-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » ys jagan meeting-NGTS-AndhraPradesh
-
సమస్యల ఊసెత్తని జగన్!
ABN , First Publish Date - 2022-07-18T06:34:51+05:30 IST
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన మూడేళ్ల తర్వాత నగరంలో తొలిసారిగా ఈనెల 15న జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు.

ప్రసంగంలో అభివృద్ధి ప్రస్తావనా లేదు!
సీఎం హోదాలో జిల్లాలో తొలి బహిరంగసభ
ముఖ్యమంత్రి ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
స్టీల్‌ప్లాంట్, పంచగ్రామాల వంటి కీలక సమస్యలకు అందులో దక్కని చోటు
బీచ్‌కారిడార్, మెట్రో, బీచ్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌లపైనా నిరాశే!
ముఖ్యమంత్రి పర్యటనపై నిట్టూరుస్తున్న జిల్లా వాసులు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన మూడేళ్ల తర్వాత నగరంలో తొలిసారిగా ఈనెల 15న జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. వాహనమిత్ర పథకం కింద లబ్ధిదారులకు నగదు పంపిణీ కార్యక్రమాన్ని బటన్‌నొక్కి ప్రారంభించే ముందు సభలో అరగంటసేపు సీఎం ప్రసంగిస్తారని అధికారులు ప్రకటించారు. దీంతో నగరంలో ప్రధాన సమస్యలైన స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, పంచగ్రామాల సమస్యకు పరిష్కారం, బీచ్‌కారిడార్ అభివృద్ధి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం వంటి అంశాలను సీఎం ప్రస్తావిస్తారని అంతా భావించారు. కానీ ఒక్క సమస్యనూ ప్రస్తావించకుండా, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మాట్లాడకుండా కేవలం సొంతడబ్బాకే ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతిపక్షనేత హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారు. ఆ సమయంలో ఉమ్మడి జిల్లాలో చేపట్టిన కార్యక్రమంలో స్థానిక, ప్రజా సమస్యలు, ఈ ప్రాంత అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై వినతులు, విజ్ఞాపనలు స్వీకరించారు. అందులో భాగంగా దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని సింహాచలం పంచగ్రామాల సమస్యను తాను అధికారంలో వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మెట్రోరైల్ ప్రాజెక్టుని అందుబాటులోకి తెస్తానన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటికరించాలని నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు, జిల్లాలోని ప్రజాసంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గత 521 రోజులుగా పలు రూపాల్లో పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి దీని గురించి కనీసం ప్రస్తావించలేదు. భోగాపురంలో ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు నిర్మాణం భూ సేకరణతోనే నిలిచిపోయింది. కోస్టల్‌బ్యాటరీ నుంచి భీమిలి మీదుగా భోగాపురం వరకూ ఆరులేన్లతో కోస్టల్ కారిడార్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. దీనికోసం మాస్టర్‌ప్లాన్ కూడా సిద్ధం చేశారు. అయితే అక్కడితో ఆ పనులు నిలిచిపోయాయి. నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలంటే బీచ్ కీలకం కాబట్టి, బీచ్ పరిరక్షణతోపాటు పర్యాటకులను ఆకట్టుకునేందుకు సదుపాయాలు, వసతులు కల్పించేందుకు బీచ్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ పేరుతో అభివృద్ధి చేయాలని జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు. నిధుల కొరత కారణంగా ఆ ప్రాజెక్టు డీపీఆర్ దశలోనే నిలిచిపోయింది. వీటన్నింటి కారణంగా నగరంలో అభివృద్ధి పనులు జరగడం లేదనే భావన జిల్లా వాసుల్లో నెలకొంది.
సీఎం ప్రసంగంపై జిల్లా వాసుల ఆశలు
ఈ తరుణంలో ముఖ్యమంత్రి నగరానికి వచ్చి, బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలియడంతో జిల్లా వాసుల్లో ఆశలు రేకెత్తాయి. మూడేళ్లలో సీఎం పలు పర్యాయాలు నగరానికి వచ్చినప్పటికీ ఎక్కడా సభలు, సమావేశాల్లో ప్రసంగించకుండానే వెళ్లిపోయారు. జిల్లా సమస్యలు, అభివృద్ధి చర్యలపై మాట్లాడేందుకు అవకాశం లేకుండా పోయిందని ప్రజలు సరిపెట్టుకున్నారు. కాగా వాహనమిత్ర లబ్ధిదారులకు నగదు పంపిణీ కార్యక్రమాన్ని విశాఖలోనే ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో తమ ప్రాంతాన్ని పీడిస్తున్న సమస్యలకు పరిష్కారం దొరకుతుందని అంతా భావించారు. కానీ 15న జరిగిన బహిరంగసభలో సుమారు 32 నిమిషాలు ప్రసంగించిన సీఎం జగన్ కేవలం తాను, తన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించడానికి, రాజకీయంగా తనను అణగదొక్కేందుకు యత్నిస్తున్నారంటూ తనకు గిట్టని రాజకీయనేతలు, పత్రికలపై అక్కసు వెళ్లగక్కడానికే ప్రాధాన్యం ఇచ్చి, ప్రసంగాన్ని అక్కడితో సరిపెట్టేయడంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు.
ప్లాంట్ సమస్యను ప్రస్తావించని ముఖ్యమంత్రి
రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన భారీ పరిశ్రమ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రకటించింది. దీంతో పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మిక సంఘాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. ఇప్పటికి 521 రోజులుగా ఆందోళనలు, నిరసనలు, బంద్‌లు నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమాలు జరుగుతుండగానే, కేంద్ర ప్రభుత్వం దశలవారీగా ఒక్కో విభాగం నిర్వహణను ప్రైవేటుకి అప్పగిస్తూ వస్తోంది. ఈ తరుణంలో నగరానికి వచ్చిన సీఎం జగన్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మాట్లాడకపోవడం దారుణమని దుమ్మెత్తిపోస్తున్నారు. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని సింహాచలం పంచగ్రామాల సమస్యపైనా ఆయన పెదవి విప్పలేదు. ఈ సమస్యతో కొన్నివేల మంది ముడిపడి ఉన్నా పట్టించుకోలేదు. అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానంటూ ప్రతిపక్షనేత హోదాలో ఇచ్చిన హామీని పట్టిచుకోలేదు.
తూతూమంత్రపు హామీలే...
తూర్పు నియోజకవర్గం పరిధిలో ఫ్లైఓవర్ నిర్మాణం, వరదనీటి పారుదలకు రూ.25 కోట్లు మంజూరుకు హామీ తప్ప మేర ఇతర హామీలు ఇవ్వకుండా, సమస్యలపై ప్రస్తావన లేకుండా కార్యక్రమాన్ని ముగించి వెళ్లిపోవడం దారుణమని నగరవాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తొలిసారి బహిరంగసభలో పాల్గొన్న ఏ ముఖ్యమంత్రి అయినా స్థానిక సమస్యల ప్రస్తావన, పరిష్కారానికి హామీ, అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు లాంటి నిర్ణయాలు తీసుకోవడం ఆనవాయితీ. అయినప్పటికీ సీఎం జగన్ ఆ సంప్రదాయాన్ని పట్టించుకోకపోవడంతో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఆయన చిత్తశుద్ధి ఏ పాటితో తేటతెల్లమయిందని జిల్లా వాసులు విమర్శిస్తున్నారు.
పంచగ్రామాల ఊసెత్తలేదు
పంచగ్రామాల భూ సమస్యను ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడం విచారకరం. అధికారంలోకి రాగానే పరిష్కారం చూపుతానని చెప్పి మూడేళ్లు గడిచినా పట్టించుకోలేదు. ప్రత్యేక కమిటీ వేసి, ఏళ్లు గడుస్తున్నా కదలిక లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ముఖ్యమంత్రి రెండు సార్లు జిల్లాకు వచ్చినా దీనిపై ప్రకటన చేయకపోవడం, తొలి బహిరంగ సభలో ప్రస్తావించకపోవడంతో పంచగ్రామాల ప్రజలు నిరాశ చెందారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే సమస్య పరిష్కరించాలి.
- మరడ ప్రదీప్, వ్యాపారి, గోపాలపట్నం
తీవ్రంగా నిరాశ పడ్డాం
తొలి బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మాట్లాడతారని ఆశించాం. దీక్షలకు సంఘీభావం ప్రకటిస్తారని భావించాం. కనీస ప్రస్తావన లేకుండా తీవ్రంగా నిరాశపరిచారు. అంతేకాదు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్లామని గతంలో కోరినప్పటికీ స్పందన లేదు. ఇప్పటికైన ముఖ్యమంత్రి స్పందించాలి.
- డి.ఆదినారాయణ, ‘ఉక్కు’ గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి