మన్యంలో మావోల ప్రాబల్యం తగ్గింది

ABN , First Publish Date - 2022-12-13T00:59:19+05:30 IST

ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎస్‌.హరికృష్ణ అన్నారు. ఆయన సోమవారం నర్సీపట్నం, గొలుగొండ పోలీస్‌ స్టేషన్లను సందర్శించి, పలు కేసులకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు.

మన్యంలో మావోల ప్రాబల్యం తగ్గింది
విలేఖరులతో మాట్లాడుతున్న డీఐజీ హరికృష్ణ

గొలుగొండ/నర్సీపట్నం అర్బన్‌, డిసెంబరు 12: ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎస్‌.హరికృష్ణ అన్నారు. ఆయన సోమవారం నర్సీపట్నం, గొలుగొండ పోలీస్‌ స్టేషన్లను సందర్శించి, పలు కేసులకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ, మావోయిస్టుల కదలికలపై నిరంతం నిఘా పెట్టామని, పోలీసు శాఖ పిలుపుతో మావోలు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారని చెప్పారు. ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో గంజాయి రవాణా కట్టడికి పటిష్ఠ చర్యలు చేపట్టామని, ఏజెన్సీ నుంచి వచ్చే మార్గాల్లో ప్రత్యేక పోలీసులతో పెట్రోలింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ఏడాది 7,500 ఎకరాల్లో గంజాయి మొక్కలను పీకేసి దహనం చేసినట్టు డీఐజీ వెల్లడించారు. గంజాయి సాగుదారులను గుర్తించి వారికి రాజ్‌మా విత్తనాలను రాయితీపై రైతు భరోసా కేంద్రల ద్వారా పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అనకాపల్లి జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడిన సుమారు రెండు లక్షల కిలోల గంజాయిని ఈ ఏడాది ఫిబ్రవరిలో దహనం చేయించామన్నారు. గిరిజన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పోలీసు శాఖపరంగా పలు చర్యలు చేపట్టినట్టు రేంజ్‌ డీఐజీ హరికృష్ణ చెప్పారు. ఆయన వెంట జిల్లా ఎస్సీ గౌతమి శాలి, నర్సీపట్నం ఇన్‌చార్జి డీఎస్‌పీ ప్రవీణ్‌కుమార్‌, నర్సీపట్నం రూరల్‌ సీఐ శ్రీనివాసరావు, గొలుగొండ ఎస్‌ఐ నారాయణరావు, తదితరులు వున్నారు.

Updated Date - 2022-12-13T00:59:19+05:30 IST

Read more