టిడ్కో డీడీలు వెనక్కి...

ABN , First Publish Date - 2022-09-28T06:52:01+05:30 IST

టిడ్కో ఇళ్లు దక్కని దరఖాస్తుదారులకు డీడీలు వెనక్కి ఇవ్వాలని ఎట్టకేలకు జీవీఎంసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

టిడ్కో డీడీలు వెనక్కి...

ఇళ్ల కోసం టీడీపీ హయాంలో డబ్బులు చెల్లింపు

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అర్హుల్లో కోత

సగం మందికే ఇళ్లు

తాము కట్టిన సొమ్ము అయినా వెనక్కి ఇవ్వాలని మూడున్నరేళ్లుగా కోరుతున్న దరఖాస్తుదారులు

నూతన కమిషనర్‌ రాకతో ఎట్టకేలకు కదలిక

నెలరోజుల్లో వెనక్కి ఇచ్చేయాలని ఆదేశం


విశాఖపట్నం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి):

టిడ్కో ఇళ్లు దక్కని దరఖాస్తుదారులకు డీడీలు వెనక్కి ఇవ్వాలని ఎట్టకేలకు జీవీఎంసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇళ్లు ఇవ్వలేదు సరికదా...సుమారు మూడున్నరేళ్లవుతున్నా కట్టిన డబ్బులు కూడా వెనక్కి ఇవ్వకపోవడంతో  వందలాది మంది ‘స్పందన’లో జీవీఎంసీ కమిషనర్‌, మేయర్‌కు వినతిపత్రాలు అందజేస్తూ వస్తున్నారు. అప్పులు చేసి డీడీలు తీశామని, వడ్డీ భారం పెరిగిపోతున్నందున తాము కట్టిన డబ్బును తిరిగి ఇచ్చేయాలంటూ కోరుతున్నారు. ఇలా ప్రతివారం స్పందనలో కనీసం 15 వరకూ అర్జీలు అందుతున్నాయి. కమిషనర్లు మారిపోతున్నప్పటికీ టిడ్కో దరఖాస్తుదారుల సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఇటీవల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రాజాబాబు ఈనెల 19, 26 తేదీల్లో స్పందన నిర్వహించగా టిడ్కో దరఖాస్తుదారులే ఎక్కువ మంది రావడంతో యూసీడీ విభాగం అధికారులతో ఆయన సోమవారం సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. 

జీవీఎంసీ పరిధిలో 300, 365, 430 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించే టిడ్కో ఇళ్ల కోసం 44,200 మంది నాలుగేళ్ల కిందట రూ.97 కోట్లు డీడీల రూపంలో జీవీఎంసీకి అందజేశారు. 300 చదరపు అడుగుల ఇంటి కోసం రూ.500 చొప్పున, 365 చదరపు అడుగుల ఇంటి కోసం రూ.50 వేలు, 430 చదరపు అడుగుల ఇంటి కోసం రూ.లక్ష చొప్పున డీడీలు తీశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్ల కోసం గతంలో డీడీలు చెల్లించిన వారిని మరోసారి పరిశీలించి 24,192 మందిని అర్హులుగా తేల్చింది. వారిలో 21,192 మందికి మాత్రమే ఇళ్లు అందుబాటులో వుండడంతో లాటరీ ద్వారా కేటాయించింది. అందులో మిగిలిన మూడు వేల మందితోపాటు గతంలో డీడీలు చెల్లించిన తర్వాత అనర్హులుగా తేల్చిన వారికి రూ.27 కోట్లు వెనక్కి ఇవ్వాల్సి వుందని  కమిషనర్‌కు యూసీడీ అధికారులు వివరించారు. ఆ మొత్తం జీవీఎంసీ ఖాతాలోనే ఉందని చెప్పడంతో, వెనక్కి ఇవ్వడానికి ఏమిటి ఇబ్బందిని యూసీడీ అధికారులను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది వుండదని అదనపు కమిషనర్‌ శ్రీనివాసరావు చెప్పడంతో కమిషనర్‌ వెంటనే టిడ్కో ఎండీ శ్రీధర్‌తో మాట్లాడారు. డీడీలు కట్టిన వారిని ఇంకా ఇబ్బందిపెట్టడం సరికాదని, వారికి ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకోవాలని కమిషనర్‌కు ఆయన సూచించారు. దీంతో తక్షణం డీడీలు వెనక్కి ఇవ్వడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని, నెల రోజుల్లోగా అందరికీ డీడీలు ఇచ్చేయాలని కమిషనర్‌ స్పష్టంచేశారు. కమిషనర్‌ ఆదేశాలతో అదనపు కమిషనర్‌ శ్రీనివాసరావు మంగళవారం యూసీడీ అధికారులతో సమావేశం నిర్వహించారు. జోన్‌ల వారీగా టిడ్కో లబ్ధిదారులు, డీడీలు వెనక్కి ఇవ్వాల్సినవారి జాబితాను తయారుచేసి తనకు అందజేస్తే కమిషనర్‌ ఆమోదంతో బ్యాంకు అధికారులతో మాట్లాడి డీడీలు వెనక్కి ఇచ్చేందుకు వీలుగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ తయారుచేస్తామన్నారు. జోనల్‌ కమిషనర్‌ కార్యాలయానికి లబ్ధిదారులు గతంలో తాము డీడీ చెల్లించిన రశీదు, ఆధార్‌ కార్డు తీసుకుని వెళితే వారికి అక్కడే చెక్‌ రాసి పంపించేస్తామని యూసీడీ సిబ్బందికి తెలిపారు. దీంతో డీడీల కోసం మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఊరట కలుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Read more