మళ్లీ వీఎంఎస్‌

ABN , First Publish Date - 2022-10-04T07:02:47+05:30 IST

నగరంలో నేర నియంత్రణకు పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌ వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు.

మళ్లీ వీఎంఎస్‌

నాలుగేళ్ల తరువాత విజిటర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ యాప్‌ వినియోగంపై దృష్టి 

నేర నియంత్రణకు పోలీస్‌ కమిషనర్‌ నిర్ణయం

హోటళ్లు, లాడ్జిల్లో దిగేవారి వివరాలు నమోదు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


నగరంలో నేర నియంత్రణకు పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌ వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగేళ్లుగా మూలనపడిన విజిటర్స్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (వీఎంఎస్‌) యాప్‌ను తిరిగి వినియోగంలోకి తేవాలని నిర్ణయించారు. ఈ మేరకు నేర పరిశోధన విభాగం అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీనివల్ల ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి హోటళ్లు, లాడ్జిల్లో బస చేసేవారి వివరాలన్నీ పోలీసులు యాప్‌లో అప్‌లోడ్‌ చేయడం ద్వారా నేరాలు నియంత్రించడంతోపాటు ఒకవేళ నేరాలు జరిగితే వాటిని త్వరగా ఛేదించడానికి అవకాశం ఉంటుంది.

రాష్ట్రంతో పాటు దేశ, విదేశాల నుంచి ఎంతోమంది వివిధ పనులపై నగరానికి వచ్చి వెళుతుంటారు. వారంతా తిరిగి వెళ్లే వరకూ నగరంలోని ఏదో ఒక హోటల్‌ లేదా లాడ్జిల్లో బస చేస్తారు. దీంతో నగరంలో ఎక్కడికక్కడ లాడ్జిలు, మధ్య, ఉన్నత వర్గాల ప్రజలకు కావాల్సిన సౌకర్యాలతో రూమ్‌లను అందుబాటులో వుంచే హోటళ్లు వెలుస్తున్నాయి. సందర్శకులతోపాటు నగరంలో నేరాలు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా లాడ్జిలు, హోటళ్లలోనే బస చేస్తున్నారు. అయితే లాడ్జిల్లో బస చేసే సందర్శకుల వివరాలను అక్కడి సిబ్బంది సక్రమంగా నమోదుచేయకపోవడం, సందర్శకులు తప్పుడు గుర్తింపు పత్రాలను అందజేస్తుండడంతో ఏదైనా నేరం చేసి పరారైన వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. 


నాలుగేళ్ల కిందట యాప్‌ 

ఈ నేపథ్యంలో మహేష్‌ చంద్రలడ్డా సీపీగా వున్న సమయంలో నగరానికి వచ్చే కొత్త వ్యక్తుల వివరాలను సేకరించేందుకు వీలుగా విజిటర్స్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (వీఎంఎస్‌)ను అందుబాటులోకి తెచ్చారు. నేర పరిశోధన విభాగంలో పనిచేసే సిబ్బందికి ట్యాబ్‌ ఇచ్చి వీఎంఎస్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేశారు. అందులో కొత్తవ్యక్తుల వివరాలను నిక్షిప్తం చేయాలి. వాటిని రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ శాఖ గుర్తించిన పాతనేరస్థుల వివరాలతో క్రాస్‌చెక్‌ చేసుకునేందుకు అవకాశం ఉండేది. ఒక్కో పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది రాత్రి పూట తమ పరిధిలో వున్న హోటళ్లు, లాడ్జిలకు వెళ్లి అక్కడ బస చేసిన సిబ్బంది వివరాలను ఆరా తీయడంతోపాటు వాటిని వీఎంఎస్‌ యాప్‌లో నమోదు చేసేవారు. దీనివల్ల లాడ్జిల్లో బసచేసిన వారిలో ఎవరైనా పాత నేరస్థులుంటే అదుపులోకి తీసుకుని, నేర నియంత్రణకు చర్యలు చేపట్టేవారు. ఎవరైనా నేరానికి పాల్పడినట్టు తేలితే  వారి వివరాలతోపాటు, ఎక్కడివారో క్షణాల్లో తెలుసునేందుకు వీలుకలిగేది. అయితే మహేష్‌చంద్ర  బదిలీ తర్వాత వీఎంఎస్‌ యాప్‌ నిరక్ష్యానికి గురయింది. ప్రస్తుతం ఆ యాప్‌ను వినియోగించడమే లేదు. అయితే నగరంలో నేర నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల నేర పరిశోధన విభాగం అధికారులతో పోలీస్‌ కమిషనర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీఎంఎస్‌ యాప్‌ ప్రస్తావన రావడంతో తక్షణం దానిని యాక్టివేట్‌ చేయాలని ఆదేశించారు.

Read more