యూఎల్‌సీపై మళ్లీ కసరత్తు

ABN , First Publish Date - 2022-04-24T07:14:10+05:30 IST

పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం (యూఎల్‌సీ) కింద దఖలు పడిన భూముల్లో నిర్మించిన కట్టడాల క్రమబద్ధీకరణకు సర్వే నంబర్లను కాకుండా...ఇంటి నంబర్ల ఆధారంగా ఆ ప్రాంతంలో గల రిజిస్ర్టేషన్‌ విలువను ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

యూఎల్‌సీపై మళ్లీ కసరత్తు
క్రమబద్ధీకరణ నిమిత్తం సీతంపేట గణేష్‌నగర్‌లో గల ఈ ఇంటికి రూ.లక్షలు కట్టాలంటూ నోటీస్‌ ఇచ్చారు

ఈసారి ఇంటి నంబర్ల వారీగా నోటీసుల జారీ

ఆ ప్రాంతంలో గల రిజిస్ర్టేషన్‌ విలువ ఆధారంగా కచ్చితమైన ధర నిర్ణయం

తొలివిడతలో 35.44 హెక్టార్లకు 1,583 మందికి నోటీసులు

జాబితాలో మరో 1442 మంది


విశాఖపట్నం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి):

పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం (యూఎల్‌సీ) కింద దఖలు పడిన భూముల్లో నిర్మించిన కట్టడాల క్రమబద్ధీకరణకు సర్వే నంబర్లను కాకుండా...ఇంటి నంబర్ల ఆధారంగా ఆ ప్రాంతంలో గల రిజిస్ర్టేషన్‌ విలువను ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో యూఎల్‌సీ కింద నోటీసులు ఇచ్చిన ఆక్రమణదారుల వివరాల వర్గీకరణతో పాటు ఇంటి నంబర్ల వారీగా భూముల విలువ మదింపునకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. 

నగరంలో 86.1061 హెక్టార్ల ప్రభుత్వ (యూఎల్‌సీ) భూమిలో 3,025 ఆక్రమణలు వెలిసినట్టు అధికారులు గుర్తించారు. క్రమబద్ధీకరణకు ఆయా ప్రాంతాల్లో వున్న రిజిస్ట్రేషన్‌ విలువ కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా వసూలు చేయాలని ఈ ఏడాది జనవరి 31న ప్రభుత్వం జీవో జారీచేసింది. దీంతో రెవెన్యూ అధికారులు గత నెలాఖరు వరకు 35.4474 హెక్టార్లకు సంబంధించి 1,583 మందికి నోటీసులు ఇచ్చారు. ఆక్రమణదారులతోపాటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళన చేయడంతో వెనక్కి తగ్గారు. అదే సమయంలో ఆక్రమణదారులు ఒక్కరు కూడా పైసా చెల్లించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అంతేకాకుండా భూ పరిపాలనా శాఖలో అధికారులు మారడంతో కొత్త ఆదేశాలు వచ్చాయి. ఆక్రమిత స్థలానికి ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్‌ విలువకు ఒకటిన్నర రెట్లు ఎక్కువగా చెల్లించాలని నోటీసులు ఇవ్వడాన్ని ఉన్నతాధికారులు తప్పుబట్టారు. రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్ణయించిన ధరల మేరకు ఆక్రమణదారుడు ఎంత చెల్లించాలనేది లెక్కించిన తరువాతే ఇంటి నంబర్ల వారీగా కచ్చితమైన నోటీసులివ్వాలని ఆదేశించారు. నగరంలో నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలను రిజిస్ట్రేషన్‌ శాఖ గుర్తించి, విలువ నిర్ణయిస్తుందనే విషయాన్ని గుర్తుచేశారు. దీనికి తోడు విస్తీర్ణం బట్టి ఆక్రమణదారుల వివరాలు గుర్తించాలని సూచించడంతో యూఎల్‌సీ విభాగం తాజాగా అధ్యయనం చేస్తోంది. 


నోటీసులిచ్చిన వారి వివరాలివీ...

ఇప్పటివరకు నోటీసులు ఇచ్చిన 1,583 మంది వివరాలను పరిశీలిస్తే...35.4474 హెక్టార్లలో ఆక్రమణలు వెలిసినట్టు గుర్తించిన అధికారులు వీరిలో 75 గజాలలోపు 701 మంది ఆక్రమణదారులు 9.484 హెకార్లు, 75 నుంచి 150 గజాల వరకు 335 మంది 5.339 హెక్టార్లు, 150 నుంచి 300 గజాల వరకు  461 మంది  13.74 హెకార్లు, 300 గజాలకు మించి 86 మంది 6.886 హెక్టార్ల భూమిని ఆక్రమించుకున్నట్టు గుర్తించి నోటీసులు ఇచ్చారు. మరో 49.48 హెక్టార్లకు సంబంధించి 1,442 మంది ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వాల్సి ఉంది. ఇంటి నంబర్ల వారీగా విలువ మదింపు చేస్తున్నందున గతంలో నోటీసులు ఇచ్చిన వారికి మరోసారి ఇవ్వాల్సి ఉంది. తహసీల్దార్‌ కార్యాలయాల వారీగా అధికారులకు వివరాలు సేకరించే బాధ్యతను అప్పగించారు. ప్రతి కార్యాలయం పరిధిలో ఆక్రమణలున్న ప్రాంతం గుర్తించి, రిజిస్ట్రేషన్‌ విలువను మదించి, నోటీసులు రూపొందించాల్సి ఉంది. ఇందుకు కొంత సమయం పడుతుంది. దీనికితోడు మిగిలిన 1,442 మంది ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చే ముందు పూర్తి వివరాలు సిద్ధం చేయనున్నారు. ఇంటి నంబర్ల వారీగా విలువ మదింపు చేస్తున్నందున క్రమబద్ధీకరణకు చెల్లించాల్సిన మొత్తం కొందరికే గతం కంటే పెరగవచ్చునని, మరికొందరికి తగ్గవచ్చునని అంచనా వేస్తున్నారు. 


యూఎల్‌సీ గుర్తించిన వివరాలు

మొత్తం మండలాలు: ములగాడ, పెందుర్తి, మహారాణిపేట, సీతమ్మధార, గాజువాక, గోపాలపట్నం, విశాఖ రూరల్‌

ఆక్రమణదారులు: 3,025 మంది

ఆక్రమించుకున్న విస్తీర్ణం: 86.1061 హెక్టార్లు

ఇప్పటివరకు జారీచేసిన నోటీసులు : 1,583

75 గజాల వరకు ఆక్రమణదారులు: 701

75 నుంచి 150 గజాల వరకు: 335

150 నుంచి 300 గజాల వరకు: 461

300 గజాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఆక్రమించుకున్నవారు: 86

నోటీసులు జారీచేయాల్సిన సంఖ్య    1,442 

Read more