కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలి

ABN , First Publish Date - 2022-09-11T05:52:36+05:30 IST

ఉక్కు కర్మాగారాన్ని మూసివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరిత ఆలోచనలు చేస్తుందని, వాటిని కార్మికులంతా ఐక్య పోరాటాలతో తిప్పికొట్టాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు అయోధ్యరామ్‌ పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలి
దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న అయోధ్యరామ్‌

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు అయోధ్యరామ్‌ 

కూర్మన్నపాలెం, సెప్టెంబరు 10: ఉక్కు కర్మాగారాన్ని మూసివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరిత ఆలోచనలు చేస్తుందని, వాటిని కార్మికులంతా ఐక్య పోరాటాలతో తిప్పికొట్టాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు అయోధ్యరామ్‌ పిలుపునిచ్చారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 575వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాభాల్లో నడుస్తున్న స్టీల్‌ ప్లాంట్‌ను ఎందుకు విక్రయిస్తున్నారని ప్రశ్నించారు. ముడిసరకును కేటాయించడంతో పాటు వడ్డీ రేట్లను తగ్గిస్తే స్టీల్‌ ప్లాంట్‌ ఉత్పత్తిలో దూసుకుపోతుందని.. మరెంతో మందికి ఉపాధి కల్పిస్తుందని పేర్కొన్నారు. కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రోజుకో విభాగంలో ఉత్పత్తిని నిలిపివేస్తూ కొన్ని విభాగాలను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టాలని కేంద్రం చూడడం దారుణమన్నారు. ఉక్కు భూములపై ప్రభుత్వ పెద్దల కళ్లు పడ్డాయని, ఇక్కడి నుంచి ఒక్క గజం స్థలాన్ని కూడా ఎవరూ తీసుకుపోలేరన్నారు. ఇక్కడి భూములు నిర్వాసితులకే సొంతమని స్పష్టం చేశారు. చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల విక్రయానికి పూనుకోవడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. దేశ సంపదను కూడబెడుతున్న కార్మిక వర్గం కడుపు కొడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు పోరాటాలను మరింత ఉధృతం చేయాలన్నారు. నాయకులు జె.రామకృష్ణ, మస్తానప్ప, కేఎస్‌ఎన్‌ రావు, గంధం వెంకటరావువు మాట్లాడుతూ ఉక్కు ప్రైవేటీకరణ జరిగితే నిర్వాసితులతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాల భవిష్యత్తు అంధకారంగా మారుతాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, నీరుకొండ రామచంద్రరావు, జి.ఆనంద్‌, గుమ్మడి నరేంద్ర, పలువురు కార్మికులు పాల్గొన్నారు.


రాజకీయ పక్షాలతో కలిసి పోరాడాలి

ఉక్కుటౌన్‌షిప్‌: స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై చేస్తున్న ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం వుందని, ఇందుకోసం అన్ని రాజకీయ పక్షాలతో కలిసి పోరాటాలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు పిలుపునిచ్చారు. స్టీల్‌ ప్లాంట్‌ యూనియన్‌ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం విక్రయించాలని చూస్తుందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఈ సమావేశంలో గుర్తింపు యూనియన్‌ నాయకులు డి.ఆదినారాయణ, కేఎస్‌ఎన్‌ రావు, జె.రామకృష్ణ, నరసింగరావు, నరేశ్‌కుమార్‌, మిశ్రా, జయ, తదితరులు పాల్గొన్నారు.


Read more