రెండు లారీలు ఢీకొని క్లీనర్‌ మృతి

ABN , First Publish Date - 2022-09-13T06:16:40+05:30 IST

మండలంలోని పులపర్తి జంక్షన్‌ సమీపం జాతీయ రహదారిపై సోమవారం రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ క్లీనర్‌ మృతి చెందగా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

రెండు లారీలు ఢీకొని క్లీనర్‌ మృతి
పులపర్తి జంక్షన్‌ వద్ద లారీలు ఢీకొన్న దృశ్యం

డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఎలమంచిలి, సెప్టెంబరు 12 : మండలంలోని పులపర్తి జంక్షన్‌ సమీపం జాతీయ రహదారిపై  సోమవారం  రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ క్లీనర్‌ మృతి చెందగా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి రూరల్‌ ఎస్‌ఐ సన్నిబాబు తెలిపిన వివరాలివి. పులపర్తి సమీపంలో రోడ్డు పక్కన సోమవారం తెల్లవారుజామున ట్యాంకర్‌ లారీ ఆగి ఉంది. ఆ సమయంలో రాజమండ్రి నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న ఇసుక లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొంది. దీంతో  లారీలో ఉన్న క్లీనర్‌ ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం కొరియా జిల్లా బహల్పూర్‌కు చెందిన విక్రమ్‌ (19) మృతి చెందగా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతనిని కేజీహెచ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


చెన్నయ్‌ బీచ్‌లో చిలకవానిపాలెం యువకుడు గల్లంతు

రావికమతం, సెప్టెంబరు 12: మండలంలో చిలకవానిపాలెం గ్రామానికి చెందిన యాదగిరి నగేష్‌ (26) చెన్నయ్‌ బీచ్‌లో ఆదివారం గల్లంతయ్యాడు. అతని ఆచూకీ లభించలేదని సహచర కూలీలు సోమవారం తల్లిదండ్రులు, బంధువులకు సమాచారం అందించారు. మండల వైస్‌ఎంపీపీ మత్స భవానీ ప్రసాద్‌, మృతుడు కుటుంబీకుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.

మండలంలోని టి.అర్జాపురం పంచాయతీ శివారు చిలకవానిపాలెం గ్రామానికి చెందిన నాగేష్‌తోపాటు ఆ గ్రామానికి చెందిన కొంతమంది యువకులు కూలి పనుల కోసం 15 రోజుల క్రితం చెన్నయ్‌ వలస వెళ్లారు. అక్కడ ఒక భవన నిర్మాణం పనులను చేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో సాయంత్రం సమీపంలోని బీచ్‌కు నాగేష్‌ వెళ్లాడు. అతని జేబులోని సెల్‌ఫోన్‌,పర్స్‌ ఒడ్డున ఉంచి స్నానానికి సముద్రంలోకి దిగి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. బీచ్‌కు వె ళ్లిన నాగేష్‌ ఎంతసేపటికి రాకపోవడంతో  సహచరులు బీచ్‌లోకి వెళ్లారు. ఒడ్డున ఉన్న పర్స్‌, సెల్‌ఫోన్‌ ఆధారంగా అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమాచారాన్ని  ఇక్కడ ఉన్న నాగేష్‌ తల్లిదండ్రులకు తెలపడంతో వారు చెన్నయ్‌ పయనమయ్యారు.


విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ద్విచక్రవాహనం: వ్యక్తి మృతి

కొత్తూరు, సెప్టెంబరు 12 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి సోమవారం సాయంత్రం మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి రూరల్‌ ఎస్‌ఐ సిహెచ్‌.నర్సింగరావు తెలిపిన వివరాలివి. అనకాపల్లి మండలం సిహెచ్‌.ఎన్‌.అగ్రహారానికి చెందిన కాపుశెట్టి రాముడు (30) తన కుమార్తె శాంతితో కలిసి బంటు నారాయణసూరి ద్విచక్ర వాహనంపై గొలగాంలో ఉన్న అత్తవారి ఇంటికి బయల్దేరాడు. రేబాక వద్ద గ్యాస్‌ గోడౌన్‌ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని చూసి నారాయణసూరి  కంగారుపడి వాహనంతో రోడ్డుపక్కనున్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్నాడు. దీంతో వెనుక కూర్చొన్న రాముడు  అక్కడికక్కడే మృతి చెందగా, అతనికి కుమార్తె శాంతికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 


 పేకాట శిబిరంపై పోలీసుల దాడి 

ఎనిమిది మంది అరెస్టు : రూ.5,150 నగదు స్వాధీనం

బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 12: మండలంలోని గున్నెంపూడిలో పేకాట శిబిరంపై సోమవారం దాడి చేసి పేకాట ఆడుతున్న నిఇమిది మందిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ కుమారస్వామి తెలిపారు. వారి వద్ద నుంచి రూ.5,150, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి, సొంత పూచికత్తుపై విడుదల చేసినట్టు చెప్పారు.


Read more