తుగ్లక్‌ పాలనకు నిదర్శనం హెల్త్‌ వర్సిటీ పేరు మార్పు

ABN , First Publish Date - 2022-09-30T05:54:25+05:30 IST

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు జీవోను వెనక్కి తీసుకోకపోతే వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆందోళనలను ఉధృతం చేస్తామని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు.

తుగ్లక్‌ పాలనకు నిదర్శనం హెల్త్‌ వర్సిటీ పేరు మార్పు
హౌసింగ్‌ బోర్డు కాలనీలో చేపట్టిన ఆందోళన పాల్గొన్న పల్లా శ్రీనివాసరావు, తదితరులు

టీడీపీ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు 

పెదగంట్యాడ, సెప్టెంబరు 29: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు జీవోను వెనక్కి తీసుకోకపోతే వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆందోళనలను ఉధృతం చేస్తామని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు. రాష్ట్రంలో సీఎం జగన్‌ తుగ్లక్‌ పాలనకు హెల్త్‌ వర్సిటీకి పేరు మార్చడం నిదర్శనమని విమర్శించారు. యూనివర్సిటీ పేరు మార్ప జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం 76వ వార్డు పరిధి హౌసింగ్‌ బోర్డు కాలనీలో టీడీపీ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచంలోనే తెలుగువారికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు అని, అటువంటి మహనీయుని పేరును హెల్త్‌ యూనివర్సిటీకి మార్చడం దారుణమన్నారు. కొత్తగా విద్యా సంస్థలు స్థాపించడం చేతకాక వున్నవాటికి పేర్లు మార్పు చేసి కాలం వైసీపీ ప్రభుత్వం గడుపుతుందన్నారు. కార్పొరేటర్‌ గంధం శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరుపేదల ఆరోగ్యం కోసం నిరంతరం తపించిన దివంగత ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారన్నారు. అలాంటి మహనీయుని పేరును హెల్త్‌ వర్సిటీకి మార్చడం భావ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్‌ పల్లా శ్రీను, టీడీపీ నాయకులు బాసెట్టి అప్పారావు, నమ్మి అప్పారావు, పీత వెంకటరమణ, వియ్యపు వెంకన్న, పంచదార్ల ఉగ్రం, మొల్లి పెంటిరాజు, సత్యారావు, తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. 


రామకృష్ణాపురంలో..

మల్కాపురం: రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని నిరసిస్తూ పారిశ్రామిక ప్రాంతంలోని ఏడు వార్డులకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం రామకృష్ణపురంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ అంటే కేవలనం తెలుగుదేశం పార్టీ నేతే కాదని, రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో వున్న మహనీయుడన్నారు. ఎన్టీఆర్‌ పేరును హెల్త్‌ యూనివర్సిటీకి తొలగించి సీఎం జగన్‌ తమ తండ్రి వైఎస్సార్‌ పేరు పెట్టడం భావ్యం కాదన్నారు. ఎన్టీఆర్‌ పేరును హెల్త్‌ యూనివర్సిటీకి కొనసాగించేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ‘పశ్చిమ’ ఎమ్మెల్యే పి.గణబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కా లక్ష్మణరావు, టీడీపీ నాయకులు పొలిమేర సీతారామ్‌, నీలాపు జోగి, మజ్జి సోమేశ్‌, కోరాడ శ్రీను, ఆది, పెద్దాడ భూలోకరాజు, జయశంకర్‌, తదితరులు పాల్గొన్నారు. 
Read more