డీసీఎంఎస్‌ అభివృద్ధికి కృషి చేస్తా

ABN , First Publish Date - 2022-10-01T07:00:53+05:30 IST

డీసీఎంఎస్‌ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని చైర్‌పర్సన్‌ పల్లా చినతల్లి తెలిపారు.

డీసీఎంఎస్‌ అభివృద్ధికి కృషి చేస్తా
మహాజన సభలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ చినతల్లి

  మహాజన సభలో చైర్‌పర్సన్‌ చినతల్లి

అనకాపల్లి అర్బన్‌, సెప్టెంబరు 30: డీసీఎంఎస్‌ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని చైర్‌పర్సన్‌ పల్లా చినతల్లి తెలిపారు. స్థానిక డీసీఎంఎస్‌ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన 47వ మహాజన సభలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. డీసీఎంఎస్‌ స్థలంలో పెట్రోల్‌ బంకు ఏర్పాటుకు గత ఏడాదే ప్రతిపాదనలు చేశామని, ఇందుకు సంబంధించి అన్ని అనుమతులు వచ్చాయన్నారు.  అయితే స్థలం సర్వే నంబరు విషయంలో సమస్య ఉండడం వల్ల బంకు ఏర్పాటు కాలేదన్నారు. ఆ సమస్యను పరిష్కరించి బంకు ఏర్పాటు చేస్తామని వివరించారు.  అలాగే అదే ప్రాంగణంలో కల్యాణ మండపం నిర్మించే ప్రతిపాదన ఉందన్నారు. మార్కెట్‌లో ఉన్న డీసీఎంఎస్‌ స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌, కోల్డ్‌ స్టోరేజీ ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. ఇవి కార్యరూపం దాలిస్తే నష్టాల్లో ఉన్న డీసీఎంఎస్‌ లాభాలబాట పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బిజినెస్‌ మేనేజర్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న డీసీఎంఎస్‌ను ఈ ఏడాది కాస్త మెరుగైన వ్యాపారం చేయడం వల్ల నష్టాన్ని తగ్గించగలిగామన్నారు. ప్రస్తుతం గత మార్చి నెలాఖరుకు రూ.85.89లక్షలు నికర నష్టంలో ఉందన్నారు. ఈ సభలో సభ్యులు పాండ్రంగి అప్పారావు, బంగారి అప్పలనర్సమ్మ, పి.డి.గాంధీ, నందార సుప్రియ, గుమ్ముడు సత్యదేవ్‌లతో పాటు మునగపాక, నాగులాపల్లి, తిమ్మరాజుపేట పీఏసీఎస్‌ అధ్యక్షులు కోనపల్లి రామ్మోహనరావు, మళ్ల ఉమామహేశ్వరరావు, కాండ్రేగుల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

పీఏసీఎస్‌ల అధ్యక్షుల కార్యవర్గం ఎన్నిక

జిల్లాలోని సహకార సంఘాల అధ్యక్షులు మొదటిసారిగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అధ్యక్షుడిగా సేనాపతి సత్యారావు, ఉపాధ్యక్షులుగా కోనపల్లి రామ్మోహనరావు, పి.డి.గాంధీ, కార్యదర్శిగా ఎం.కొండబాబు, సంయుక్త కార్యదర్శిగా ఎస్‌.వెంకటరమణ, కోశాధికారిగా ఎస్‌.కొండలరావు ఎన్నికయ్యారు. 

Read more