150 పని దినాలు లేనట్టే!

ABN , First Publish Date - 2022-12-09T23:59:36+05:30 IST

వలసల నివారణే ఉపాధి హామీ పథకం లక్ష్యం. కానీ ఏజెన్సీలో మాత్రం గిరిజనులకు ‘ఉపాధి’ లభించడం లేదు.

   150 పని దినాలు లేనట్టే!
ఉపాధి పనులపై సలహాలు ఇస్తున్న ఎంపీడీవో గీతాంజలి (ఫైల్‌ )

పనులు లేక వలస బాట

స్పందించని అధికారులు

(సీతంపేట)

వలసల నివారణే ఉపాధి హామీ పథకం లక్ష్యం. కానీ ఏజెన్సీలో మాత్రం గిరిజనులకు ‘ఉపాధి’ లభించడం లేదు. పనుల్లేక అనేకమంది వలస బాట పడుతున్నారు. పొట్ట చేతబట్టుకుని కుటుంబాలతో ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏజెన్సీ ప్రాంతవాసులకు 150 పని దినాలు కల్పిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది. ఇప్పటివరకూ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో గిరిపుత్రులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం కుటుంబానికి వంద పనిదినాలే కల్పిస్తున్నారు. కేవలం ఆర్‌ఔఫ్‌ఆర్‌ భూముల్లో సాగు చేస్తున్న వారికే కేంద్ర సర్కారు ఆదేశాల ప్రకారం 150 పనిదినాలు కల్పిస్తున్నారు. కాగా ఆ పనిదినాలు పూర్తిచేసిన వారు కూడా ఏజెన్సీలో లేకపోవడంతో ‘ఉపాధి’ లక్ష్యం నీరుగారుతోంది.

ఇదీ పరిస్థితి..

వాస్తవంగా సీతంపేట ‘మన్యం’లో సుమారు 12వేల మంది ఉపాధి హామీ పథకం కింద జాబ్‌కార్డులు పొందారు. వారిలో 18 వేల మంది వేతనదారులుగా ఉన్నారు. అయితే వారందరికీ 150 ‘ఉపాధి’ పనిదినాలు కల్పించడం లేదు. ప్రస్తుతం కుటుంబానికి వంద పనిదినాలే కల్పిస్తున్నారు. అయితే ఒక కుటుంబంలో ఐదు నుంచి పది మంది సభ్యులుంటే ఒక్కొక్కరికీ పదిరోజులే లోపే పనిదినాలు వస్తున్నాయి. దీంతో మిగతా రోజుల్లో పనులు లేకపోవడంతో వారు కుటుంబ పోషణ నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఇదిలా ఉండగా ఏజెన్సీలో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ భూముల్లో సాగు చేస్తున్న వారికి మాత్రమే 150 పనిదినాలు కల్పిస్తున్నారు. అయితే అటవీ హక్కుల భూముల్లో సాగు చేస్తున్న 5,778 మంది జాబ్‌కార్డులు కలిగి ఉన్నప్పటికీ వారిలో 150 పనిదినాలు పూర్తి చేసిన వారు లేరు. కేవలం 70 రోజుల్లో పనులు చేపట్టిన వారు 2 వేల మంది ఉన్నారని సంబంధిత అధికారులే స్పష్టం చేస్తున్నారు.

అందని వేసవి అలవెన్స్‌

వేసవికాలంలో ఉపాధి పనులు చేపట్టే గిరిజన వేతనదారులకు అదనంగా అలవెన్స్‌ చెల్లించాల్సి ఉన్నా.. ఇంతవరకూ అందించలేదు. ప్రస్తుతం వంద పనిదినాలు పూర్తి చేసిన వేతనదారులకు ఏప్రిల్‌ వరకు పనులు లేకపోవడంతో మైదాన ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు. ప్రధానంగా మండలంలో కిరప, గుజ్జి, చిన్నపల్లంకి, పెద్దపల్లంకి, కె.వీరఘట్టం గ్రామాల నుంచి అత్యధికులు పనుల కోసం ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఉపాధి పనులు కల్పించడంలో సీతంపేట ప్రథమ స్థానంలో నిలిచినప్పటికీ మండలంలో వేతనదారులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా మే, జూన్‌ నెలల్లో గిరిజనులు జీడిపిక్కలు, చింతపండు సేకరణలో బిజీగా ఉంటారు. అలాంటి సమయంలో ఉపాధి పనులు కల్పించడం వల్ల వారు వాటిని చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. డిసెంబరు నెలలో ఉపాధి పనులు కల్పిస్తే తమకు మేలు కలుగుతుందని గిరిజనులు చెబుతున్నారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ 150 ఉపాధి పనిదినాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని ఉపాధి హామీ ఏపీడీ శ్రీహరి వద్ద ప్రస్తావించగా రోజుకు 20 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

కొరవడిన సమన్వయం

ఈ ఏడాది మండలంలో 1,653 పనులు గర్తించామని, వాటిల్లో భూ అభివృద్ధి, టెర్రాసింగ్‌, కాలువ అభివృద్ధి, చెరువులు, ఉద్యానవనాలు, రెవెన్యూ పనులకు సంబంధించి పనులు చేపట్టడానికి ప్రణాళికలు తయారు చేసినట్టు అధికారులు నివేదికలో స్పష్టం చేశారు. కాగా మండలంలో 35,890 మంది వేతనదారులు ఉన్నట్టు ఉపాధి హామీ ఏపీడీ చెబుతుండగా, మరోపక్క 18 వేల మంది వేతనదారులు ఉన్నట్టు ఏపీవో సాగర్‌ స్పష్టం చేస్తున్నారు. వారిలో 20 వేల మంది వరకు ఉపాధి కల్పిస్తామని ప్రకటనలు చేస్తున్నప్పటికీ ప్రస్తుతం రోజుకు మండలంలో 1600 మంది వేతనదారులకు మాత్రమే ఉపాధి పనులు కల్పిస్తున్నట్టు సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. దీంతో ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయం లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

Updated Date - 2022-12-09T23:59:37+05:30 IST