వానొచ్చినా తగ్గేదేలే..

ABN , First Publish Date - 2022-12-12T01:03:09+05:30 IST

ప్రస్తుత తుఫాన్‌ ప్రభావాన్ని సైతం లెక్క చేయకుండా మన్యంలోని పర్యాటక కేంద్రాలు ఆదివారం సందర్శకులతో కిటకిటలాడాయి. వీకెండ్‌ కావడంతో జనం మన్యం బాటపట్టారు. దీంతో ఆదివారం ఏజెన్సీలో ఎక్కడ చూసినా సందర్శకులే కనిపించారు.

వానొచ్చినా తగ్గేదేలే..
చెరువులవేనంలో సందడి చేస్తున్న పర్యాటకులు

- మన్యానికి పోటెత్తిన పర్యాటకులు

- ప్రతికూల వాతావరణంలోనూ తగ్గని రద్దీ

- బొర్రా గుహలు, లంబసింగి, అరకులోయ తదితర ప్రాంతాలు కిటకిట

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ప్రస్తుత తుఫాన్‌ ప్రభావాన్ని సైతం లెక్క చేయకుండా మన్యంలోని పర్యాటక కేంద్రాలు ఆదివారం సందర్శకులతో కిటకిటలాడాయి. వీకెండ్‌ కావడంతో జనం మన్యం బాటపట్టారు. దీంతో ఆదివారం ఏజెన్సీలో ఎక్కడ చూసినా సందర్శకులే కనిపించారు. ఇటు అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని అటు చింతపల్లి మండలం లంబసింగి వరకు సందడి నెలకొంది. అనంతగిరి మండలం బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌, కొత్తవలస వ్యవసాయ శిక్షణ కేంద్రం, గిరిజన గ్రామదర్శిని, రణజిల్లడ జలపాతం డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో మినుములూరు, మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి, చెరువువేనం, లంబసింగి, యర్రవరం జలపాతం ప్రాంతాలను ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు.

లంబసింగిలో..

చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి ప్రతికూల వాతావరణంలోనూ ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు పోటెత్తారు. వీకెండ్‌ కావడంతో శనివారం రాత్రి, ఆదివారం ఉదయం లంబసింగికి సందర్శకులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. మంచు అందాలు తిలకించేందుకు చెరువులవేనం వ్యూపాయింట్‌ వద్దకు చేరుకున్నారు. అయితే ఉదయం 30 నిమిషాల పాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. మంచు అందాలు ఆవిష్కృతం కాలేదు. దీంతో పర్యాటకులు తీవ్ర నిరాశ చెందారు. కాగా తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడలు, బోటు షికారు చేసేందుకు పర్యాటకులు పోటీ పడ్డారు. వాతావరణం నిరాశ పరిచినప్పటికి సాయంత్రం వరకు లంబసింగి పరిసర ప్రాంతాలను పర్యాటకులు సందర్శిస్తూ సందడిగా గడిపారు.

అరకులోయలో..

అరకులోయ: తుఫాన్‌ ప్రభావంతో ప్రతికూల వాతావరణం ఉన్నా అధిక సంఖ్యలో పర్యాటకులు ఆదివారం అరకులోయలోని పలు పర్యాటక కేంద్రాలను సందర్శించారు. గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్‌ వద్ద రద్దీ కనిపించింది. మ్యూజియం మెయిన్‌గేటు సమీపంలోని ఐ లవ్‌ అరకు బోర్డు వద్ద ఫొటోలు దిగారు. మ్యూజియం ప్రాంగణం కళాగ్రామంలో ఏర్పాటు చేసిన గిరి మహిళల ప్రతిమల వద్ద ఫొటోలు దిగుతూ సందడి చేశారు. మరికొందరు జిప్‌ లైనర్‌, స్కై సైక్లింగ్‌, ఇతర సాహస క్రీడల్లో హుషారుగా పాల్గొన్నారు. పద్మాపురం గార్డెన్‌లో టాయ్‌ట్రైన్‌ ఎక్కి గార్డెన్‌ అందాలను తిలకించారు. ఘాట్‌రోడ్డులోని గాలికొండ వ్యూపాయింట్‌, కాఫీ తోటలను సందర్శించారు.

చాపరాయి జలపాతం వద్ద..

డుంబ్రిగుడ: మండలంలోని పర్యాటక కేంద్రం చాపరాయి జలపాతం పర్యాటకులతో సందడిగా కనిపించింది. చిరు జల్లులు కురుస్తున్నా లెక్క చేయకుండా అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి సమీపంలోని వలిసె పూల తోటల్లో ఫొటోలు దిగుతూ సందడి చేశారు.

కొత్తపల్లి జలపాతం వద్ద..

పాడేరు రూరల్‌: ప్రముఖ పర్యాటక కేంద్రం కొత్తపల్లి జలపాతం ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది. శని, ఆదివారాలు సెలవులు కావడంతో మైదాన ప్రాంతానికి చెందిన పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తుఫాన్‌ ప్రభావం ఉన్నప్పటికీ ఆదివారం ఒక్కరోజే 11 వందల మంది వచ్చారని జలపాతం సూపర్‌వైజర్‌ వి.అభి తెలిపారు. తుఫాన్‌ నేపథ్యంలో జలపాతానికి వచ్చిన పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జి.మాడుగుల పోలీసులు, జలపాతం సిబ్బంది భద్రత ఏర్పాట్లు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

6500 మంది బొర్రాగుహల సందర్శన

అనంతగిరి: ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రాగుహలకు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. మాండస్‌ తుఫాన్‌ ప్రభావం ఉన్నప్పటికి ఆదివారం ఒక్క రోజే సుమారు 6500 మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చారు. టికెట్ల రూపంలో సుమారు రూ.4 లక్షల ఆదాయం వచ్చింది. ఆదివారం పగలంతా పొగమంచు, ముసురు వాతావరణం ఏర్పడడంతో వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు. పర్యాటకులు మాత్రం పొగమంచు అందాలను తిలకిస్తూ ఆనందంగా గడిపారు. అనంతగిరి, కాశీపట్నం వంటి ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసింది.

Updated Date - 2022-12-12T01:03:10+05:30 IST