ఉక్కునగరంలో దొంగలు హల్‌చల్‌

ABN , First Publish Date - 2022-12-13T00:05:23+05:30 IST

స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌లో దొంగలు ఆదివారం హల్‌చల్‌ చేశారు. తాళం వేసి వున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు.

ఉక్కునగరంలో దొంగలు హల్‌చల్‌
ఓ ఇంట్లో బీరువాలోని వస్తువులను చిందరవందరంగా పడేసిన దొంగలు

తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా మూడుచోట్ల చోరీలు

ఉక్కుటౌన్‌షిప్‌, డిసెంబరు 12: స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌లో దొంగలు ఆదివారం హల్‌చల్‌ చేశారు. తాళం వేసి వున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. ఆదివారం రాత్రి టౌన్‌షిప్‌లోని రెండిళ్లల్లో దొంగతనం జరిగినప్పటికీ ఎంతమేర అపహరణకు గురైందో స్పష్టత లేదు. వివరాలిలా ఉన్నాయి. సెక్టార్‌-11లోని 206-డీ నంబర్‌ గల ఉక్కు ఉద్యోగి కిశోర్‌సింగ్‌ నివసిస్తున్నారు. ఆదివారం రాత్రి ఆయన డ్యూటీకి వెళ్లేటప్పుడు భార్య ఇంట్లో వుండగానే ఇంటికి బయట తాళం వేశారు. అయితే అర్ధరాత్రి సమయంలో దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి తులంన్నర బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. అయితే ఆ సమయంలో శబ్ధం రావడంతో పక్క గదిలో వున్న కిశోర్‌ భార్య రిపాలీసింగ్‌ బయటకు వచ్చి చూసేసరికి దొంగలు అక్కడ నుంచి పారిపోయారు. అదేవిధంగా 327-డీలో నివసిస్తున్న ఉక్కు ఉద్యోగి ఎ.శ్రీనివాసరావు ఇల్లు తాళం వేసి వుండటంతో దొంగలు చోరీకి పాల్పడ్డారు. శ్రీనివాసరావు తన కుటుంబంతో సహా ఇతర ప్రాంతానికి వెళ్లారు. ఆయన వచ్చాకే ఏమేమి చోరీకి గురయ్యాయో తెలుస్తుంది. అంతేకాకుండా 308-సీలో నివాసం వుంటున్న రాజు అనే వ్యక్తి ఇంట్లో కూడా చోరీ జరిగింది. ఆయన కూడా ఇతర ప్రాంతానికి వెళ్లడంతో ఏమేమి చోరీకి గురయ్యాయో తెలియరాలేదు. సమాచారం అందుకున్న క్రైమ్‌ పోలీసులు ఘటన స్థలాలకు చేరుకుని వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-13T00:05:23+05:30 IST

Read more