వనవిహార్‌పై అత్యుత్సాహం చూపిందెవరు!?

ABN , First Publish Date - 2022-11-30T01:05:46+05:30 IST

పక్కాగా ప్రభుత్వ భూమి అని తెలిసినప్పటికీ అటవీ శాఖకు చెందిన ‘వనవిహార్‌’లో సర్వే చేయించేందుకు అత్యుత్సాహం చూపిన అధికారి ఎవరనే విషయంపై నగరంలో ప్రస్తుతం చర్చ నడుస్తోంది.

వనవిహార్‌పై అత్యుత్సాహం చూపిందెవరు!?

రెవెన్యూ డివిజనల్‌ అధికారా?, జీవీఎంసీ కమిషనరా??

ఇంతకీ ‘స్పందన’లో దరఖాస్తు అందింది ఎవరికి...

ఎవరో దరఖాస్తు చేసినంత మాత్రాన ముందువెనుకా చూడకుండా

అటవీ భూమి సర్వేకు ఆదేశాలు ఇచ్చేస్తారా

ఆ శాఖ అధికారులు ఇచ్చిన సమాధానాన్ని కూడా పరిగణనలోకి తీసుకోరా...

పక్కా ప్రభుత్వ భూమి అని తెలిసినా సర్వే చేయించడంపై అనుమానాలు

ఎవరి ప్రయోజనం కోసం ఇంతకు తెగించారనే ప్రశ్నలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పక్కాగా ప్రభుత్వ భూమి అని తెలిసినప్పటికీ అటవీ శాఖకు చెందిన ‘వనవిహార్‌’లో సర్వే చేయించేందుకు అత్యుత్సాహం చూపిన అధికారి ఎవరనే విషయంపై నగరంలో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. సర్వే చేయడానికి వెళ్లిన సిబ్బంది మాత్రం జీవీఎంసీ కమిషనర్‌, ఆర్డీవోల ఆదేశాలతోనే తాము వచ్చామని వెల్లడించారు. కానీ ఆ విషయం తనకు తెలియదని జీవీఎంసీ కమిషనర్‌ చెబుతుంటే...తన దృష్టికి సర్వే విషయమే రాలేదని రెవెన్యూ డివిజనల్‌ అధికారి (ఆర్‌డీఓ) చెబుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వాల్తేరు సర్వే నంబర్‌ 88/1బి3లో తమ పూర్వీకులు 1960లో 3.62 ఎకరాలు కొనుగోలు చేశారని, అది ఎక్కడుందో సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించి, తనకు అప్పగించాలంటూ ఒక మహిళ ‘స్పందన’లో దరఖాస్తు చేసుకున్నట్టు సర్వే సిబ్బంది చెప్పుకొచ్చారు. అయితే స్పందనలో జీవీఎంసీ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నారా? లేక కలెక్టరేట్‌లో దరఖాస్తు చేసుకున్నారా?...అనే విషయం చెప్పకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. స్పందనలో దరఖాస్తు చేసుకున్నట్టయితే ఆ దరఖాస్తుదారుడికి సంబంధించిన ఒక సీరియల్‌ నంబర్‌ కేటాయించడంతోపాటు, దరఖాస్తుతోపాటు అందజేసిన పత్రాలు కూడా సంబంధిత అధికారుల వద్ద ఉండాలి. కానీ అలాంటివి ఏవీ సర్వేకు వచ్చిన అధికారుల వద్ద కనిపించలేదు. ఒకవేళ ఎవరైనా తమ భూమి అంటూ క్లెయిమ్‌ చేసుకోవాలనుకుంటే ఆ భూమికి సంబంధించిన పత్రాలు, తమకు ఎలా సంక్రమించిందనే ఆధారాలు కూడా దరఖాస్తుతోపాటు సమర్పించాలి. వాటిని అధికారులు తమ వద్ద వున్న రికార్డుల్లో ముందుగా పరిశీలించాలి. ఆ మహిళ దరఖాస్తుతోపాటు అలాంటి పత్రాలను అందజేస్తే ప్రాథమికంగా రికార్డులు పరిశీలించాలి. ఆ భూమి అటవీ శాఖదని అధికారులు నిర్ధారించుకుని ఆమెకు సమాధానం అందజేయాలి. అలాకాకుండా ఆమె దరఖాస్తు చేయగానే వెనుకాముందు చూడకుండా ‘వనవిహార్‌’ భూమిని సర్వే చేసి నివేదిక ఇవ్వాలంటూ జీవీఎంసీ టౌన్‌ సర్వేయర్‌ను ఆదేశించడం అనేక అనుమానాలకు దారితీసినట్టయింది. భూముల సర్వే చేసి సర్టిఫికెట్‌ ఇవ్వాలంటూ ఎంతోమంది జీవీఎంసీ, రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు చేసుకుంటుంటారు. నెలలు గడిచినా సర్వే చేయకపోవడంతో వారంతా కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటారు. అలాంటిది ఒక మహిళ ప్రభుత్వభూమిలో తనకు భూమి వుందని దరఖాస్తు చేయగానే ఆగమేఘాల మీద సర్వే కోసం సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీచేయడం విచిత్రంగా ఉంది. ఎవరి ఒత్తిడితో సదరు అధికారులు అలా చేశారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే సర్వే చేయడానికి వెళ్లినప్పుడు ఒక విధానాన్ని పాటించాల్సి ఉంటుందని గుర్తుచేస్తున్నారు. వనవిహార్‌ భూములు సర్వే కోసం వెళ్లడానికి నెల రోజులు ముందు జీవీఎంసీ టౌన్‌సర్వేయర్‌ అటవీ శాఖ అధికారులకు ఒక నోటీసు అందజేశారు. జీవీఎంసీ నుంచి నోటీసు జారీచేస్తే ముందుగా ఎస్టేట్‌ విభాగంలో దానికి ఒక సీరియల్‌ నంబర్‌, సీసీ నంబర్‌ వేసి, రిఫరెన్స్‌ అధికారి పేరు కూడా రాయాలి. కానీ అటవీ శాఖ అధికారులకు అందజేసిన నోటీసులో అలాంటి విధానం ఏదీ పాటించలేదు. అయినప్పటికీ నోటీస్‌ జారీచేసిన జోన్‌ 3, 4 సర్వేయర్‌కు ఈనెల 25వ తేదీన అటవీ శాఖ అధికారులు సమాధానం పంపుతూ...అందులో గల వనవిహార్‌పై తమకు వున్న హక్కులకు సంబంధించిన పత్రాల వివరాలను కూడా పొందుపరిచారు. దానిని పట్టించుకోకుండా ఈనెల 26న జీవీఎంసీ సిబ్బంది వనవిహార్‌ సర్వేకు సిద్ధమైపోయారు. అటవీ అధికారులకు ఎటువంటి సమాచారం లేకుండా భవన ప్రాంగణంలోకి వచ్చేశారు. ఏదో ఒకలా సర్వే చేసి, అందులో ఎక్కడో ప్రైవేటు భూమి వుందని చెప్పి నివేదిక అందజేయాలని సర్వేకు ఆదేశించిన అధికారులు భావించి వుండవచ్చునని అంటున్నారు. కానీ ‘ఆంధ్రజ్యోతి’లో దీనిపై సమగ్ర కథనం ప్రచురితం కావడంతో అధికారుల వ్యూహం విఫలమైందని పేర్కొంటున్నారు. ఇదిలావుంటే ఎవరైనా ప్రభుత్వ భూమి లేదా వేరొకరికి చెందిన భూమి తనదంటూ తప్పుడు పత్రాలతో అధికారులను తప్పుదారిపట్టించేందుకు యత్నిస్తే వారిపై క్రిమినల్‌ చర్యలకు సిఫారసు చేయాల్సి ఉంటుంది. కానీ ‘వనవిహార్‌’ భూములు కొట్టేయడానికి ప్రయత్నించిన వారిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

వనవిహార్‌ సర్వేలో నిబంధనలకు తూట్లు

రెవెన్యూ, జీవీఎంసీలకు అటవీ అధికారుల లేఖ

ఊరు, పేరు లేకుండా గ్రేటర్‌ నుంచి గత నెల 19న నోటీస్‌

ఈనెల 25నే తగిన ఆధారాలతో సమాధానమిచ్చినట్టు వెల్లడి

...అయినా 26న సర్వే

1980 అటవీ చట్టం మేరకు భూమి బదలాయింపు కుదరదని స్పష్టీకరణ

విశాఖపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి):

‘వనవిహార్‌’ వ్యవహారంలో రెవెన్యూ, జీవీఎంసీ, అటవీ శాఖల మధ్య సమన్వయలోపం కొరవడింది. ఆ భూమిని అటవీ శాఖకు ప్రభుత్వం కేటాయించినట్టు అడంగల్‌లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ప్రైవేటు వ్యక్తికి ప్రయోజనం చేకూర్చేందుకు రెవెన్యూ యంత్రాంగం, జీవీఎంసీ అధికారులు ఉవ్విళ్లూరినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. వనవిహార్‌ సర్వే విషయంలో జీవీఎంసీ అధికారులు నిబంధనలు పాటించలేదని కలెక్టర్‌, జీవీఎంసీ కమిషనర్‌లకు రాసిలో లేఖలో అటవీ శాఖ అధికారులు ఆక్షేపించారు. సర్వే సమయంలో కనీస పద్ధతులు పాటించలేదని తప్పుబట్టారు. ఆ భూమిని ప్రభుత్వం సుమారు ఆరు దశాబ్దాల క్రితం అటవీ శాఖకు కేటాయించిందని పేర్కొంటూ...1980 అటవీ చట్టం ప్రకారం ఒకసారి కేటాయించిన భూమిని ఇతర అవసరాలకు వినియోగించడం, లీజుకు ఇవ్వడం కుదరదని లేఖలో స్పష్టంచేశారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు లేఖలో అంశాలు...

- వనవిహార్‌ను ఈనెల 26వ తేదీ ఉదయం 10.30 గంటలకు సర్వే చేస్తామని గత నెల 19న జీవీఎంసీలో జోన్‌-3,4కు సంబంధించిన సర్వేయర్‌ నుంచి తమ కార్యాలయానికి ఒక నోటీస్‌ అందిందని, అయితే ఆ నోటీస్‌పై ఎటువంటి ఫైల్‌ నంబరు/రిఫరెన్స్‌ నంబరుగానీ లేవని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. నోటీస్‌ జారీచేసే సమయంలో నిబంధనలు పాటించలేదు సరికదా...దానిని జారీచేసిన అధికారి పేరు, హోదా ప్రస్తావించలేదన్నారు. సదరు నోటీస్‌ను తమ కార్యాలయం జారీ చేసిందనే విషయాన్ని జీవీఎంసీ అధికారులు నిర్ధారించాలని వివరించారు. అయినా నోటీస్‌ జారీచేసిన జోన్‌ 3, 4 సర్వేయర్‌కు ఈనెల 25వ తేదీన తమ శాఖ సమాధానం పంపుతూ...అందులో గల వనవిహార్‌పై తమకు వున్న హక్కులకు సంబంధించిన పత్రాల వివరాలను కూడా పొందుపరిచామని తెలిపారు. ఈనెల 26న వనవిహార్‌ సర్వేకు వస్తామని జీవీఎంసీ నుంచి ఎటువంటి సమాచారం లేదని, సరాసరి అనుమతి లేకుండా భవన ప్రాంగణంలోకి సర్వేయర్‌, ఇతర సిబ్బంది వచ్చేశారని ఆరోపించారు. ఈ సర్వేకు అటవీ శాఖ నుంచి అధికారులు ఎవరు హాజరుకాలేదని స్పష్టంచేశారు.

- వాల్తేర్‌ వార్డు సర్వే నంబర్‌ 88/ఎ-11లో 11.8 ఎకరాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం, అటవీ శాఖకు ప్రభుత్వం రిజర్వు చేసినట్టు రెవెన్యూ అడంగల్‌లో వుందని పేర్కొంటూ ఆ కాపీలను అటవీ అధికారులు తమ లేఖతో జత చేశారు. ఇదే భూమిలో చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు బంగ్లా, ఎస్టేట్‌ విభాగానికి 2.08 ఎకరాలు కేటాయించడంతో అదంతా గడచిన ఆరు దశాబ్దాల నుంచి అటవీ శాఖ పరిధిలో వుందని స్పష్టంచేశారు. అటవీ శాఖకు భూమి కేటాయించిన తరువాత ఇంతవరకూ ఎవరు ఆ భూమి కోసం క్లెయిమ్‌ చేయలేదని వివరించారు. ఈ నేపథ్యంలో వనవిహార్‌లో ఎటువంటి సర్వే చేయరాదని జీవీఎంసీ కమిషనర్‌ను కోరారు. 1980లో వచ్చిన అటవీ శాఖ చట్టం ప్రకారం అటవీ శాఖకు దఖలు పడిన భూమి ఇతరులకు కేటాయించడం, లీజుకు ఇవ్వడం, అటవీయేతర పనులకు వినియోగించరాదని వివరిస్తూ వనవిహార్‌ భూమి అటవీ శాఖదే తప్ప మరొకరికి హక్కులేదని విస్పష్టంగా పేర్కొన్నారు.

Updated Date - 2022-11-30T01:05:46+05:30 IST

Read more