మత్స్యగెడ్డలో నాటు పడవ బోల్తా

ABN , First Publish Date - 2022-05-24T05:37:01+05:30 IST

మండలంలో గల దోడిపుట్టు పంచాయతీ చిన్నసిందిపుట్టు గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం నాటు పడవ బోల్తా పడింది. ఈ సంఘటనలో ఒక గిరిజనుడు గల్లంతయ్యాడు

మత్స్యగెడ్డలో నాటు పడవ బోల్తా
కె.సుఖదేవ్‌


గిరిజనుడి గల్లంతు

ముంచంగిపుట్టు, మే 23: మండలంలో గల దోడిపుట్టు పంచాయతీ చిన్నసిందిపుట్టు గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం నాటు పడవ బోల్తా పడింది. ఈ సంఘటనలో ఒక గిరిజనుడు గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నసిందిపుట్టు గ్రామానికి చెందిన కె.సుఖదేవ్‌(52) అనే  గిరిజనుడు  ఒడిశా  రాష్ట్రం కోరాపుట్టు జిల్లా నందపూర్‌ బ్లాక్‌  బంగారుపడా గ్రామానికి పనిపై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో నాటుపడవపై మత్స్యగెడ్డ దాటుతుండగా గెడ్డ మధ్యలోకి వచ్చే సరికి పడవ బోల్తా కొట్టింది. దీంతో అతను గెడ్డలో మునిగిపోయాడు. విషయం తెలిసి సిందిపుట్టు గ్రామస్థులు వెంటనే మత్స్యగెడ్డ పైపు పరుగులు తీశారు. సుఖదేవ్‌ కోసం మత్స్యగెడ్డలో గాలించారు. చీకటి పడినప్పటికీ ఆచూకీ తెలియ రాలేదు. తిరిగి ఉదయం గాలింపు చేపట్టనున్నామని గ్రామస్థులు తెలిపారు. సుఖదేవ్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గతంలో అతని భార్య అనారోగ్యంతో  మృతి  చెందింది.  ఇప్పుడు తండ్రి గల్లంతు కావడంతో  పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి క్షేమంగా రావాలని వారు దేవుడిని ప్రార్థిస్తున్నారు. కాగా సుఖదేవ్‌ ఆచూకీ కోసం అధికార యంత్రాంగం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

Read more