వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-11-16T00:54:48+05:30 IST

విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం ముదపాక పంచాయతీ పరిధిలోని గోవిందపురంలో ఒక వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

వివాహిత ఆత్మహత్య

వైసీపీ నాయకుల వేధింపులే కారణమని బంధువుల ఆరోపణ

మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించకుండా పోలీసులను అడ్డుకున్న వైనం

న్యాయం చేయాలంటూ నినాదాలు

ఇరువర్గాల మధ్య ఘర్షణ

రెండు నెలల క్రితం ఆమె సోదరుడు, టీడీపీ మద్దతుదారుడు ఆత్మహత్య

స్థలం విషయంలో ఇబ్బంది పెట్టారని పేర్కొంటున్న కుటుంబ సభ్యులు

పెందుర్తి, నవంబరు 15:

విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం ముదపాక పంచాయతీ పరిధిలోని గోవిందపురంలో ఒక వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే వైసీపీ నాయకుల వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఆరోపిస్తూ బంధువులు మంగళవారం మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించకుండా అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు నెలల క్రితం పురుగులు మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న టీడీపీ మద్దతుదారుడు సారిపల్లి సోమేశ్వరరావుకు ఈమె సోదరి. స్థల వివాదానికి సంబంధించి వైసీపీ నాయకుల వేఽధింపులతోనే అన్న, చెల్లి ఆత్మహత్యలకు పాల్పడ్డారని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

గోవిందపురంలో నివాసం వుంటున్న కడియాల అచ్చియమ్మ (36)కు పద్దెనిమిదేళ్ల క్రితం చినబాబుతో వివాహం జరిగింది. వీరికి సంతానం లేకపోవడంతో బంధువులతోనే వుంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా సోదరుడు సోమేశ్వరరావు తన కోసం కొనుగోలు చేసిన స్థలాన్ని వైసీపీ నాయకులు తమకు కాకుండా చేస్తున్నారని కొంతకాలంగా అచ్చియమ్మ ఆందోళన చెందుతుంది. ఈ స్థల వివాదం నేపథ్యంలో సోమేశ్వరరావు రెండు నెలల క్రితం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకోవడం ఆమెను మరింత కుంగదీసింది. ఇదే సమయంలో ఆ స్థలం వివాదంలో వున్నందున ఎటువంటి నిర్మాణం చేపట్టరాదంటూ ఈ నెల రెండో తేదీన పంచాయతీ కార్యాలయం నుంచి నోటీసు రావడంతో ఆమె మనస్తాపానికి గురైంది. వైసీపీ నాయకులు తనను కూడా వేధిస్తూ నోటీసు జారీ చేయించారని బంధువుల వద్ద ఆవేదన వ్యక్తం చేసేది.

బావిలో దూకి ఆత్మహత్య

ఈ క్రమంలో తీవ్ర మానసిక వ్యథకు గురైన అచ్చియమ్మ సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. భర్త, బంధువులు ఆమె కోసం వెతికారు. మంగళవారం వేకువజామున గోవిందపురం సమీపంలోని వ్యవసాయ బావిలో అచ్చియమ్మ శవమై కనిపించింది. దీంతో బంధువులు ‘100’కు డయల్‌ చేసి పోలీసులకు సమాచారం అందించారు. రెండు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్న టీడీపీ మద్దతుదారు సోమేశ్వరరావుకు అచ్చియమ్మ సోదరి కావడంతో వివాదం తలెత్తే అవకాశం వుందని గమనించి గోవిందపురంలో పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు. అగ్నిమాపక సిబ్బందిని పోలీసులు రప్పించి వారి సహాయంతో బావిలోనుంచి అచ్చియమ్మ మృతదేహాన్ని బయటకు తీయించారు.

మృతదేహం తరలింపులో ఉద్రిక్తత

అచ్చియమ్మ మృతదేహాన్ని హడావిడిగా అక్కడ నుంచి అంబులెన్స్‌లో తరలించేందుకు పోలీసులు యత్నించగా బంధువులు అడ్డుకున్నారు. వైసీపీ నాయకుల వేధింపుల వల్లే అచ్చియమ్మ మృతి చెందిందని, ఆమె మృతికి కారణమైన వారిని అరెస్టు చేసేంత వరకూ మృతదేహాన్ని తరలించడం కుదరదని తేల్చిచెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైసీపీ నాయకుల వేధింపుల వల్లే అన్నచెల్లి మృతి చెందారంటూ అచ్చియమ్మ బంధువులు నినాదాలు చేశారు. మృతదేహం తరలింపులో జాప్యం చోటుచేసుకోవడంతో పోలీస్‌ ఉన్నతాధికారులు బంధువులతో చర్చించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతామన్నా బంధువులు శాంతించలేదు. దీంతో బలవంతంగా మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఎక్కించి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

పెందుర్తి ఎస్‌ఐకు తీవ్ర గాయాలు

అచ్చియమ్మ మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించే క్రమంలో అక్కడ వున్న పెందుర్తి ఎస్‌ఐ రాంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్‌ను పలువురు అడ్డుకోవడంతో వారిని నియంత్రించేందుకు ఎస్‌ఐ యత్నిస్తుండగా...అంబులెన్స్‌ కాస్త ఆయన్ను రాసుకుని వెళ్లింది. దీంతో ఎస్‌ఐ కింద పడిపోయారు. ఆయన కాలి మడమ మెలి తిరగడంతో పాటు తీవ్ర గాయమైంది. ఆయనను చికిత్స నిమిత్తం పోలీసులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

మాజీ మంత్రి, టీడీపీ నేత ‘బండారు’ ఆగ్రహం

అచ్చియమ్మ మృతి విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పలువురు టీడీపీ నాయకులతో కలిసి పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా వారికి రశీదు ఇవ్వకపోవడమేమటిటని ప్రశ్నించారు. మృతురాలి సోదరుడు సోమేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నప్పుడే వేధింపులకు పాల్పడిన వైసీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి వుంటే అచ్చియమ్మ ఆత్మహత్యకు పాల్పడేది కాదన్నారు.

అంతకుముందు టీడీపీ నాయకులు బండారు అప్పలనాయుడు, రెడ్డి నారాయణరావు, కరక దేవుడు, సర్పంచులు గొర్లె రామకృష్ణ, గొరపల్లి నరసింగరావు, మాజీ సర్పండ్‌ కోరిబిల్లి సుందరరావు గోవిందపురంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి బంధువు సారిపల్లి భీమేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ గొలగాని అప్పారావు తెలిపారు.

Updated Date - 2022-11-16T00:54:49+05:30 IST