మన్యాన్ని వదలని వాన

ABN , First Publish Date - 2022-10-08T06:14:07+05:30 IST

మన్యాన్ని వాన వదలడం లేదు. నాలుగు రోజులుగా ముసురు వాతావరణం కొనసాగుతున్నండగా గురువారం భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం కూడా మోస్తురు నుంచి భారీ వర్షం పడింది.

మన్యాన్ని వదలని వాన
కొయ్యూరు: జల దిగ్బంధంలో ఉన్న గోపవరం గ్రామం

భారీ వర్షాలతో జన జీవనానికి అంతరాయం

సంతల్లో స్తంభించిన వ్యాపార లావాదేవీలు

జల దిగ్బంధంలో కొండవాలు గ్రామాలు

అనంతగిరి ఘాట్‌ రోడ్డు జలమయం

రాకపోకలకు వాహన చోదకుల నరకం

బిక్కుబిక్కుమంటూ గిరిజనుల జీవనం


కొయ్యూరు/అరకులోయ/ముంచంగిపుట్టు/డుంబ్రిగుడ/అనంతగిరి, అక్టోబరు 7: మన్యాన్ని వాన వదలడం లేదు. నాలుగు రోజులుగా ముసురు వాతావరణం కొనసాగుతున్నండగా గురువారం భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం కూడా మోస్తురు నుంచి భారీ వర్షం పడింది. దీంతో జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కొండవాలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. అలాగే వారపు సంతల్లో వ్యాపార లావాదేవీలు స్తంభించిపోతున్నాయి.

కొయ్యూరు మండలంలోని చిట్టింపాడు పంచాయతీలోని గోపవరం గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు కొండ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రెండు కొండల మధ్య ఉన్న గోపవరం గ్రామంలోకి వరద చేరడంతో ఊరంతా నీరే కనిపిస్తోంది. గ్రామానికి డ్రైనేజీ వ్యవస్థ కూడా లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నీటి ఊట పెరిగిపోవడంతో ఇళ్లు నానిపోయి గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుధ్యం లోపించడంతో వారిని వ్యాధుల భయం వెంటాడుతోంది. వర్షాలు కురుస్తున్న ప్రతీసారి ఈ సమస్యను ఉంటుందని, ఉన్నతాధికారులకు తెలిపినా ఫలితం లేకపోతున్నదని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని, కొండవాగు ప్రవాహం గ్రామంలోకి చొరబడకుండా దారి మళ్లించాలని వారు వేడుకుంటున్నారు. అలాగే భారీ వర్షాలకు యు.చీడిపాలెం, మఠం భీమవరం పంచాయతీల్లోని పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. నిత్యావసర సరకులకు సైతం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

 అరకులోయ పరిసర ప్రాంతాలలో శుక్రవారం రోజంతా వర్షం పడింది. దీంతో అరకు వారపు సంత స్తంభించిపోయింది. మండలం నలుమూలల నుంచి సంతకు విచ్చేసిన వ్యాపారులు, గిరిజనులు వ్యాపార లావాదేవీలు జరగకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు. అలాగే వర్షానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పర్యాటకులు సైతం ముసురు వాతావరణంతో పడరాని పాట్లు పడుతున్నారు.

ముంచంగిపుట్టు మండల పరిధిలో శుక్రవారం ముసురు వాతావరణం ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాన పడుతునే ఉంది. మూడు రోజులుగా వర్షం కురుస్తుండడంతో మత్స్యగెడ్డ ప్రవాహిత నీటిపై ఆధారపడి ఉన్న జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. వాగులు, వంకలు, గెడ్డ పాయలు వరద నీటితో ప్రవహిస్తున్నాయి. మట్టి రహదారులు బురదమయంగా మారాయి. దీంతో రాకపోకలకు వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.

అనంతగిరి మండలాన్ని వాన ముంచెత్తింది. రెండు రోజుల పాటు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం శుక్రవారం  సైతం కొనసాగింది. శుక్రవారం మన్యంలోనే అత్యధికంగా 66.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోజంతా కుండపోత వర్షం కురవడంతో ఘాట్‌ రోడ్డు జలమయమైంది. కొండలపైనుంచి వరద నీరు  ప్రవహిస్తుండడంతో రహదారి గెడ్డలను తలపిస్తూ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది. తైడా సమీపంలో బండరాళ్లు జారిపడి రహదారిపైకి వచ్చాయి. గోస్తనీ, చంపావతి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. గోస్తనీ ప్రవాహం ఎక్కువుగా ఉండడంతో తాటిపూడి జలాశయం గేట్లపై నుంచి నీరు ప్రవహిస్తున్నది. 

డుంబ్రిగుడ మండలంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దీంతో వారపు సంతకు ఆటంకమేర్పడింది. సంత బురదమయం కావడంతో మారుమూల గ్రామాల నుంచి వచ్చిన గిరి రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు.

Updated Date - 2022-10-08T06:14:07+05:30 IST