ఆ రెండూర్లకు వంతెన

ABN , First Publish Date - 2022-10-15T05:13:40+05:30 IST

ఆ రెండు గ్రామాల దశాబ్దాల వ్యథకు ఓ పరిష్కార మార్గం దొరకనుంది. గజపతినగరం మండలం పట్రువాడ, మర్రివలస గ్రామాలకు రహదారి సౌకర్యం కలగనుంది. ఆ రెండు గ్రామాల ప్రజల రహదారుల కష్టంపై గత నెల 16న ‘ఆ రెండూర్ల కష్టాలు’ పేరిట ‘ఆంధ్రజ్యోతి’లో

ఆ రెండూర్లకు వంతెన
పట్రువాడ వద్ద వంతెన నిర్మాణానికి స్థల పరిశీలన చేస్తున్న అధికారులు

నిర్మాణానికి ముందుకొచ్చిన ప్రభుత్వం
స్థల పరిశీలన చేసిన అధికారులు
త్వరలో పనులు ప్రారంభించనున్నట్టు వెల్లడి
విజయనగరం (ఆంధ్రజ్యోతి)

ఆ రెండు గ్రామాల దశాబ్దాల వ్యథకు ఓ పరిష్కార మార్గం దొరకనుంది. గజపతినగరం మండలం పట్రువాడ, మర్రివలస గ్రామాలకు రహదారి సౌకర్యం కలగనుంది. ఆ రెండు గ్రామాల ప్రజల రహదారుల కష్టంపై గత నెల 16న ‘ఆ రెండూర్ల కష్టాలు’ పేరిట ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనం ప్రభుత్వాన్ని కదిలించింది. దీంతో రహదారుల నిర్మాణంపై యంత్రాంగం దృష్టిపెట్టింది. శుక్రవారం పంచాయతీరాజ్‌ డీఈ అప్పలనాయుడు ఆధ్వర్యంలోని అధికారు బృందం వంతెన నిర్మాణం చేపట్టాల్సిన స్థలాన్ని పరిశీలించారు. త్వరలో పనులు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. పట్రువాడ వద్ద వంతెన నిర్మాణానికి రూ.4 కోట్లు, మర్రివలస  వంతెన నిర్మాణానికి రూ.6 కోట్లు నిధులు అవసరమని అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి కొలతలు సైతం తీసుకున్నారు. త్వరలో పనులు పట్టాలెక్కనున్నాయని తెలియడంతో ఆ రెండు గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ‘ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతలు తెలిపారు.

 దశాబ్దాల వెతలివి..
దశాబ్దాలుగా ఆ రెండు గ్రామాల వెతలు అన్నీఇన్నీ కావు. చంపావతి నది అవతల వైపు ఈ గ్రామాలుంటాయి. వర్షాకాలం వచ్చిందంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. నదిలో నీరు తగ్గుముఖం పట్టేవరకూ గ్రామాల్లో బితుబితుకుమంటూ గడపాల్సిందే. అత్యవసర, అనారోగ్య సమస్యలు ఎదురైనా అనుభవించాల్సిందే. కళ్లేదుటే ప్రాణాలు పోతున్నా నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సిందే. నది దాటుతుండగా గల్లంతైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత టీడీపీ ప్రభుత్వం వంతెనల నిర్మాణానికి ముందుకొచ్చింది. 2019 ఫిబ్రవరిలో వంతెనల నిర్మాణానికి అప్పటి మంత్రి నారా లోకేష్‌ శంకుస్థాపన కూడా చేశారు. ఇంతలో ఎన్నికలు రావడం, వైసీపీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. తరువాత గత ప్రభుత్వం కేటాయించిన పనులను వైసీపీ సర్కారు రద్దుచేసింది. ఇన్నాళ్లకు మళ్లీ వంతెనలకు మోక్షం కలిగింది.





Updated Date - 2022-10-15T05:13:40+05:30 IST