-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Tractorbike collision One killed-NGTS-AndhraPradesh
-
ట్రాక్టర్- బైక్ ఢీ: ఒకరి మృతి
ABN , First Publish Date - 2022-09-27T07:05:25+05:30 IST
మండల కేంద్రం ఎస్.రాయవరం సమీపంలో సోమవారం సాయంత్రం ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్టు ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు.

మరొకరికి తీవ్రగాయాలు
ఎస్.రాయవరం సమీపంలో ఘటన
ఎస్.రాయవరం, సెప్టెంబర్ 26 : మండల కేంద్రం ఎస్.రాయవరం సమీపంలో సోమవారం సాయంత్రం ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్టు ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. అడ్డరోడ్డు నుంచి ఎస్.రాయవరం వెళుతున్న ట్రాక్టర్ ఆ గ్రామ సమీపంలోకి చేరేసరికి ఎదురుగా బైక్ రావడంతో రెండూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిపోవడంతో డ్రైవర్ పినపాత్రుని శ్రీనివాసరావు (51) ట్రాక్టర్ కింద ఇరక్కుపోయాడు. సమాచారం అందుకున్న సీఐ నారాయణరావు, ఎస్ఐ ప్రసాదరావులు వచ్చి జేసీబీని రప్పించి అతనిని బయటకు తీయించారు. వెంటనే నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అతడు అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అలాగే బైక్‌పై ఉన్న ఇద్దరిలో ఎస్.రాయవరానికి చెందిన కశింకోట దుర్గప్రసాద్ అనే యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేవల్ బేస్ రోడ్డులో లారీ బోల్తా
సురక్షితంగా బయటపడిన డ్రైవర్
రాంబిల్లి, సెప్టెంబరు 26 : నేవల్ బేస్ రోడ్డులోని గోవిందపాలెం సమీపంలో రాయి లోడుతో వస్తున్న లారీ సోమవారం బోల్తాపడింది. అదృష్టవశాత్తు డ్రైవర్‌కు ఎటువంటి గాయాలు కాలే దు. అనకాపల్లి సమీపం తుమ్మపాల క్వారీ నుంచి ప్రతి రోజూ నేవీలోకి లారీల ద్వారా రాళ్లు వస్తుంటాయి. అధిక బరువు, మితిమీరిన వేగంతో ఈ లారీ రావడం వల్ల రోడ్డుపక్క పొలాల్లోకి వెళ్లి బోల్తాపడినట్టు స్థానికులు తెలిపారు. అయితే ఆ సమయంలో ఎదురుగా ఎవరూ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పలువురు పేర్కొన్నారు.