ప్రభుత్వం జీవోలను దాస్తోంది!

ABN , First Publish Date - 2022-11-17T04:01:03+05:30 IST

ప్రజాసంబంధం తో ముడిపడి ఉన్న జీవోలను కూడా బహిర్గతం చేయకుండా రాష్ట్రప్రభుత్వం గోప్యత పాటిస్తోందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వీవీఎ్‌సఎస్‌ శ్రీకాంత్‌ హైకోర్టుకు తెలిపారు...

ప్రభుత్వం జీవోలను దాస్తోంది!

10 శాతమే సైట్‌లో పెడుతున్నారు

జీవోఐఆర్‌ను పునరుద్ధరించేలా ఆదేశించండి

హైకోర్టులో పిటిషన్‌.. 2 వారాలకు వాయిదా

అమరావతి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ప్రజాసంబంధం తో ముడిపడి ఉన్న జీవోలను కూడా బహిర్గతం చేయకుండా రాష్ట్రప్రభుత్వం గోప్యత పాటిస్తోందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వీవీఎ్‌సఎస్‌ శ్రీకాంత్‌ హైకోర్టుకు తెలిపారు. గతంలో ఏడాదికి 10వేల నుంచి 15 వేల వరకు జీవోలను ‘జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌‘లో అప్‌లోడ్‌ చేసేవారన్నారు. ప్రస్తుతం 10శాతమే ఏపీగెజిట్‌ వెబ్‌సైట్‌లో ఉంచుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు 3,090 జీవోలు మాత్రమే బహిర్గతం చేశారన్నారు. జీవోలను బయటపెట్టకుండా ప్రభుత్వం సమాచారం తెలుసుకొనే హక్కును హరిస్తోందని కోర్టుకు వివరించారు. ప్రభుత్వ చర్య సమాచారహక్కు చట్టం, సప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందన్నారు. జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. పిటిషనర్ల తరఫున మరో న్యాయవాది అంబటి సుధాకర్‌ వాదనలు వినిపించేందుకు సిద్ధమవగా ధర్మాసనం కలగజేసుకుని, పిటిషనర్లు ఏ రికార్డుల ఆధారంగా వాదనలు వినిపించాలనుకుంటున్నారో వాటన్నిటినీ ఒకచోట చేర్చి సింగిల్‌ ఫైల్‌ రూపంలో కోర్టు ముందు ఉంచాలని సూచించింది. మరోవైపు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) సి. సుమన్‌ స్పందిస్తూ.. జీవోల విషయంలో వివరాలు సమర్పించేందుకు 2 వారాల సమయం ఇవ్వాలని కోరారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టకపోవడాన్ని సవాల్‌ చేస్తూ గుంటూరుకు చెందిన నెల్లూరు పట్టణానికి చెందిన జీఎంఎన్‌ఎస్‌ దేవి, బాపట్లజిల్లా, అన్నంబొట్లవారిపాలెం గ్రామానికి చెందిన చెన్నుపాటి సింగయ్య మరికొందరు వ్యాజ్యాలు దాఖలు చేశారు.

Updated Date - 2022-11-17T04:01:15+05:30 IST