అరకొరగా కందిపప్పు

ABN , First Publish Date - 2022-09-10T06:53:32+05:30 IST

ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది.

అరకొరగా కందిపప్పు

చాలాకాలం తరువాత గత నెల నుంచి మాత్రమే సరఫరా పునఃప్రారంభం

జిల్లాలో 5,26,557 బియ్యం కార్డులు

నెలకు 500 టన్నులు అవసరం

ఈ నెల 260 టన్నులు మాత్రమే విడుదల

మూడు, నాలుగు రోజులకే డిపోల్లో నో స్టాక్‌

డీలర్లపై కార్డుదారులు కస్సుబుస్సు

అస్తవ్యస్తంగా మారిన రేషన్‌ పంపిణీ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. గతంలో బియ్యం, వంట నూనెతోపాటు పది రకాల సరకులు అందజేసేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బియ్యం, కందిపప్పు, పంచదారకే పరిమితం చేసింది. కొంతకాలం నుంచి కందిపప్పు, పంచదార సక్రమంగా ఇవ్వడం లేదు. బియ్యం మినహా మిగిలిన సరకులు కార్డుదారుల్లో సగం మందికి కూడా అందని పరిస్థితి నెలకొంది. 

ప్రజా పంపిణీ వ్యవస్థ నానాటికీ నిర్వీర్యం అవుతున్నది. తెలుగుదేశం హయాంలో, అంతకు ముందున్న ప్రభుత్వాలు...తెల్ల రేషన్‌ కార్డుదారులకు బియ్యం, కందిపప్పు, పంచదార, వంటనూనె సబ్సిడీపై అందజేశాయి. ఇంకా ఉప్పు, బెల్లం, శనగలు, తదితర పది రకాల వస్తువులను తక్కువ ధరకు రేషన్‌ షాపుల్లో అందుబాటులో ఉండేవి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటి వద్దకే రేషన్‌ పేరుతో కొత్తగా మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ) వాహనాలను ఏర్పాటుచేసింది. ఎండీయూల ద్వారా కొంతకాలంపాటు బియ్యం, కందిపప్పు, పంచదార పంపిణీ చేశారు. తరువాత కందిపప్పు, పంచదార పంపిణీని ఆపేశారు. చాలాకాలం నుంచి కందిపప్పు పంపిణీ నిలిపేసిన జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఎట్టకేలకు గత నెల నుంచి మళ్లీ సరఫరా ప్రారంభించారు. కందిపప్పు బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో రూ.120 వరకు ఉంది. పౌర సరఫరా అధికారులు కిలో కందిపప్పు రూ.67కు అందిస్తుండడంతో కార్డుదారులు ఊరట చెందుతున్నారు. అయితే సెప్టెంబరు నెలకు సంబంధించి జిల్లాలో 5,26,557 బియ్యం కార్డులు ఉండగా...కార్డుకు కిలో కందిపప్పు సరఫరా చేయాలి. ఈ లెక్కన 520 టన్నుల కందిపప్పు అవసరం కాగా ప్రస్తుత నెల 260 టన్నులు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో డీలర్లకు ఇవ్వాల్సిన కోటాలో సగం మాత్రమే అందజేశారు. ఈ నేపథ్యంలో తొలి మూడు, నాలుగు రోజులకే డిపోల్లో కందిపప్పు అయిపోయింది. తరువాత వచ్చిన కార్డుదారులకు కందిపప్పు లేదని చెబుతుండడంతో డీలర్లతో కార్డుదారులు వాదులాటకు దిగుతున్నారు. కందిపప్పు విషయంలో హోల్‌సేల్‌ డీలర్లు, మిల్లర్లకు ప్రభుత్వం భారీ ఎత్తున బకాయి పడిపోవడంతో కొద్దినెలల నుంచి వారు పూర్తిస్థాయిలో  సరఫరా చేయడం లేదు. బియ్యం కార్డులకు సరిపడా కందిపప్పు ఇవ్వకపోవడంతో రేషన్‌ డీలర్లు ఇబ్బందిపడుతున్నారు. డిపో పరిధిలో ఒకరికి ఇచ్చి మరొకరు ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయని కొందరు డీలర్లు కందిపప్పు విడిపించడం లేదు. పౌర సరఫరాల అధికారులు ఒత్తిడి తీసుకువచ్చినా కోసం డీడీలు తీయడానికి విముఖత చూపుతున్నారు. జిల్లాలో కందిపప్పు సరఫరా గురించి పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ రాజేశ్వరి వద్ద ప్రస్తావించగా సెప్టెంబరు నెలకు 260 టన్నుల మాత్రమే వచ్చిందన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుని వచ్చే నెలకు పూర్తిస్థాయిలో కందిపప్పు సరఫరా చేయాలని ప్రతిపాదించామన్నారు. 

Updated Date - 2022-09-10T06:53:32+05:30 IST