18 హాస్టళ్లకు 8మందే..

ABN , First Publish Date - 2022-11-16T23:52:22+05:30 IST

జిల్లా వెనుకబడిన తరగతుల వసతి గృహాల్లో సంక్షేమం కొరవడుతోంది. సకాలంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాల్సిన ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణం. పర్యవేక్షణ లోపించడంతో విద్యార్థులను అనేక సమస్యలు వెంటాడుతున్నాయి.

18 హాస్టళ్లకు 8మందే..
చినమేరంగి కాలేజీ హాస్టల్‌

18 హాస్టళ్లకు 8మందే..

జిల్లాలో బీసీ వసతిగృహాలను వేధిస్తున్న వార్డెన్ల కొరత

మూడు మండలాలకు ఒకరైతే, 4 బాలికల కాలేజీ హాస్టళ్లకు ఒకరు

పాలకొండలో రెండు వసతి గృహాలకు గిరిజన సంక్షేమాధికారి ఇన్‌చార్జి

కొరవడుతున్న పర్యవేక్షణ.. విద్యార్థులను వేధిస్తున్న సమస్యలెన్నో..

మూడేళ్లుగా పోస్టులు భర్తీ చేయని ప్రభుత్వం

(జియ్యమ్మవలస)

జిల్లా వెనుకబడిన తరగతుల వసతి గృహాల్లో సంక్షేమం కొరవడుతోంది. సకాలంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాల్సిన ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణం. పర్యవేక్షణ లోపించడంతో విద్యార్థులను అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. మెనూ కూడా సక్రమంగా అమలు కావడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. వాస్తవంగా జిల్లాలో 18 వెనుకబడిన తరగతుల వసతి గృహాలు ఉన్నాయి. చినమేరంగిలో ఒకటి బాలికల, రెండు బాలుర వసతి గృహాలు, పాలకొండలో రెండు బాలుర , పార్వతీపురంలో బాలురు మూడు, బాలికలది ఒకటి చొప్పున హాస్టళ్లు ఉన్నాయి. కొమరాడలో బాలికలు ఒకటి, రావివలస, గరుగుబిల్లి, కురుపాం, నర్సిపురం, బూర్జ, సాలూరు, పాచిపెంట, బీజే పురంలో ఒక్కోటి చొప్పున బాలురు వసతి గృహాలు ఉన్నాయి. వీటికి ఎనిమిది మందే రెగ్యులర్‌ వసతి గృహ సంక్షేమాధికారులు ఉన్నారు. మిగిలినవన్నీ ఇన్‌చార్జిలతోనే నడుస్తున్నాయి. దీనివల్ల వసతి గృహాలను సమస్యలు వేధిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విధుల నిర్వహణను ఒకసారి చూస్తే..

- చినమేరంగి కాలేజీ బాలుర వసతి గృహంలో సంక్షేమాధికారిగా పనిచేస్తున్న ఎన్‌.సుభద్రకు చినమేరంగి కాలేజీ బాలికల వసతి గృహం, కొమరాడ బాలుర హాస్టల్‌, పార్వతీపురం బాలికల వసతి గృహాలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమె పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించడానికి అవకాశం లేకుండాపోతోంది. జిల్లా కేంద్రంలో వసతి గృహం పరిశీలించి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న చినమేరంగిలో రెండు వసతి గృహాలు, 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న కొమరాడ హాస్టల్‌ను ఏ విధంగా పర్యవేక్షణ చేయగలరో ఉన్నతాధికారులకే తెలియాలి.

- గరుగుబిల్లి మండల కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న జె.శ్రీనివాసరావుకు జియ్యమ్మవలస మండలంలో బీజే పురం, చినమేరంగి హాస్టళ్లను, కురుపాంలో ఉన్న బీసీ హాస్టల్‌ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన గరుగుబిల్లి నుంచి 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న చినమేరంగి, 50 కిలో మీటర్ల దూరంలోఉన్న బీజే పురం, 45 కిలో మీటర్ల దూరంలో ఉన్న కురుపాం వసతి గృహాలను పర్యవేక్షించాల్సి ఉంది.

- పాలకొండలో ఉన్న రెండు బీసీ వసతి గృహాలకు సీతంపేట గిరిజన సంక్షేమ వసతి గృహ సంక్షేమాధికారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.

- పార్వతీపురం మండలం నర్సిపురం హాస్టల్‌ వార్డెన్‌ బూర్జ హాస్టల్‌కు, సాలూరు వసతి గృహ వార్డెన్‌కు పాచిపెంట మండల కేంద్ర వసతి గృహ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఫలితంగా రికార్డుల నిర్వహణ, పిల్లలకు అందించాల్సిన మెనూ, విద్యార్థుల చదువుపై ఉండాల్సిన పర్యవేక్షణ, తదితర అంశాలన్నీ గాడి తప్పుతున్నాయి. దీనిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఉన్నతాధికారులకు నివేదించాం

జిల్లాలోని వెనుకబడిన తరగతుల వసతి గృహాల్లో సంక్షేమాధికారుల కొరత ఉండటం వాస్తవమే. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాం. సర్వీసు కమిషన్‌కు కూడా లేఖ రాశాం. వారే తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

- ఎస్‌.కృష్ణ, ఏబీసీడబ్ల్యూవో, పాలకొండ డివిజన్‌

Updated Date - 2022-11-16T23:52:23+05:30 IST