పర్యాటకుల జోష్‌

ABN , First Publish Date - 2022-11-21T00:47:56+05:30 IST

మన్యంలో పర్యాటక సందడి నెలకొంది. ఎక్కడ చూసినా పర్యాటకుల జోష్‌ కనిపించింది. కార్తీక మాసం ఆఖరి ఆదివారం కావడంతో పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు పోటెత్తారు. మన్యం అంతటా సందడి నెలకొంది. అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు రద్దీ కొనసాగింది.

పర్యాటకుల జోష్‌
కొత్తపల్లి జలపాతం వద్ద..

- పర్యాటక ప్రాంతాల్లో పిక్నిక్‌ సందడి

- బొర్రా గుహలు నుంచి సప్పర్ల రెయిన్‌గేజ్‌ వరకు సందర్శకుల తాకిడి

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

మన్యంలో పర్యాటక సందడి నెలకొంది. ఎక్కడ చూసినా పర్యాటకుల జోష్‌ కనిపించింది. కార్తీక మాసం ఆఖరి ఆదివారం కావడంతో పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు పోటెత్తారు. మన్యం అంతటా సందడి నెలకొంది. అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు రద్దీ కొనసాగింది.

ప్రస్తుతం పిక్నిక్‌ల సీజన్‌ కావడంతో మన్యానికి సందర్శకుల తాకిడి అధికమైంది. ఆదివారం అనంతగిరి మండలం బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్యాపురం గార్డెన్‌, రణజిల్లెడ జలపాతం, కొత్తవలస వ్యవసాయ క్షేత్రం, పెదలబుడు గిరిజన గ్రామదర్శిని, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయిగెడ్డ, పాడేరు మండలంలో మినుములూరు, మోదాపల్లి కాఫీ తోటలు, అమ్మవారి పాదాలు, పాడేరు మోదకొండమ్మ ఆలయం, వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి, చెరువువేనం, లంబసింగి, యర్రవరం జలపాతం, జీకేవీధి మండలంలో ఆర్వీనగర్‌ కాఫీ తోటలు, సప్పర్ల ఘాట్‌లో రెయిన్‌గేజ్‌ ప్రాంతాలను పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శించారు.

వంజంగి హిల్స్‌ కళకళ

పాడేరురూరల్‌: మండలంలోని వంజంగి మేఘాల కొండకు అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు శనివారం రాత్రి పాడేరు చేరుకున్నారు. అక్కడ ఉండేందుకు వసతి దొరక్క పీటీడీ బస్‌ కాంప్లెక్స్‌ పక్కన షాపుల వద్ద చలిలో అవస్థలు పడ్డారు. వేకువజామునే వంజంగి హిల్స్‌కు చేరుకుని మంచు అందాలను తిలకించారు. అధికారులు స్పందించి పర్యాటకులకు వసతి సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు.

కొత్తపల్లి జలపాతానికి తాకిడి

జిల్లాలోని జి.మాడుగుల మండలంలో ఉన్న కొత్తపల్లి జలపాతం ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పర్యాటకులతో కళకళలాడింది. ఆదివారం ఒక్క రోజే సుమారు రెండు వేల మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చారు. జలపాతం మేనేజర్‌ ఆర్‌.నవీన్‌, సూపర్‌వైజర్లు వి.అభి, రాజుతో పాటు 21 మంది సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే పార్కింగ్‌ స్థలం సరిపోకపోవడంతో వాహనాలను జి.మాడుగుల- చింతపల్లి ప్రధాన రహదారిలో నిలిపివేశారు. దీంతో ట్రాఫిక్‌కు కొంత అంతరాయం ఏర్పడింది.

లంబసింగిలో..

చింతపల్లి: ఆంధ్రకశ్మీర్‌ లంబసింగికి పర్యాటకులు పోటెత్తారు. వీకెండ్‌ కావడంతో ఆదివారం భారీ సంఖ్యలో తరలి వచ్చారు. కొంత మంది పర్యాటకులు శనివారం రాత్రికి లంబసింగి చేసుకుని స్థానికంగా బస చేశారు. దీంతో ఉదయం ఐదు గంటల నుంచి లంబసింగి జంక్షన్‌, లంబసింగి, భీమనాపల్లి, చెరువులవేనం, తాజంగి జలాశయం వద్ద పర్యాటకుల సందడి ప్రారంభమైంది. చెరువులవేనం వద్ద మంచు అందాలను ఆస్వాదించారు. సాయంత్రం వరకు తాజంగి జలాశయం వద్ద పర్యాటకులు జిప్‌లైన్‌, ఇతర సాహస క్రీడలు, బోటు షికారు చేస్తూ ఎంజాయ్‌ చేశారు. లంబసింగి పరిసర ప్రాంతాల్లో రైతులు సాగుచేస్తున్న స్ట్రాబెర్రీ తోటలను సందర్శించారు. తోటల వద్ద స్ట్రాబెర్రీలను కొనుగోలు చేసేందుకు పర్యాటకులు పోటీ పడ్డారు.

మాడగడ మంచు అందాలు

అరకు రూరల్‌: అరకులోయకు సమీపంలోని మాడగడ మంచు అందాలను తిలకించేందుకు పర్యాటకులు పోటీ పడ్డారు. వేకువజామునే అధిక సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు. అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, సీఐ జీడీ బాబు, వైసీపీ నాయకులు కూడా ఇక్కడి మంచు అందాలను ఆస్వాదించారు. అలాగే స్థానిక పద్మాపురం గార్డెన్స్‌, గిరిజన మ్యూజియానికి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. దీంతో ఈ ప్రాంతమంతా సందడిగా మారింది.

బొర్రా గుహలు వద్ద..

అనంతగిరి రూరల్‌: మండలంలోని బొర్రా గుహలుకు అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో రద్దీగా మారింది. సుమారు ఆరు వేల మంది సందర్శించగా ఏపీటీడీసీకి రూ.4.5 లక్షల ఆదాయం వచ్చింది. అలాగే డముకు వ్యూ పాయింట్‌ వద్ద సందర్శకుల తాకిడి కనిపించింది. కాశీపట్నం ఉమారామలింగేశ్వర ఆలయం వద్ద పిక్నిక్‌ సందడి నెలకొంది. భక్తులు సమీపంలోని గోస్తని నదిలో స్నానాలు చేసి ఆనందంగా గడిపారు.

చాపరాయి జలపాతం వద్ద..

డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలపాతం పర్యాటకులతో పోటెత్తింది. ప్రస్తుతం పిక్నిక్‌ సీజన్‌ కావడంతో ఈ ప్రాంతం సందడిగా మారింది. అయితే ఇక్కడ సరైన సదుపాయాలు లేక పర్యాటకులు ఇబ్బంది పడ్డారు. అలాగే వాహనాల పార్కింగ్‌కు సరైన ప్రదేశం లేక అరకు- పాడేరు రహదారిపైనే నిలిపివేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

Updated Date - 2022-11-21T00:47:56+05:30 IST

Read more