-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » The waist should be tightened for the preservation of Telugu language-NGTS-AndhraPradesh
-
తెలుగు భాష పరిరక్షణకు నడుం బిగించాలి
ABN , First Publish Date - 2022-09-10T06:38:53+05:30 IST
తెలుగు భాష పరిరక్షణకు కవులు, సాహితీవేత్తలతోపాటు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని అధికార భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పిలుపునిచ్చారు.

అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
సింహాచలంలో వైభవంగా ప్రారంభమైన సాహిత్య సంబరాలు
సింహాచలం, సెప్టెంబరు 9: తెలుగు భాష పరిరక్షణకు కవులు, సాహితీవేత్తలతోపాటు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని అధికార భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పిలుపునిచ్చారు. మరోవైపు ప్రభుత్వం కూడా అధికార భాష పరిరక్షణకు నడుంబిగించాలన్నారు. విశాఖ ప్రియమైన రచయితల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇందూరమణ సారధ్యంలో సింహాచలంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సాహిత్య సంబరాలు శుక్రవారం స్థానిక రామానుజ కూటమిలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
తొలుత అతిథులంతా జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో యార్లగడ్డ మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలు సంస్కృతం, హిందీ బోధిస్తూ తెలుగుభాషను పూర్తిగా విస్మరిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ఈతరం విద్యార్థులు తమ పేరు కూడా సరిగారాయలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేధావులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఆదర్శంగా నిలవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుభాష అమలుకు చిత్తశుద్ధితో చేస్తున్న కృషికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సహకరించాలని కోరారు.
ప్రభుత్వం విడుదలచేసిన జీవో మేరకు అన్ని సంస్థలు, కార్యాలయాల బోర్డులు తెలుగులోనే ఉండాలని, లేదంటే వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. మరో ముఖ్య అతిథి డాక్టర్ కూటికుప్పల సూర్యారావు మాట్లాడుతూ తమ కవితలు, కథలు, కథానికల ద్వారా కవులు సమాజాన్ని జాగృతం చేయాలని కోరారు. తొలిరోజు ఉదయం సమావేశాలకు ప్రముఖ రచయిత దామెర వెంకటసూర్యారావు అధ్యక్షత వహించారు.
కార్యక్రమంలో సింహాచల దేవస్థానం పాలకమండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, పలువురు రచయితలు, రచయిత్రులు పాల్గొన్నారు. సాయంత్రం కవి సమ్మేళనంలో సామాజిక ప్రయోజనం కలిగించే అంశాలపై కవులు కవితాగానం చేశారు. ఈ సందర్భంగా విశాఖ ప్రియమైన రచయితల సంక్షేమ సంఘం ముద్రించిన సావనీర్‌ను అతిథులు ఆవిష్కరించారు.