నాడు- నేడుకు సిమెంటు కొరత

ABN , First Publish Date - 2022-09-30T05:52:42+05:30 IST

నాడు-నేడు రెండో దశ పనులకు సిమెంట్‌ కొరత వెంటాడుతోంది. జిల్లాలో మిగిలిన మండలాల్లో డిమాండ్‌లో సగం వరకు సిమెంట్‌ అందించిన కంపెనీలు చినగదిలి మండలానికి వచ్చేసరికి కనీసం స్పందించడంలేదు. దీంతో ఈ మండల పరిధిలోని పలు పాఠశాలల్లో పనులు నిలిచిపోయే పరిస్థితి ఎదురయింది. దీంతో ఒక్కో పాఠశాలకు 50 బస్తాల సిమెంట్‌ను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసి, పనులు చేపట్టేలా అధికారులు ఆదేశాలిచ్చారు. అయితే అలా కొనుగోలుచేసిన సిమెంట్‌ రెండు మూడు రోజుల పనులకే సరిపోయింది. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సిమెంట్‌ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

నాడు- నేడుకు సిమెంటు కొరత
సిమెంట్‌ కొరతతో నత్తనడకన సాగుతున్న పాఠశాల భవన నిర్మాణాలు

చినగదిలి మండలంలో నిలిచిపోతున్న పనులు 

బహిరంగ మార్కెట్‌లో 50 బస్తాల కొనుగోలుకు అనుమతి 

వాటితో పనులు పూర్తయినా సరఫరా కాని వైనం 

ప్రస్తుత పనులకు 846.5 టన్నుల సిమెంట్‌ అవసరం 

సరఫరాపై స్పందించని సిమెంట్‌ కంపెనీలు

విశాఖపట్నం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):

నాడు-నేడు రెండో దశ పనులకు సిమెంట్‌ కొరత వెంటాడుతోంది. జిల్లాలో మిగిలిన మండలాల్లో డిమాండ్‌లో సగం వరకు సిమెంట్‌ అందించిన కంపెనీలు చినగదిలి మండలానికి వచ్చేసరికి కనీసం స్పందించడంలేదు. దీంతో ఈ మండల పరిధిలోని పలు పాఠశాలల్లో పనులు నిలిచిపోయే పరిస్థితి ఎదురయింది. దీంతో ఒక్కో పాఠశాలకు 50 బస్తాల సిమెంట్‌ను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసి, పనులు చేపట్టేలా అధికారులు ఆదేశాలిచ్చారు. అయితే అలా కొనుగోలుచేసిన సిమెంట్‌ రెండు మూడు రోజుల పనులకే సరిపోయింది. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.   దీంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సిమెంట్‌ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. 

చినగదిలి మండలంలో మొత్తం 28 పాఠశాలల్లో నాడు-నేడు రెండో దశ కింద అదనపు గదుల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో సుమారు 20 గదుల నిర్మాణానికి ప్రతిపాదించారు. సిమెంటు, ఇనుము, ఇసుక ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. ఇనుము కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేస్తే వారం పదిరోజుల్లో పాఠశాలకు చేరుతోంది. ముడసర్లోవ డిపో నుంచి ఇసుకను మండలంలోని నాలుగైదు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన స్టాక్‌పాయింట్‌లకు చేరుతుండగా, అక్కడి నుంచి పనులు జరిగే పాఠశాలల ప్రధానోపాఽధ్యాయులు తరలిస్తున్నారు. కాగా పనుల నిర్వహణకు అవసరమైన సిమెంట్‌ కోసం మొత్తం ఐదు కంపెనీలకు అధికారులు ఆర్డర్లు ఇచ్చారు. పనుల ప్రారంభ సమయంలో కొంతమేర సిమెంటు సరఫరాచేసిన కంపెనీలు రెండోసారి స్పందించడంలేదు. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతోనే సిమెంటు సరఫరాకు ఆయా కంపెనీలు వెనుకడుగువేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పనులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో స్థానికంగా 50 బస్తాల వరకు కొనుగోలు చేసుకునేలా అనుమతించారు. అయితే ప్రభుత్వం రూ.270 ధరకు సరఫరా చేసే సిమెంట్‌ బస్తా బహరింగ మార్కెట్‌లో రవాణాతో కలిసి రూ.350 అవుతోంది. దీంతో నిధుల సమస్య ఎదురవుతోందని కొందరు ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. దీంతో చినగదిలి మండలంలోని ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో పనులు నిలిచిపోయాయి. అయితే పనుల పురోగతిపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడం మినహా సిమెంట్‌ సరఫరాపై మాట్లాడడం లేదు. మండలంలో పనులు జరిగే పాఠశాలలకు సుమారు 856.5 మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌ సరఫరా చేయాల్సి ఉంది. ఇందులో చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 20 గదుల నిర్మాణానికి ప్రస్తుతం 96 టన్నులు సిమెంట్‌ అవసరం. ఇంకా గోపాలపట్నం, కొత్తపాలెం తదితర ఉన్నత పాఠశాలల్లో పనులు నిలిచిపోయాయి. దీనిపై ఇంజనీరింగ్‌ అధికారుల వద్ద ప్రస్తావించగా కంపెనీల నుంచి సిమెంట్‌ సరఫరా కోసం వేచి చూస్తున్నామన్నారు. పనులు నిలిచిపోకుండా ప్రతి పాఠశాలకు 50 బస్తాలు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలుకు అనుమతి ఇచ్చామన్నారు. సిమెంట్‌ కొరతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని వివరించారు. 

Updated Date - 2022-09-30T05:52:42+05:30 IST