పర్యాటకం కళకళ

ABN , First Publish Date - 2022-10-01T06:51:01+05:30 IST

విద్యా సంస్థలకు దసరా సెలవులు ఇవ్వడం, పర్యాటక సీజన్‌ ప్రారంభం కావడంతో అరకులోయ, బొర్రా గుహలకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.

పర్యాటకం కళకళ
బొరా గ్రుహల సందర్శనకు బారులు తీరిన సందర్శకులు

అరకులోయ, బొర్రా గుహలకు పెరిగిన సందర్శకులు

దసరా సెలవులు కావడంతో పలు రాష్ట్రాల నుంచి పర్యాటకులు రాక

రిసార్టులు, లాడ్జిలు ఫుల్‌

అద్దె కార్లు, జీపులకు గిరాకీ

రద్దీగా హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు 


అరకులోయ, సెప్టెంబరు 30: విద్యా సంస్థలకు దసరా సెలవులు ఇవ్వడం, పర్యాటక సీజన్‌ ప్రారంభం కావడంతో అరకులోయ, బొర్రా గుహలకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు, సందర్శనీయ ప్రదేశాలు రద్దీగా మారాయి. కరోనా కారణంగా గత రెండేళ్లలో పర్యాటక సీజన్‌లో సందర్శకులు అరకొరగానే వచ్చారు. ఈ ఏడాది కరోనా దాదాపు తగ్గిపోవడంతో  మన్యం అందాలను తిలకించడానికి ఏపీ, తెలంగాణతోపాటు ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. అనంతగిరి, అరకులోయలో ఏపీటీడీసీకి చెందిన అన్ని అతిథిగృహాలు, రిసార్టులు అక్టోబరు చివరి వరకు బుక్‌ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు రిసార్టుల, లాడ్జీల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి. నవంబరు, డిసెంబరు నెలల్లో కూడా పర్యాటకుల తాకిడి అధికంగా వుంటుందని భావిస్తున్నారు. ఇక పర్యాటల రాక పెరగడంతో అద్దె జీపులు, కార్లుకు గిరాకీ పెరిగింది. భోజన హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు రద్దీగా మారాయి.

ఫొటోరైటప్స్‌:

30ఏఆర్‌కె1: విలేఖర్లతో మాట్లాడుతున్న ఏపీటీడీసీ డీవీఎం బాబూజీ 

డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌ 

అతిధిగృహాలుగా మార్పు

అద్దె రూపంలో ఆదాయం వస్తుంది

లంబసింగి కాటేజీలు 20 రోజుల్లో రెడీ

ఏపీటీడీసీ డీవీఎం బాబూజీ వెల్లడి


అరకులోయ, సెప్టెంబర్‌ 30: అరకులోయలో నిరుపయోగంగా వున్న డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌ను గదులుగా మార్చేసి పర్యాటకులకు వసతి కల్పిస్తే అద్దె రూపంలో ఆదాయం సమకూరుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని ఏపీటీడీసీ డీవీఎం బాబూజీ తెలిపారు. శుక్రవారం అరకులోయ వచ్చిన ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ, చింతపల్లి మండలం లంబసింగిలో సంస్థకు చెందిన కాటేజీలు మరో 20 రోజుల్లో పర్యాటకులకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అరకులోయ, అనంతగిరిల్లోని రిసార్టులకు జనవరి తర్వాత పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి  ఆధునీకరిస్తామని ఆయన వెల్లడించారు. పర్యాటక సీజన్‌ ప్రారంభం కావడంతో  సంస్థకు చెందిన అన్ని రిసార్టులు, కాటేజీలు అక్టోబరు చివరి వరకు బుక్‌ అయ్యాయని చెప్పారు. అరకులోయ, అనంతగిరిలో ఏపీటీడీసీకి చెందిన ఐదు రిసార్టులు/ కాటేజీల సముదాయాల ద్వారా నెలకు రూ.2.25 కోట్ల వరకు ఆదాయం వస్తున్నదని ఆయన వెల్లడించారు. 


Updated Date - 2022-10-01T06:51:01+05:30 IST