విద్యా శాఖలో పైసా వసూల్‌

ABN , First Publish Date - 2022-02-23T05:51:47+05:30 IST

నగరంలో ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు కొత్త వేతన సవరణ ప్రక్రియ పూర్తిచేసేందుకు అర్బన్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌ కార్యాలయ సిబ్బంది లంచం డిమాండ్‌ చేస్తున్నారు.

విద్యా శాఖలో పైసా వసూల్‌

ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల సర్వీస్‌ రిజిస్టర్‌లో పీఆర్సీ ప్రకారం జీతం వివరాలు నమోదు చేసి సంతకం చేసేందుకు రూ.3 వేలు నుంచి రూ.5 వేలు డిమాండ్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు కొత్త వేతన సవరణ ప్రక్రియ పూర్తిచేసేందుకు అర్బన్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌ కార్యాలయ సిబ్బంది లంచం డిమాండ్‌ చేస్తున్నారు. సర్వీస్‌ రిజిస్టర్‌లో నూతన పీఆర్సీ వివరాలు నమోదుచేసి, డీఐ సంతకం చేయించి స్టాంపు వేసేందుకు రూ.మూడు వేల నుంచి ఐదు వేల వరకు వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కొందరు ఎయిడెడ్‌ టీచర్లు విద్యా శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు జనవరి నెల నుంచి కొత్త వేతన సవరణ అమలుచేశారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు తీసుకునేందుకు టీచర్లు, ఉద్యోగులు ముందుకురాకపోవడంతో ప్రభుత్వమే నేరుగా అందరి ఖాతాల్లో జమ చేసిన విషయం విదితమే. అయితే కొత్త వేతన సవరణ మేరకు ప్రతి ఉద్యోగి/ఉపాధ్యాయుడు తన జీతం వివరాలను సర్వీస్‌ రిజిస్టర్‌ (ఎస్‌ఆర్‌)లో నమోదు చేయించుకోవాలి. ఎస్‌ఆర్‌లో కొత్త వేతన వివరాలు నమోదును డ్రాయింగ్‌ అండ్‌ డిస్‌బర్స్‌మెంట్‌ అధికారి (డీడీవో) పరిశీలించి...సంతకం చేయాల్సి ఉంది. కొత్తవేతన సవరణ అమలులోకి వచ్చిన ప్రతిసారి ఈ ప్రక్రియ జరుగుతుంటుంది. అయితే జనవరి జీతాలు ప్రభుత్వం నేరుగా ఉద్యోగ/ఉపాధ్యాయుల ఖాతాలకు జమ  చేసినప్పటికీ, అవి సరిగా ఉన్నాయా? లేదా? అనేది ప్రతి ఒక్కరూ సరి చూసుకుని ఆ వివరాలను సర్వీస్‌ రిజిస్టర్‌లో నమోదు చేసుకోవాలి. నగరంలో ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేసే సుమారు 250 మంది ఉపాధ్యాయులు, మరో 40 మంది నాన్‌టీచింగ్‌ ఉద్యోగులకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌ డీడీవోగా వ్యవహరిస్తున్నారు. అంటే వీరందరి జీతాల బిల్లులు అప్‌లోడ్‌ చేసే బాధ్యత ఆయనదే. ఈ క్రమంలో నగరంలో ఎయిడెడ్‌ పాఠశాలల టీచర్లు, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది తమ ఎస్‌ఆర్‌లు తీసుకుని అక్కయ్యపాలెం ఎన్జీవో కాలనీలోని జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో గల డీఐ కార్యాలయానికి వెళితే...అక్కడ సిబ్బంది డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎస్‌ఆర్‌లలో కొత్త వేతన సవరణ మేరకు జీతాల వివరాల నమోదును అక్కడ కొంతమంది ఎయిడెడ్‌ పాఠశాలల నాన్‌ టీచింగ్‌ సిబ్బంది (ఆన్‌డ్యూటీ) చూస్తున్నారు. అయితే వీరిలో ఎన్‌ఎడీ ప్రాంతంలోని ఎయిడెడ్‌ పాఠశాల ఉద్యోగి ఒకరు...టీచర్ల నుంచి మూడు వేల నుంచి ఐదు వేల వరకు వసూలు చేస్తున్నారు. సర్వీస్‌ రిజిస్టర్‌లో అన్ని వివరాలు నమోదుచేసి డీఐతో సంతకం పెట్టించి స్టాంపు వేయాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే ఎస్‌ఆర్‌లో కొర్రీలు వేస్తామని బెదిరిస్తున్నారు. ప్రతి నెలా జీతాల బిల్లులు పెట్టాల్సింది డీఐ కార్యాలయమేనని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. నూతన వేతన సవరణ వల్ల జీతం పెరగలేదని ఒకపక్క తామంతా గగ్గోలు పెడుతుంటే..ఎస్‌ఆర్‌పై సంతకానికి డబ్బులేమిటని టీచర్లు అసహనం వ్యక్తంచేస్తున్నారు. అయినా మౌనంగా అడిగినంత సమర్పించుకుంటున్నారు. దీనిపై కొందరు టీచర్లు పాఠశాల విద్యా ఉన్నతాధికారులకు శనివారం ఫిర్యాదుచేశారు. 

డీఐ కార్యాలయంలో ఎయిడెడ్‌ పాఠశాల ఉద్యోగి హవా..

అర్బన్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ స్కూల్స్‌ కార్యాలయంపై చాలాకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో ఉండాల్సిన డీఐ ఆఫీస్‌ అక్కడ నుంచి డాబాగార్డెన్స్‌లోని బాలిక పాఠశాలకు మార్చారు. అక్కడ నుంచి అక్కయ్యపాలెంలో జీవీఎంసీ ఉన్నత పాఠశాలకు తరలించారు.డీఈవో కార్యాలయంలో ఉంటే వసూళ్లకు ఇబ్బందిగా ఉంటుందనే,...ఇలా దూరంగా ఏర్పాటుచేసినట్టున్నారని ఎయిడెడ్‌ టీచర్లు ఆరోపిస్తున్నారు. ఎన్‌ఎడీ సమీపంలోని ఒక ఎయిడెడ్‌ పాఠశాల ఉద్యోగి ఒకరు ఈ కార్యాలయంలో బ్రోకర్‌గా ఉంటున్నారు. గతంలో ఒకసారి సస్పెండై తిరిగి అదే పాఠశాలలో ఉద్యోగం సంపాదించిన సదరు ఉద్యోగిని డీఐ కార్యాలయానికి రావద్దని గతంలో పనిచేసిన డీఈవో ఒకరు హెచ్చరించారు. అయినా ఆయన డీఐ కార్యాలయంలోనే ఉండి పైరవీలు చేస్తున్నారని ఎయిడెడ్‌ టీచర్లు ఆరోపిస్తున్నారు.  


డబ్బులు తీసుకుంటే చర్యలు - ఎల్‌.చంద్రకళ, డీఈవో

నగరంలో ఎయిడెడ్‌ టీచర్ల ఎస్‌ఆర్‌లపై కొత్త పీఆర్సీ వివరాలు నమోదు, సంతకం కోసం ఎవరైనా డబ్బులు అడిగితే చర్యలు తీసుకుంటాం. ఎస్‌ఆర్‌లలో కొత్త వేతన సవరణ వివరాలు నమోదుచేసి సంతకం చేసి స్టాంపు వేసే బాధ్యత సంబంధిత డీడీవోదే. టీచర్ల ఎస్‌ఆర్‌లు పరిశీలించి, కొత్త వేతన వివరాలు నమోదుకు ఎయిడెడ్‌ పాఠశాలల నుంచి వచ్చిన సిబ్బందిని వెంటనే వెనక్కి పంపాలని ఆదేశించాం. డబ్బులు డిమాండ్‌ చేస్తున్న వ్యవహారంపై విచారణ జరిపిస్తాం.

Updated Date - 2022-02-23T05:51:47+05:30 IST