ప్రధాని ఎందుకొస్తున్నారబ్బా...?

ABN , First Publish Date - 2022-11-03T00:53:00+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీ విశాఖపట్నం పర్యటన వెనుక ఉద్దేశం ఏమిటా?...అనే దానిపై నగరంలో చర్చ మొదలైంది. బీజేపీకి సమాచారం లేకుండా, ఆ పార్టీ నాయకుల ప్రమేయం లేకుండా ప్రధాని సభకు వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేయడాన్ని ప్రతిఒక్కరూ రాజకీయ కోణంలో చూస్తున్నారు. ప్రధాని ఇప్పుడు విశాఖపట్నం రావలసినంత అవసరం ఏమిటనే దానిపై కూడా పలువురు నొసలు చిట్లిస్తున్నారు. ప్రధాని స్థాయిలో చేయాల్సిన శంకుస్థాపనలు ఏమీ లేవని, ఇప్పుడు ఆయన చేతులు మీదుగా చేస్తామని చెబుతున్న ప్రాజెక్టులన్నీ గతంలోనే ప్రకటించినవని గుర్తుచేస్తున్నారు.

ప్రధాని ఎందుకొస్తున్నారబ్బా...?

బీజేపీ నేతలకు సమాచారం నిల్‌

హడావిడి అంతా వైసీపీ నాయకులదే...

రూ.10,472 కోట్లతో 7 ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్టు కలెక్టర్‌ వెల్లడి

గతంలో ప్రకటించిన, పనులు జరుగుతున్నవే అధికం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ప్రధాని నరేంద్రమోదీ విశాఖపట్నం పర్యటన వెనుక ఉద్దేశం ఏమిటా?...అనే దానిపై నగరంలో చర్చ మొదలైంది. బీజేపీకి సమాచారం లేకుండా, ఆ పార్టీ నాయకుల ప్రమేయం లేకుండా ప్రధాని సభకు వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేయడాన్ని ప్రతిఒక్కరూ రాజకీయ కోణంలో చూస్తున్నారు. ప్రధాని ఇప్పుడు విశాఖపట్నం రావలసినంత అవసరం ఏమిటనే దానిపై కూడా పలువురు నొసలు చిట్లిస్తున్నారు. ప్రధాని స్థాయిలో చేయాల్సిన శంకుస్థాపనలు ఏమీ లేవని, ఇప్పుడు ఆయన చేతులు మీదుగా చేస్తామని చెబుతున్న ప్రాజెక్టులన్నీ గతంలోనే ప్రకటించినవని గుర్తుచేస్తున్నారు. కాగా ఇప్పటివరకు వాటిని ప్రారంభించకపోవడం ఆ పనుల్లో జాప్యాన్ని బయటపెడుతోందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా ఏ ప్రయోజనాన్ని ఆశించి ప్రధాని విశాఖపట్నం వస్తున్నారనే దానిపై ఆ పార్టీ (బీజేపీ) నాయకులు కూడా సమాధానం చెప్పులేకపోతున్నారు. తమకు ఆ వేదికపైకి ఆహ్వానం కూడా వుంటుందో లేదోనని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, ఇప్పటివరకు ఏడు ప్రాజెక్టులకు రూ.10,472 కోట్లతో శంకుస్థాపనలు చేయించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ప్రకటించినా ప్రారంభం కాని పనులు

- రాయపూర్‌-విశాఖపట్నం మధ్య ఆరు వరుసలతో ఎకనామిక్‌ కారిడార్‌ పనులు శరవేగంతో జరుగుతున్నాయి. అనేక చోట్ల భూసేకరణ చేసి బైపాస్‌ రహదారుల నిర్మాణం, జాతీయ రహదారి విస్తరణ పనులు చేస్తున్నారు. దానికి రూ.3,778 కోట్లతో ఇప్పుడు శంకుస్థాపన చేయిస్తున్నారు.

- ఫిషింగ్‌ హార్బర్‌ను రూ.152 కోట్లతో ఆధునికీకరిస్తామని విశాఖపట్నం పోర్టు ఎప్పటి నుంచి చెబుతోంది. దానికి ఇప్పుడు ప్రధాని చేతులు మీదుగా శంకుస్థాపన చేయిస్తున్నారు.

- విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ ప్రతిపాదనలు కూడా ఏడాది క్రితం జరిగినవే. ఆరు నెలల క్రితం వాటికి డిజైన్లు తయారుచేశారు. మూడు నెలల క్రితం నిధులు మంజూరుచేశారు. ఇపుడు ప్రధాని చేతులు మీదుగా వాటి పనులు ప్రారంభించనున్నారు.

- కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి షీలానగర్‌ వరకు రహదారిని సరకు రవాణా వాహనాల కోసం విశాఖపట్నం పోర్టు అభివృద్ధి చేస్తోంది. దీనికి రూ.566 కోట్లు కేటాయించింది. ఇది కూడా ఏడాది క్రితం ప్రతిపాదన. దీనిని కూడా ప్రధాని ప్రారంభిస్తున్నారు.

ఇవే కొత్తవి

- నరసన్నపేట నుంచి ఇచ్ఛాపురం వరకు ఆరు వరుసల రహదారి.

- శ్రీకాకుళం నుంచి అంగుళ వరకు రూ.2,658 కోట్లతో గెయిల్‌ పైపులైన్‌.

- ఓఎన్‌జీసీకి సంబంధించి ఆఫ్‌షోర్‌ ప్రాజెక్ట్‌.

...ఇవి కాకుండా కొత్తగా మరికొన్ని ప్రధాని కార్యక్రమంలో వచ్చి చేరే అవకాశం వుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకత్వం అంగీకరిస్తే... విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ కార్యాలయం పనులకు రూ.101 కోట్లతో శంకుస్థాపన జరుగుతుంది.

Updated Date - 2022-11-03T00:53:07+05:30 IST