వీరప్పన్‌ ఇంట్లో గంధపు చెక్కలు పోయినట్లుంది

ABN , First Publish Date - 2022-11-25T03:39:10+05:30 IST

తాడేపల్లి ప్యాలె్‌సలో తన ఫోన్‌ పోయిందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేయడం చూస్తే వీరప్పన్‌ ఇంట్లో గంధపు చెక్కలు

వీరప్పన్‌ ఇంట్లో గంధపు చెక్కలు పోయినట్లుంది

ఫోన్‌ పోయిందని ఢిల్లీలో చెపితే ఈడీ కుమ్ముతుంది

ఆ భయంతోనే తాడేపల్లిలో నాటకాలాడుతున్నారు

విజయసాయి సెల్‌ చోరీపై బొండా ఉమ వ్యాఖ్య

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): తాడేపల్లి ప్యాలె్‌సలో తన ఫోన్‌ పోయిందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేయడం చూస్తే వీరప్పన్‌ ఇంట్లో గంధపు చెక్కలు పోయినట్లుందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితులు 140 ఫోన్లు మార్చారని ఈడీ అధికారులు కోర్టుకు నివేదించారు. అదే తరహాలో విజయసాయిరెడ్డి కూడా ఫోన్‌ పోయిందన్న పేరుతో నాటకం ఆడుతున్నారు. ‘‘తమ మధ్య జరిగిన సంభాషణలు, ఇతర సమాచారం చిక్కకుండా చూడటానికి విజయసాయి బంధువు, ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్న శరత్‌ చంద్రారెడ్డి ఒక్కరే 30 ఫోన్లు మార్చారని ఈడీ చెప్పింది. తన అల్లుడి సోదరుడు పట్టుబడి జైలుకు పోగానే విజయసాయి తన ఫోను పోయిందని చెప్పడం అనుమానాలు కలిగిస్తోంది. ఫోన్‌ పోయిందని ఢిల్లీలో చెబితే ఈడీ కుమ్ముతుందని భయపడి తాడేపల్లిలో పోయిందని ఆయన నాటకాలు ఆడుతున్నారు. మళ్లీ జైలుకు పోవాల్సి వస్తుందన్న భయంతో ఆయన నక్కజిత్తులు ప్రదర్శిస్తున్నారు. ఈడీ అధికారులు విజయసాయి వంటి ఆరితేరిన క్రిమినల్స్‌ను సాధారణ నేరస్తుల్లా చూడకూడదు. ఎంపీ రఘురామరాజు విషయంలో సీఐడీ వ్యవహరించిన తీరులో ఈడీ అధికారులు విజయసాయితో వ్యవహరిస్తే గంటలో ఫోన్‌ దొరుకుతుంది’’ అని ఆయన అన్నారు. నాలుగేళ్ల నుంచి భద్రంగా ఉన్న ఫోన్‌ ఇప్పుడు ఎలా పోయిందని ఆయన ప్రశ్నించారు. ఐపీసీ ప్రకారం ఆధారాలు రూపుమాపడం పెద్ద నేరమని, దానికింద విజయసాయిని తక్షణం విచారించాలని బొండా డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-11-25T03:39:10+05:30 IST

Read more