వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్‌కు

ABN , First Publish Date - 2022-11-30T03:21:10+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను కడప ..

వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్‌కు

ఏపీలో నిష్పాక్షిక దర్యాప్తు జరగదు: సుప్రీంకోర్టు

పిటిషనర్ల ఆందోళన ఊహాజనితం కాదు

సాక్షులను ప్రభావితం చేస్తున్నారు

వాంగ్మూలానికి అంగీకరించి

రికార్డు చేయడానికి రావడం లేదు

గంగాధర్‌రెడ్డి మరణం అనుమానాస్పదం

సీబీఐ అధికారులపైనే కేసులు పెడుతున్నారు

దీంతో దర్యాప్తు ఆపేసినట్లు కనబడుతోంది

కేసు ఢిల్లీకి బదిలీ చేస్తే సాక్షులు, కక్షిదారులకు ఇబ్బంది

అందుకే కడప నుంచి నాంపల్లి సీబీఐ కోర్టుకు: సుప్రీం

వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలని తొలుత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కోరారు. పరిస్థితులు మారగానే.. ఈ పిటిషన్‌ను ఆయనే ఉపసంహరించుకున్నారు. కానీ... ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్‌లో నిష్పాక్షిక విచారణ జరగదని వివేకా భార్య, కుమార్తె వ్యక్తం చేస్తున్న ఆందోళనలు ఊహాజనితమైనవి కావు. ఈ కేసులో ఎలాంటి ఒత్తిళ్లకు అవకాశంలేని నిష్పాక్షికమైన విచారణ కోరుకోవడం వారి చట్టబద్ధమైన హక్కు.

ఈ కేసులో అనేక మంది సాక్షులను విచారించాల్సి ఉంది. వారికి ఇబ్బంది కలుగకూడదనే విచారణను ఢిల్లీకి కాకుండా, హైదరాబాద్‌కు బదిలీ చేస్తున్నాం.

కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తుండగా.. సీబీఐ అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. వేధింపుల భయం, తప్పుడు కేసులు, ఫిర్యాదుల కారణంగా సీబీఐ తన దర్యాప్తును ఆపేసినట్లు కనబడుతోంది.

సుప్రీం ధర్మాసనం

న్యూఢిల్లీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను కడప నుంచి హైదరాబాద్‌కు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిందితులతో కుమ్మక్కై.. సీబీఐ దర్యాప్తునకు అడ్డంకులు సృష్టిస్తోందని, ఈ నేపథ్యంలో కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి, భార్య సౌభాగ్యమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు గత నెల 19న తీర్పును రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం 15 పేజీల తీర్పు వెలువరించింది. ‘వాస్తవాలు, పరిస్థితులను బట్టి.. ఆంధ్రప్రదేశ్‌లో నిష్పక్షపాత విచారణ జరగదని, తదుపరి విస్తృత కుట్రపై స్వతంత్ర, నిష్పక్షపాత దర్యాప్తు జరగదని, సాక్ష్యాలు ధ్వంసం చేస్తారని పిటిషనర్లు వ్యక్తం చేస్తున్న అనుమానాలు ఊహాజనితంగా భావించలేం.

న్యాయం పొందడానికి.. హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమార్తెకు బాధితులుగా ప్రాథమిక హక్కు ఉంది. ఇది విస్తృత కుట్రపై సీబీఐ దర్యాప్తును, విచారణను బదిలీ చేయదగిన కేసుగా అభిప్రాయపడుతున్నాం. న్యాయం చేయడమే కాదు. న్యాయం చేసినట్లుగా కూడా కనిపించాలి. రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం నిష్పక్షపాత విచారణ కోరడం కక్షిదారుల హక్కు. ట్రయల్‌ నిష్పక్షపాతంగా జరగకపోతే న్యాయవ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుంది’ అని స్పష్టం చేసింది. కోర్టు విచారణ దశలో పెద్ద సంఖ్యలో సాక్షులను విచారించాల్సి ఉంటుంది కాబట్టి ఢిల్లీలోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తే ఇబ్బంది కాబట్టి.. వారి సౌలభ్యం కోసం ట్రయల్‌ను హైదరాబాద్‌(నాంపల్లి) సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ధర్మాసనం తేల్చిచెప్పింది. సంబంధిత పత్రాలు, చార్జిషీటు, అనుబంధ చార్జిషీట్‌ను హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ కేసులో విస్తృత కుట్ర, సాక్ష్యాలను ధ్వంసం చేసే అంశాలపై సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు స్వతంత్రంగా, పక్షపాతం లేకుండా చేపట్టాలని నిర్దేశించింది.

తీర్పులో ధర్మాసనం ఏమన్నదంటే..

జూ వివేకానందరెడ్డి 2019 మార్చి 14-15 తేదీల్లో తన నివాసంలోనే హత్యకు గురయ్యారు. దీనిపై దర్యాప్తునకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. దీనిని సీబీఐకి అప్పగించాలని అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఆయన సీఎం అయ్యారు. ఆ ఏడాది మే 30న పదవీప్రమాణం చేశారు. అనంతరం సిట్‌ను రెండుసార్లు పునర్వ్యవస్థీకరించారు. అయినా దర్యాప్తులో ఎలాంటి పురోగతీ లేదు. దీంతో పిటిషనర్‌ సీబీఐకి అప్పగించాలని హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. మారిన పరిస్థితుల్లో కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్‌ను జగన్మోహన్‌రెడ్డి ఉపసంహరించుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడాన్ని ఆయన, ప్రభుత్వం కూడా వ్యతిరేకించారు. అయితే హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ దర్యాప్తు చేపట్టింది. చార్జిషీటు/అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేసింది. హత్య వెనుక విస్తృత కుట్ర, నేరం జరిగిన చోట సాక్ష్యాధారాల ధ్వంసానికి సంబంధించి సీబీఐ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తుండగా.. సీబీఐ అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. దాంతో హైకోర్టు దానిపై స్టే ఇవ్వాల్సి వచ్చింది. వేధింపుల భయం, తప్పుడు కేసులు, ఫిర్యాదుల కారణంగా సీబీఐ తన దర్యాప్తును ఆపేసినట్లు కనబడుతోంది. వీటన్నిటి నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదన్న పిటిషనర్ల ఆందోళన సహేతుకమే.

  • సాక్షుల రక్షణలో భాగంగా కీలక సాక్షులైన షేక్‌ దస్తగిరి, రంగన్నలకు సెషన్స్‌ కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే పోలీసు రక్షణ కల్పించారు.

  • సీఆర్‌పీసీ 164 సెక్షన్‌ కింద వాంగ్మూలం నమోదు చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన ఓ సాక్షి.. ఆ తర్వాత సీబీఐ ముందుకు రాలేదు. అతడిపై ప్రభుత్వం సస్పెన్షన్‌ ఎత్తివేసి మళ్లీ విధుల్లోకి తీసుకోవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది.

  • కె.గంగాధర్‌రెడ్డి అనే సాక్షి సెక్షన్‌ 164 కింద వాంగ్మూలం ఇవ్వడానికి తొలుత అంగీకరించారు. కానీ రాలేదు. పైగా మీడియా ముందుకు వచ్చి.. సీబీఐ తనపై ఒత్తిడి తీసుకొస్తోందని ఆరోపించారు. ఆ తర్వాత అనుమానాస్పద పరిస్థితుల్లో ఆయన చనిపోయారు.

  • పై వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాక.. ఈ కేసులో నిష్పక్షపాత దర్యాప్తు సాధ్యం కాదన్న పిటిషనర్ల అభిప్రాయం ఊహాజనితమేనని అనడానికి వీలు కాదు. అందుచేత బదిలీచేయడానికి దీనిని సరైన కేసుగా భావిస్తున్నాం.

  • ‘ఎలాంటి ప్రభావానికీ లోనుకాకుండా సముచిత, నిష్పాక్షిక న్యాయం అందించడమే క్రిమినల్‌ విచారణ పరమార్థం. నిష్పాక్షిక విచారణపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని భావించినప్పుడు.. సీఆర్‌పీసీ 407 సెక్షన్‌ ప్రకారం రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా.. 406 సెక్షన్‌ ప్రకారం దేశంలో ఎక్కడికైనా కేసును బదిలీచేయాలని ఏ కక్షిదారుడైనా కోరవచ్చు. కక్షిదారుల సౌకర్యం, సాక్షులను కోర్టుకు తీసుకురావడానికి సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా బదిలీ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవచ్చు’ అని అబ్దుల్‌ నాజర్‌ మదానీ వర్సెస్‌ తమిళనాడు ప్రభుత్వం కేసు(2000)లో సుప్రీంకోర్టు పేర్కొందని ధర్మాసనం గుర్తుచేసింది. జయేంద్ర సరస్వతి స్వామిగళ్‌ వర్సెస్‌ తమిళనాడు ప్రభుత్వం కేసు (2005)లో కూడా ఇవే అభిప్రాయాలు వెల్లడించినట్లు తెలిపింది.

  • ‘ప్రధాన సాక్షులను ఇప్పటికే ప్రభావితం చేశారని పిటిషనర్లు అంటున్నారు. వారికి ప్రాణాపాయం ఉందని చెబుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం జోక్యం, ప్రభావితం వల్ల నిష్పక్షపాత విచారణ జరగదనే కాకుండా కుట్ర కోణంలో తదుపరి దర్యాప్తు సక్రమంగా జరగడంపై పిటిషనర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరగబోదన్న అనుమానం హేతుబద్ధంగా ఉన్నప్పుడు ట్రయల్‌ను బదిలీ చేయవచ్చని అమరీందర్‌సింగ్‌ కేసులో ఇదే కోర్టు స్పష్టం చేసింది’ అని ధర్మాసనం గుర్తుచేసింది.

Updated Date - 2022-11-30T03:21:12+05:30 IST