కొండధర్మవరం గిరిజనులకు మాజీ ప్రజాప్రతినిధి టోకరా

ABN , First Publish Date - 2022-05-24T06:45:54+05:30 IST

మండలంలోని కేవీ శరభవరం పంచాయతీ శివారు కొండధర్మవరం గ్రామానికి చెందిన ఓ నాయకుడు, గిరిజనుల పేరిట బ్యాంకు నుంచి రూ.1.7 కోట్లు రుణాలు తీసుకున్నాడు.

కొండధర్మవరం గిరిజనులకు మాజీ ప్రజాప్రతినిధి టోకరా
కొండధర్మవరం గ్రామం

ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10 వేలు ఉచితంగా ఇస్తుందని వెల్లడి

ఎనిమిదేళ్ల క్రితం 58 మందిని బ్యాంకుకు తీసుకెళ్లి పేపర్లపై సంతకాలు

వారికి తెలియకుండానే బ్యాంకు నుంచి రూ.1.7 కోట్ల రుణం

అనంతరం ప్రభుత్వ సాయం పేరుతో రూ.10 వేల చొప్పున అందజేత

రూ.3 లక్షల చొప్పున రుణబకాయిలు చెల్లించాలని బ్యాంకు నుంచి ఇటీవల నోటీసులు

లబోదిబోమంటున్న బాధితులు


నాతవరం, మే 23: మండలంలోని కేవీ శరభవరం పంచాయతీ శివారు కొండధర్మవరం గ్రామానికి చెందిన ఓ నాయకుడు, గిరిజనుల పేరిట బ్యాంకు నుంచి రూ.1.7 కోట్లు రుణాలు తీసుకున్నాడు. ప్రభుత్వం ఉచితంగా రూ.10 వేల చొప్పున సాయం చేస్తున్నదని పేపర్లపై గిరిజనులతో సంతకాలు చేయించుకుని రుణం సొమ్ముని స్వాహా చేశాడు. ఇటీవల బ్యాంకు నుంచి వచ్చిన నోటీసులను చూసి గిరిజనులు లబోదిబోమంటున్నారు. ఇందుకు సంబంధించి బాధిత గిరిజనులు తెలిపిన  వివరాలిలా వున్నాయి.

కె.వి.శరభవరం పంచాయతీ పరిధిలోని కొండధర్మవరం గ్రామానికి చెందిన 58 మంది గిరిజనులను ఆదే గ్రామానికి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి  2014లో తూర్పుగోదావరి జిల్లా తునిలోని కెనరా బ్యాంకుకు తీసుకెళ్ళాడు. గిరిజనులకు ప్రభుత్వం ఉచితంగా రూ.10 వేలు ఇస్తున్నదని చెప్పి ఆధార్‌ కార్డు జెరాక్సు కాపీలు, బ్యాంకు పాసు పుస్తకాలు తీసుకుని, కొన్ని పేపర్లపై వారితో సంతకాలు చేయించాడు. అనంతరం ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇచ్చాడు. ఇదిలావుండగా గతంలో బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారని, ఇంతవరకు చెల్లించకపోవడంతో అసలు, వడ్డీలకు వడ్డీ కలిపి రూ.3 లక్షలు అయ్యిందని, వెంటనే చెల్లించాలని కొద్ది రోజుల నుంచి గిరిజనులకు నోటీసులు అందుతున్నాయి. దీంతో సదరు మాజీ ప్రజాప్రతినిధి ‘ఉచిత సొమ్ము’ పేరుతో తమను మోసం చేశాడని గ్రహించారు. అందరూ కలిసి అతని వద్దకు వెళ్లి నిలదీయగా... నోటీసులు అలాగే వస్తాయని, వాటి సంగతి తాను చూసుకుంటాని  చెబుతున్నాడని బాధితులు వాపోతున్నారు. 

గిరిజన సంఘం నాయకులు కూడా శ్రీనివాసరావు, బండి గంగరాజు తదితరులు మాట్లాడుతూ, కొండధర్మవరం 5వ షెడ్యూల్డ్‌లో ఉందని, పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలంటే పాడేరు ఐటీడీఏ పీవో అనుమతి కావాలని, కానీ పీవో అనుమతి లేకుండా పట్టాదారు పాసుపుస్తకాలు ఎలా మంజూరు చేశారో అధికారులు విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. కొండధర్మవరం గిరిజనులకు జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేశామనిు తెలిపారు.


బ్యాంకులో రుణం తీసుకోలేదు

 సంకు లోవకుమారి, కొండధర్మవరం  

మా గ్రామానికి చెందిన ఒక మాజీ సర్పంచ్‌ సుమారు ఎనిమిదేళ్ల క్రితం  తుని కెనరా బ్యాంకుకు తీసుకెళ్లాడు. ప్రభుత్వం గిరిజనులకు ఉచితంగా రూ.10 వేలు ఇస్తున్నదని చెప్పి పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకుని సంతకాలు పెట్టించుకున్నాడు. తరువాత డబ్బులు ఇచ్చాడు. రూ.3 లక్షల అప్పు కట్టాలంటే ఇప్పుడు బ్యాంకు నోటీసులు ఇచ్చారు. నేను బ్యాంకులో రుణం తీసుకోలేదు. అధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలి.


Read more