ట్రాక్టర్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2022-06-07T06:23:02+05:30 IST

ట్రాక్టర్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి చెందిన సంఘటన సోమవారం మధ్యాహ్నం మండలంలోని వంతాడపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

ట్రాక్టర్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి
అప్పలనాయుడు (ఫైల్‌ ఫొటో)వంతాడపల్లి గ్రామంలో దుర్ఘటన

పాడేరురూరల్‌, జూన్‌ 6: ట్రాక్టర్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి చెందిన సంఘటన సోమవారం మధ్యాహ్నం మండలంలోని వంతాడపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్‌ఐ జి.లక్ష్మణరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. వి.మాడుగుల మండలం వీరనారాయణం గ్రామానికి చెందిన బొడ్డేటి అప్పలనాయుడు(38)కు సొంత ట్రాక్టర్‌ వుంది. దానికి ఆయనే డ్రైవర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా పొలాలు దున్నే పని ఉంటే ఆయన అక్కడికి వెళ్లి పని పూర్తి చేసుకుని వస్తుంటారు. ఇదే క్రమంలో పాడేరు మండలంలోని వంతాడపల్లి గ్రామానికి చెందిన గిరిజన రైతు పొలాన్ని దున్నేందుకు ట్రాక్టర్‌తో ఆయన ఆదివారం వచ్చారు. వ్యవసాయ పొలాన్ని దున్నేసి సాయంత్రం కావడంతో ట్రాక్టర్‌ను పొలంలోనే విడిచిపెట్టారు. సోమవారం ఉదయం నుంచి వర్షం కురవడంతో మధ్యాహ్నం వరకు ట్రాక్టర్‌ను పొలంలోనే ఉంచేశారు. వర్షం తగ్గడంతో మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో ట్రాక్టర్‌ను పొలం నుంచి రోడ్డుపైకి తీసుకువస్తుండగా బోల్తా పడింది. ఆ ట్రాక్టర్‌ కింద ఆయన చిక్కుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాడేరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Read more