శరత్‌చంద్రారెడ్డి చెవిలో చెవిరెడ్డి ఏం ఊదారు?

ABN , First Publish Date - 2022-11-23T03:15:12+05:30 IST

‘ఆదాన్‌ డిస్టిలరీస్‌, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో తమకు సంబంధాలు లేవని పొట్టి సారాయి విజయసాయిరెడ్డి చెప్పారు....

శరత్‌చంద్రారెడ్డి చెవిలో చెవిరెడ్డి ఏం ఊదారు?

ఈడీ అధికారులు ఏం చేస్తున్నారు?

చెవిరెడ్డిని కూడా అరెస్ట్‌ చేసి విచారించాలి

ఆయన ఏపీకి రాకుండా ఢిల్లీలోనే ఉంచాలి: ఆనం

నెల్లూరు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘ఆదాన్‌ డిస్టిలరీస్‌, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో తమకు సంబంధాలు లేవని పొట్టి సారాయి విజయసాయిరెడ్డి చెప్పారు. నిజంగా వారికి సంబంధం లేకపోతే జగ్గూ భాయ్‌ (జగన్మోహన్‌రెడ్డి) టీంలోని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఢిల్లీకి ఎందుకెళ్లారు? ఈడీ కస్టడీలో ఉన్న శరత్‌ చంద్రారెడ్డిని ఎందుకు కలిశారు? ఆయన చెవిలో చెవిరెడ్డి ఏం ఊదారు? ఏం మంతనాలు జరిపారు?’ అంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి నిలదీశారు. శరత్‌చంద్రారెడ్డితో చెవిరెడ్డి మంతనాలు జరుపుతున్న వీడియోను ఆయన మంగళవారం నెల్లూరులో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆనం విలేకరులతో మాట్లాడుతూ చెవిరెడ్డిని జగన్మోహన్‌రెడ్డే ఢిల్లీకి పంపారని ఆరోపించారు. ‘‘వారి డబ్బుల లావాదేవీలు బయటపెడితే బాబాయ్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారా? లేక అన్నున్నాడు... అమిత్‌ షా కాళ్లయినా పట్టుకొని రక్షించుకుంటామని శరత్‌ చంద్రారెడ్డికి భరోసా ఇచ్చారా?’’ అని ఆయన ప్రశ్నించారు. కస్టడీలో ఉన్న వ్యక్తిని ఒక ఎమ్మెల్యే కలుస్తుంటే ఈడీ అధికారులు ఏం చేస్తున్నారని ఆనం నిలదీశారు. ఇది పూర్తిగా సీబీఐ, ఈడీ వైఫల్యమన్నారు.

వెంటనే చెవిరెడ్డిని అరెస్టు చేసి విచారించాలని ఈడీ అధికారులను డిమాండ్‌ చేశారు. శరత్‌ చంద్రారెడ్డి ప్రాణానికి హాని ఉందని, ఆయనకు జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలని కోరారు. ఆయన అప్రూవర్‌గా మారతారనే ప్రచారం జరుగుతోంది కాబట్టి ఏపీకి రానీయకుండా ఢిల్లీలోనే ఉంచాలని సూచించారు. మద్యం స్కామ్‌కు సంబంధించి వెతకాల్సింది ఢిల్లీలో కాదని, తాడేపల్లిలో అని ఆనం వ్యాఖ్యానించారు. అదాన్‌ డిస్టిలరీతో జగ్గూ భాయ్‌ కుటుంబానికి సంబంధం ఉందని, ఈ డిస్టిలరీ ద్వారా కల్తీ మద్యం విక్రయించి రూ.వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. అదాన్‌ డిస్టిలరీకి రూ.100 కోట్లు చేబదులు ఇచ్చిన వ్యక్తులు ఎవరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి దావో్‌సకు వెళ్లింది రాష్ట్రాభివృద్ధి కోసం కాదని, అక్రమ సంపాదన లెక్కలు చూసుకునేందుకని ఆనం ఆరోపించారు. విమానాల్లో నల్లధనం తరలిస్తున్నారంటూ ఈ ఏడాది మే నెలలోనే తాము చెప్పామని, ఇప్పుడు ఇదే విషయంపై ఈడీ దర్యాప్తు చేస్తోందన్నారు. ప్రత్యేక విమానంలో వెళ్లేటప్పుడు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచే ఎందుకెళ్లారని, రాష్ట్రంలో గన్నవరం విమానాశ్రయం లేదా అంటూ ప్రశ్నించారు. 18 సీట్లు ఉన్న విమానంలో కేవలం నలుగురే..నల్లధనంతో ప్రయాణించారని ఆరోపించారు.

Updated Date - 2022-11-23T03:15:12+05:30 IST

Read more