షం పడుతోంది. డ్రోన్‌ సర్వేకు ఆటంకం కలుగుతోంది. మరోవైపు సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎప్పటికప్పుడు డ్రోన్‌ ఎగరకుండా నిలిచిపోవడంతో అనుకున్న సమయానికి సర్వే కొలిక్కిరావడం లేదు. అయినా కానీ తహసీల్దార్‌లు, సర్వేయర్‌ల నుంచి ప్రతి నిమిషానికీ జిల్లా ఉన్నతాధికారులు ప్రగతి నివేదికలు అడుగుతున్నారు. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.

కనీస ఖర్చులూ ఇవ్వక..
డ్రోన్‌ కెమెరా తిరిగేందుకు క్షేత్రస్థాయిలో పాయింట్లు పెడతారు. వాటివద్ద ఎటుంటి పొదలూ ఉండకూడదు. తొలగించేందుకు కూలీలను వినియోగిస్తున్నారు. ఆ ఖర్చులు ఎవరిస్తారో తెలియదు. ప్రస్తుతానికి మండల స్థాయి అధికారులు పెట్టుకుంటున్నారు. సర్వేకి ఇతర మండలాలకు చెందిన గ్రామ సర్వేయర్‌లను పంపిస్తున్నారు. వారు రీసర్వేలో పాల్గొనేందుకు గ్రామాల నుంచి రాకపోకలు కుదరదు. ఏ మండలంలో సర్వే జరిగితే ఆ మండలంలోనే ఉండాలి. వసతి, భోజనానికి ఇబ్బంది పడుతున్నారు.  వారి ఖర్చుల గురించి ఉన్నతాధికారులెవరూ మాట్లాడడం లేదు. దీంతో వారు నిరాశతో పనిచేస్తున్నారు.

ఆన్‌లైన్‌లోనే రిపేరు
 భూముల రీ సర్వే కోసం ప్రభుత్వం సర్వే ఆఫ్‌ ఇండియాకు చెందిన ఓ ఇంజనీర్‌ను కేటాయించింది. డ్రోన్లలో సాంకేతిక సమస్యవచ్చినప్పుడు ఆ ఇంజనీరు విజయవాడలోని సర్వే ఆఫ్‌ ఇండియా బ్రాంచిని సంప్రదించి ఆన్‌లైన్‌లో సరిచేస్తున్నారు. ఈ కారణంగానే రీ సర్వేలో జాప్యం జరుగుతోంది. ఒక్కోసారి ఆయన వల్ల కూడా పని కావడం లేదు. ఆ సమయంలో పూర్తిగా రీ సర్వేను అపేయాల్సి వస్తోంది. అప్పుడు విజయనగరం జిల్లా కేంద్రం నుంచి వేరే డ్రోన్‌ను తీసుకువస్తున్నారు.


Updated Date - 2022-07-19T04:46:29+05:30 IST