కేంద్ర పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు తగవు

ABN , First Publish Date - 2022-11-03T00:55:31+05:30 IST

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి వి.మురళీధరన్‌ బుధవారం అనకాపల్లి మండలంలోని మేజర్‌ పంచాయతీ తుమ్మపాల ప్రాంతాల్లో పర్యటించారు.

కేంద్ర పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు తగవు
కేంద్ర పథకాల పుస్తకం, కరపత్రాన్ని అందజేస్తున్న మంత్రి మురళీధరన్‌

కరోనా కష్టకాలంలోనూ ఆంధ్రాకు బాసట

దేశాభివృద్ధే లక్ష్యంగా మోదీ విధానాలు ముందుకు

తుమ్మపాల ప్రాంతాల్లో విస్తృత పర్యటన

ఇంటింటికీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఆరా

కొత్తూరు (అనకాపల్లి), నవంబర్‌ 2 : కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి వి.మురళీధరన్‌ బుధవారం అనకాపల్లి మండలంలోని మేజర్‌ పంచాయతీ తుమ్మపాల ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఎంతగానో సాయం చేసిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత రేషన్‌ బియ్యం చాలా వరకు అందజేయలేదని తన దృష్టికి ప్రజలు తీసుకువచ్చినట్టు చెప్పారు. ప్రధాని వందలాది పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు గొప్పలు చెప్పుకోవడం అన్యాయమన్నారు. అర్బన్‌ పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద 1.22 కోట్ల ఇళ్లు, గ్రామీణ ప్రాంత పరిధిలో 2.3 కోట్ల ఇళ్లు మంజూరు చేశామని వివరించారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద 11.3 కోట్ల రైతు కుటుంబాలకు రూ.21.82 లక్షల కోట్లు అందజేసినట్టు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మోదీ విధానాలు ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. అనంతరం పథకాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఇదిలావుంటే, తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించి, ఆధునీకరించాలని రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు దొడ్డి సత్యఅప్పారావు, పీలా జగ సత్యనారాయణ మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు ఫ్యాక్టరీ చరిత్రను ఆయనకు వివరించారు. చెరకు రైతులు, ఫ్యాక్టరీ కార్మికులను దృష్టిలో ఉంచుకుని చక్కెర కర్మాగారాన్ని ఆధునీకరించేందుకు అవసరమైన నిధులను నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కో-ఆపరేటివ్‌ షుగర్స్‌ న్యూఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల సమస్యలపై విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు పాత్రపల్లి వీరుయాదవ్‌ మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు పి.విష్ణుకుమార్‌రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, చదరం నాగేశ్వరరావు, అనకాపల్లి అర్బన్‌ అటల్జీ మండల అధ్యక్షుడు మారిశెట్టి భాస్కరరావు, ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షుడు కొండబాబు, నాయకులు పి.వర్మ, ప్రసాద్‌, ప్రకాష్‌రెడ్డి, జోనల్‌ ఇన్‌చార్జి రవిరాజా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-03T00:55:31+05:30 IST
Read more