దుకాణం తెరిచేశారు

ABN , First Publish Date - 2022-10-01T06:17:11+05:30 IST

నగరంలో అర్ధరాత్రి వేళ ప్రజలకు ఆహారం అందుబాటులో వుండేందుకు వీలుగా కొన్నాళ్ల కిందట సెంట్రల్‌ పార్కు పక్కన ఫుడ్‌ స్ర్టీట్‌ను ప్రారంభించారు.

దుకాణం తెరిచేశారు
పాతజైలు రోడ్డులో అనుమతుల్లేకుండా ఏర్పాటుచేసిన దుకాణాలు

పాత జైలు రోడ్డులో అనధికారికంగా ఫుడ్‌ స్ర్టీట్‌ నిర్వహణ

జీవీఎంసీ అనుమతులు నిల్‌

మూడేళ్ల క్రితం అధికారికంగా ప్రారంభం

కరోనా సమయంలో మూత

ఆ తరువాత ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతుందని అనుమతి ఇవ్వని జీవీఎంసీ అధికారులు

అధికార పార్టీ నేతల అండదండలతో దుకాణాలు పునఃప్రారంభం

చోద్యం చూస్తున్న జీవీఎంసీ అధికారులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


నగరంలో అర్ధరాత్రి వేళ ప్రజలకు ఆహారం అందుబాటులో వుండేందుకు వీలుగా కొన్నాళ్ల కిందట సెంట్రల్‌ పార్కు పక్కన ఫుడ్‌ స్ర్టీట్‌ను ప్రారంభించారు. కరోనా సమయంలో మూసేశారు. అయితే అక్కడ ఫుడ్‌ స్ర్టీట్‌ వల్ల ట్రాఫిక్‌జామ్‌ అవుతోందంటూ ఆ తరువాత దుకాణాలు పునఃప్రారంభించేందుకు జీవీఎంసీ అధికారులు నిరాకరించారు. కానీ అధికార పార్టీ నేతల అండదండలతో ఇప్పుడక్కడ దుకాణాలు తెరుచుకున్నాయి. దీనిపై అభ్యంతరం చెప్పాల్సిన జీవీఎంసీ అధికారులు...అధికార పార్టీ నేతల ప్రమేయం వుందని తెలిసి అటు వైపు కన్నెత్తిచూడడం లేదు.

2019లో అప్పటి రాష్ట్ర పురపాలక శాఖా మంత్రిగా వున్న బొత్స సత్యనారాయణ సూచన మేరకు జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ సంయుక్తంగా పాతజైలురోడ్డులో మహిళా కళాశాల ఎదురుగా ఫుడ్‌స్ర్టీట్‌ ఏర్పాటుచేశాయి. మొదట 32 దుకాణాలతో ప్రారంభించారు. వీటికి ఆదరణ పెరగడంతో మరికొందరు వ్యాపారులు అక్కడ దుకాణాలు పెట్టేందుకు పోటీ పడ్డారు. దీనికి అధికారులు తొలుత తిరస్కరించినప్పటికీ కొంతమంది దళారులు రంగంలోకి దిగి ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలతో కొత్త దుకాణాలు ఏర్పాటుకు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. 2020 మార్చి నాటికి ఫుడ్‌స్ర్టీట్‌లో దుకాణాల సంఖ్య 32 నుంచి ఏకంగా 120కి పెరిగిపోయింది. అదే సమయంలో కరోనా రావడంతో ఫుడ్‌స్ర్టీట్‌ను పూర్తిగా మూసేశారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత ఫుడ్‌స్ర్టీట్‌ ప్రారంభించుకునేందుకు వ్యాపారులు జీవీఎంసీ అధికారులను సంప్రతించగా ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమవుతున్నందున నగర ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు. దీనిపై కొంతమంది వ్యాపారులు కోర్టుకు వెళ్లినప్పటికీ ఉపయోగం లేకుండాపోయింది. చివరకు జీవీఎంసీ కౌన్సిల్‌లో కీలక స్థానంలో వున్న అధికార పార్టీ నేత ఒకరు దుకాణాల ఏర్పాటుకు జీవీఎంసీ అధికారులతో అనుమతి ఇప్పిస్తానంటూ రంగంలోకి దిగారు. ఒక హోటల్‌లో వ్యాపారులతో సమావేశం ఏర్పాటుచేసి దుకాణాల నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీలోని కొంతమంది ప్రజా ప్రతినిధులు వ్యాపారుల తరపున వకాల్తా పుచ్చుకుని పార్టీ కీలక నేతల వద్దకు వెళ్లారు. ఈ విషయంలో వ్యాపారుల నుంచి పార్టీ పట్ల వ్యతిరేకత నెలకొనే ప్రమాదం వుందని చెప్పి, అనధికారికంగా దుకాణాలు ఏర్పాటుచేయించారు. మొదట పన్నెండుతో ప్రారంభమై ఇప్పుడు 75 వరకూ చేరాయి. వీటిలో ఒక్కదానికి కూడా జీవీఎంసీ అనుమతి ఇవ్వకపోయినా, వ్యాపారం మాత్రం నడిచిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా వ్యాపారులు తాము దుకాణాల కోసం భారీగా ఖర్చుపెట్టామని చెప్పి, ఆహార పదార్థాల ధరలను పెంచేసినట్టు చెబుతున్నారు. రాత్రిపూట ఆహారం కోసం అక్కడకు వెళ్లినవారు తప్పనిసరి పరిస్థితిలో దుకాణదారులు చెప్పినంత చెల్లిస్తున్నారు. అనధికారికంగా దుకాణాల ఏర్పాటుపై జీవీఎంసీ అఽధికారులకు కొంతమంది ఫిర్యాదు చేసినప్పటికీ అధికార పార్టీ నేతల అండదండలు వున్నట్టు తెలియడంతో అటువైపు చూడడం లేదు.

Read more