విద్యా దీవెన ఇక్కట్లు

ABN , First Publish Date - 2022-12-10T01:18:00+05:30 IST

‘‘విద్యా దీవెన’ పథకం కింద కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు మొత్తాన్ని విడతల వారీగా విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తాం.

విద్యా దీవెన ఇక్కట్లు

2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత డబ్బులు విడుదల చేయని ప్రభుత్వం

గత విద్యా సంవత్సరం చివరి విడత నిధులు

కొద్దిరోజుల కిందట విద్యార్థుల తల్లుల ఖాతాల జమ

ఈ విద్యా సంవత్సరం ఫస్ట్‌ టర్మ్‌ ఫీజు చెల్లించాలంటూ విద్యార్థులపై పలు కళాశాలల యాజమాన్యాల ఒత్తిడి

ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు

గతంలో మాదిరిగా ఫీజు నేరుగా కళాశాలలకు జమ చేస్తే తమకు ఈ సమస్య ఉండబోదని వాదన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘‘విద్యా దీవెన’ పథకం కింద కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు మొత్తాన్ని విడతల వారీగా విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తాం. ఆ తరువాత కళాశాలలకు చెల్లిస్తే సరిపోతుంది. ఫీజు చెల్లింపు గురించి తల్లిదండ్రులు ఎవరూ బెంగపడాల్సిన అవసరం లేకుండా ఈ ప్రభుత్వం చూసుకుంటుంది. నాలుగు విడతల్లో ప్రభుత్వం ఫీజు అకౌంట్‌లో జమ చేస్తుంది’

- ఇదీ విద్యా దీవెన డబ్బులు విడుదల చేసే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చెప్పిన మాట.

...కానీ, పలు కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజును నాలుగు విడతలుగా తల్లి అకౌంట్‌లో జమ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ పని సకాలంలో చేయలేకపోతోంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోయినా...ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై పలు కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి తీసుకువస్తున్నాయి. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగో విడత విద్యా దీవెన బకాయిలను వారం కిందట ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత ఫీజు చెల్లించాల్సిన గడువు ఇప్పటికే పూర్తయింది. సాధారణంగా జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించి సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో మొదటి విడత ఫీజు చెల్లింపులు చేయాలి.

ముందే చెల్లిస్తున్న విద్యార్థులు

ప్రభుత్వం సకాలంలో విద్యా దీవెన నిధులను విడుదల చేయడం లేదు. ఈ నేపథ్యంలో పలు కళాశాలల యాజమాన్యాలు ఫీజు చెల్లించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఆ మొత్తాలను ఉంచుకోవచ్చునని చెబుతున్నాయి. యాజమాన్యాల ఒత్తిడిని తట్టుకోలేక పలువురు విద్యార్థులు ముందే ఫీజు చెల్లిస్తున్నారు. ఇలా కాలేజీ యాజమాన్యాల ఒత్తిడితో గత విద్యా సంవత్సరానికి సంబంధించిన చివరి విడత ఫీజును చాలామంది విద్యార్థులు ముందుగానే కట్టారు. ఆ విద్యార్థులకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. గత ఏడాది నాలుగో విడతకు సంబంధించిన డబ్బులను కొద్దిరోజుల కిందట ప్రభుత్వం విద్యార్థుల తల్లి అకౌంట్‌లో జమ చేసింది. అయితే, ఈ విద్యా సంవత్సరం తొలి విడత ఫీజు చెల్లించాల్సిన సమయం ముగిసినందున, ఆ మొత్తాలను తమకు కట్టాలంటూ పలు కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. యాజమాన్యం చెప్పిన తరువాత ఫీజు కట్టకపోతే మళ్లీ తమ పిల్లలు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందేమోననే ఆందోళనతో విద్యార్థుల తల్లిదండ్రులు డబ్బులు కట్టేందుకు సిద్ధపడుతున్నారు.

ఇబ్బందులు ఎందుకు..

గతంలో కళాశాలల నుంచి ఈ తరహా ఇబ్బందులు ఉండేవి కావని పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు. విద్యా దీవెన నిధులను సకాలంలో తమ అకౌంట్‌కైనా జమ చేయాలని, లేకపోతే గతంలో మాదిరిగా కాలేజీలకైనా నేరుగా చెల్లించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. గతంలో మాదిరిగా చెల్లించడం వల్ల కాలేజీలు తమను అడిగేందుకు అవకాశం ఉండదంటున్నారు. విద్యా దీవెన అమలు చేసిన తరువాత గతంలో ఎన్నడూ లేని విధంగా కళాశాలల యాజమాన్యాలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోందని, ఇది ఇబ్బందికరంగా మారుతోందని పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు.

Updated Date - 2022-12-10T01:18:01+05:30 IST