చోరీ కేసులో ముగ్గురి అరెస్టు

ABN , First Publish Date - 2022-12-12T01:30:22+05:30 IST

నగదు దొంగిలించిన కేసు లో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు సీఐ స్వామినాయుడు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సీఐ అం దించిన వివరాలిలా ఉన్నాయి.

చోరీ కేసులో ముగ్గురి అరెస్టు
పట్టుబడిన దొంగలతో సీఐ, ఎస్‌ఐలు

కొయ్యూరు, డిసెంబరు 11: నగదు దొంగిలించిన కేసు లో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు సీఐ స్వామినాయుడు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సీఐ అం దించిన వివరాలిలా ఉన్నాయి. నర్సీపట్నంలోని కొత్తవీధికి చెం దిన ఎల్లపు గోవిందరావు ఏజెన్సీలో వ్యాపారం చేస్తుంటాడు. ఇందుకోసం రూ.1.5 లక్షలతో ఈ నెల 6వ తేదీన నర్సీపట్నం నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. డౌనూరు గ్రామంలో రహదారిపై బైక్‌ను నిలిపివేసి టిఫిన్‌ చేసేందుకు వెళ్లాడు. టిఫిన్‌ చేసిన అనంతరం గోవిందరావు వచ్చి చూడగా బైక్‌లో ఉంచిన నగదు కనిపించకపోవడంతో ఎవరో దొంగిలించారని పరిసరాల్లో వెతికాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఈ నెల 9వ తేదీన కొయ్యూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ స్వామినాయుడు ఆధ్వర్యంలో కొయ్యూరు, మంప ఎస్‌ఐలు రెండు బృందాలుగా గాలింపు చర్యలు ప్రారంభించారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా అనుమానితుల ఫొటోలను సేకరించారు. కృష్ణాదేవీపేట పోలీసుల సాయంతో 10వ తేదీన కొండగోకిరి శివారులో కృష్ణాదేవిపేటకు చెందిన గంటా రవీంద్ర అలియాస్‌ రవి, వడ్డాది మాడుగులకు చెందిన గంటా భీమరాజు, కొత్తవలసకు చెందిన కుమార్‌లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దొంగతనం చేసినట్టు అంగీకరించారు. వారి నుంచి రూ.1.5 లక్షల నగదుతో పాటు చోరీకి వినియోగించిన రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చినట్టు సీఐ స్వామినాయుడు తెలిపారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లో దొంగలను చాకచక్యంగా పట్టుకున్నా పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

మద్యం మత్తులో బాత్‌రూమ్‌ క్లీనర్‌ తాగిన వ్యక్తి మృతి

కొత్తూరు, డిసెంబరు 11 : మద్యం మత్తులో బాత్‌రూమ్‌ క్లీనర్‌ (శుభ్రపర్చే ద్రావణం)ను తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి రూరల్‌ ఎస్‌ఐ సీహెచ్‌.నర్సింగరావు తెలిపిన వివరాలివి. అనకాపల్లి మండలం శంకరం గ్రామానికి చెందిన అగ్గల శ్రీనివాసరావు (39) ఓ ప్రైవేటు కంపెనీలో హౌస్‌ కీపర్‌గా పని పనిచేసేవాడు. శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆ మత్తులో అక్కడున్న బాత్‌రూమ్‌ క్లీనర్‌ను మద్యం అనుకొని నీళ్లలో కలుపుకొని తాగాడు. ఇది గుర్తించిన భార్య వెంకటలక్ష్మి వెంటనే స్థానికుల సహాయంతో అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించింది. ప్రాథమిక చికిత్సల అనంతరం అతనిని విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి దాటాక 12.30 గంటల సమయంలో మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.

ఆర్టీసీ బస్సును, ఆటోను ఢీకొన్న లారీ

ఐదుగురికి స్పల్ప గాయాలు

ఆస్పత్రికి తరలింపు.. తప్పిన పెను ప్రమాదం

కొక్కిరాపల్లి గురుకుల పాఠశాల జంక్షన్‌ సమీపంలో ఘటన

ఎలమంచిలి, డిసెంబరు 11 : పట్టణ పరిధిలోని కొక్కిరాపల్లి బాలికల గురుకుల పాఠశాల జంక్షన్‌ సమీపంలో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును, ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలివి. పాయకరావుపేట నుంచి అనకాపల్లి వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు కొక్కిరాపల్లి బాలికల గురుకుల పాఠశాల జంక్షన్‌ సమీపంలో రోడ్డు పక్కన ఆదివారం ఆగి ఉంది. అదే సమయంలో గురుకుల పాఠశాలలో చదువుతున్న తమ పిల్లల కోసమని కొందరు ఆటోలో వచ్చారు. ఇంతలో తుని నుంచి అనకాపల్లి వైపు వెళుతున్న లారీ అదుపు తప్పి తొలుత బస్సును, ఆ తరువాత ఆటోను ఢొకొంది. దీంతో బస్సు ముందు భాగం కొంత దెబ్బతిని, అద్దం ధ్వంసమైంది. ఆటో రోడ్డుపక్కన బోల్తా పడగా, లారీ రోడ్డు పక్కకు దూసుకుపోయి చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న అచ్యుతాపురం, దిమిలి ప్రాంతాలకు చెందిన ఐదుగురు గాయాలకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. మరికొందరికి చిన్నచిన్న గాయాలు తగిలాయి. అయితే ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎలమంచిలి రూరల్‌ ఎస్‌ఐ సన్నిబాబు తెలిపారు.

లభ్యంకాని యువకుని ఆచూకీ

మాడుగుల రూరల్‌, డిసెంబరు 11: మండలం లోని రావిపాలెం పెద్దేరు జలా శయంలో గల్లంతు అయినట్టు భావి స్తున్న కింతలి వల్లా పురం గ్రామానికి చెందిన దామరౌతు శ్రావణ్‌కుమార్‌ ఆచూకీ ఇంకా తెలియలేదు. రెండు రోజులుగా ఎన్‌డీ ఆర్‌ఎఫ్‌, ఫైర్‌ సిబ్బంది జలాశ యంలో గాలిస్తున్నారు. తాను జలాశయంలో దూకేస్తున్నానని సెల్‌ఫోన్‌ ద్వారా మెసేజ్‌ పెట్టిన శ్రావణ్‌కుమార్‌ జలాశయంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావించి గాలింపు చర్యలు చేపడుతున్నట్టు ఎస్‌ఐ దామోదర నాయుడు తెలిపారు.

Updated Date - 2022-12-12T01:30:22+05:30 IST

Read more