కార్యాలయ భవన నిర్మాణం ఆశలపై నీళ్లు!

ABN , First Publish Date - 2022-10-12T06:24:53+05:30 IST

స్థానిక నూతన రెవెన్యూ కార్యాలయ భవన నిర్మాణం కలగానే మిగిలింది.

కార్యాలయ భవన నిర్మాణం ఆశలపై నీళ్లు!
పునాదులకే పరిమితమైన తహసీల్దార్‌ కార్యాలయ నూతన భవనం

- గత ప్రభుత్వ హయాంలో తహసీల్దార్‌ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి శ్రీకారం

- రూ.70 లక్షలు మంజూరు

- 25 శాతం పనులు పూర్తికాలేదని రద్దుచేసిన వైసీపీ ప్రభుత్వం

- పునాదులకే పరిమితమైన భవన నిర్మాణం

- వర్షాలకు కారిపోతున్న ప్రస్తుత కార్యాలయం

- ఉద్యోగులకు తప్పని ఇబ్బందులు


చింతపల్లి, అక్టోబరు 11: స్థానిక నూతన రెవెన్యూ కార్యాలయ భవన నిర్మాణం కలగానే మిగిలింది. 2018లో చేపట్టిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో పునాదులే దర్శనమిస్తు న్నాయి. ప్రస్తుతం ఉన్న భవనం శిథిల స్థితిలో ఉండడం, వానొస్తే శ్లాబ్‌ గుండా గదుల్లోకి నీరు కారిపోతుండడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. 

ప్రస్తుత భవనం శిథిలావస్థలో ఉండడంతో 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం చింతపల్లిలో నూతన రెవెన్యూ భవన నిర్మాణానికి రూ.70 లక్షలు మంజూరు చేసింది. నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను తొలిసారిగా హౌసింగ్‌శాఖ(ప్రాజెక్టు)కు అప్పగించింది. మండల పరిషత్‌ ఆవరణలోని రెవెన్యూశాఖ స్థలంలో 3,792 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ-ప్లస్‌ వన్‌ భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో తహసీల్దార్‌ క్యాబిన్‌, రిసెప్షన్‌ కౌంటర్‌, సిబ్బంది గది, రికార్డు గది, ఎంఐఎస్‌ సెంటర్‌, ఏఎస్‌వో, సర్వేయర్‌, ఎంఆర్‌ఐ, ఏఆర్‌ఐలకు ప్రత్యేకంగా గదులు కేటాయించాలని ప్రణాళిక వేసింది. మహిళలు, పురుషులకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు, వాష్‌రూమ్‌లకు రూపకల్పన చేసింది. మొదటి అంతస్థులో వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌, డీటీ రెగ్యులర్‌, పౌరసరఫరాల డీటీల క్యాబిన్లు, పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి కూడా ఒక గదిని కేటాయించాలని భావించింది. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో అదే ఏడాది పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్‌ సుమారు రూ.ఎనిమిది లక్షలతో పునాదులు నిర్మించి పిల్లర్ల నిర్మాణానికి ఇనుము సిద్ధం చేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించలేదు. దీంతో నిర్మాణ పనులను ఆ కాంట్రాక్టర్‌ నిలిపివేశారు. భవన నిర్మాణం పూర్తయి తమ ఇబ్బందులు తీరతాయని ఆశించిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది.

నిర్మాణాలను రద్దుచేసిన ప్రభుత్వం

చింతపల్లి రెవెన్యూ కార్యాలయం నూతన భవనం నిర్మాణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2020లో గత ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు ప్రారంభించిన పనుల్లో 25శాతం లోపు నిర్మించి ఉంటే పనులను రద్దుచేయాలని వివిధ శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ క్రమంలో చింతపల్లి రెవెన్యూ కార్యాలయం నిర్మాణ పనులు  కూడా 25 శాతం కంటే తక్కువగా జరిగాయని ఆ నిర్మాణాన్ని రద్దు చేశారు. అయితే తాను భవన నిర్మాణానికి చేసిన రూ.8 లక్షల ఖర్చుకు సంబంధించి బిల్లులు మంజూరు చేయాలని కాంట్రాక్టర్‌ శెట్టి తిరుమల్లేశ్వరరావు పలుమార్లు అధికారులను కోరారు. అయితే ఆయన గత ఏడాది కరోనా బారిన పడి మృతి చెందారు. 

రెవెన్యూ ఉద్యోగుల అవస్థలు  

ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరడం, శ్లాబ్‌ నుంచి వర్షపు నీరు కాలిపోయి గదులు తడిసి ముద్దవుతుండడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇరుకైన వీడియో కాన్ఫరెన్స్‌ గదితో పాటు ఆర్‌ఐ, డీటీ, జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు కూర్చునేందుకు ప్రత్యేక గదులు లేకపోవడంతో ఇరుకుగా ఉన్న కేవలం నాలుగు గదుల్లోనే ఉద్యోగులు సర్దుకుని సేవలందిస్తున్నారు. 


Read more