అల్లూరి స్ఫూర్తితో రాష్ట్రంలో దోపిడీదారులను తరిమికొట్టాలి

ABN , First Publish Date - 2022-07-05T06:34:02+05:30 IST

అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో రాష్ట్రంలో ఉన్న దోపిడీ దొంగలను తరిమికొట్టాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు.

అల్లూరి స్ఫూర్తితో రాష్ట్రంలో దోపిడీదారులను తరిమికొట్టాలి
కృష్ణాదేవిపేటలో అల్లూరి, గంటందొరల సమాధులపై పూలుజల్లి నివాళులు అర్పిస్తున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, టీడీపీ నాయకులు


మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పిలుపు

కృష్ణాదేవిపేట పార్కులో అల్లూరికి ఘన నివాళులు

స్మారక ప్రదేశాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శ



కృష్ణాదేవిపేట, జూలై 4: అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో రాష్ట్రంలో ఉన్న దోపిడీ దొంగలను తరిమికొట్టాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా సోమవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కృష్ణాదేవిపేట అల్లూరి పార్కుకు ర్యాలీగా వచ్చారు. అనంతరం అల్లూరి, గంటందొరల సమాధులకు, విగ్రహాలకు  పూలమాలువేసి నివాలు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలకుల దోపిడీని ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, అర్ధరాత్రిపూట ఉన్నతాధికారుల పర్యవేక్షణలో విపక్ష నేతల ఇళ్లను కూలగొట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక్కడి అల్లూరి స్మారక పార్కును టీడీపీ హయాంలో అభివృద్ధి చేశామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముత్తంశెట్టి శ్రీనివాసరావు పర్యాటక శాఖ మంత్రిగా వున్నప్పుడు కృష్ణాదేవిపేట పార్కు అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారని, కానీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని అన్నారు. అల్లూరి స్మారక పార్కు నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారని విమర్శించారు. ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా.. అల్లూరి పార్కును సందర్శించి అభివృద్ధి చేయిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. అల్లూరి 125వ జయంతి ఉత్సవాలను వారం రోజులపాటు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, తొలిరోజే తూతూమంత్రంగా చేశారని అయ్యన్న ఆరోపించారు.. పార్లమెంటులో అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అల్లూరి పేరిట రూ.125 నాణేనాన్ని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖద్వారా కోరినట్టు అయ్యన్న చెప్పారు. అనంతరం పార్కు పనిచేస్తున్న ముగ్గురు కార్మికులకు రూ.24 వేల నగదు సాయం అందించారు. ఈ కార్యక్రమంలోమాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద సత్యనారాయణ, గవిరెడ్డి రామునాయుడు, నర్సీపట్నం జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ, టీడీపీ నాయకులు చిటికెల తారకవేణుగోపాల్‌, అడిగర్ల అప్పలనాయుడు, అదపురెడ్డి గోపాలకృష్ణ, బొడ్డు జమీలు, పెట్ల నారాయణమూర్తినాయుడు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-05T06:34:02+05:30 IST