భారీ వాహనాలొస్తే అంతే!

ABN , First Publish Date - 2022-12-13T00:11:09+05:30 IST

ఎంతో హాయిగా సాగే స్థానిక ఘాట్‌ ప్రయాణం ఇటీవల ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. ఊహించని విధంగా భారీ వాహనాలు ఘాట్‌లో రాకపోకలు సాగిస్తుండడంతో సమస్యలు తలెత్తుతున్నాయి.

భారీ వాహనాలొస్తే అంతే!
ఘాట్‌లో ఏసుప్రభు బొమ్మ మలుపు వద్ద సోమవారం ఉదయం నిలిచిపోయిన ఐరన్‌ లోడుతో ఉన్న భారీ వాహనం

ఘాట్‌ మలుపులో తరచూ మొరాయింపు

ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం

వాహనచోదకులకు తప్పని అవస్థలు

పట్టించుకోని అధికారులు

(ఆంధ్రజ్యోతి- పాడేరు)

ఎంతో హాయిగా సాగే స్థానిక ఘాట్‌ ప్రయాణం ఇటీవల ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. ఊహించని విధంగా భారీ వాహనాలు ఘాట్‌లో రాకపోకలు సాగిస్తుండడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని సార్లు ఘాట్‌ మలుపుల వద్ద అవి మొరాయిస్తుండడంతో గంటల తరబడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది. దీంతో ఘాట్‌లో ప్రయాణించేటప్పుడు భారీ వాహనాలు కనిపిస్తే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఘాట్‌లోని ఏసుప్రభు బొమ్మ మలుపు వద్ద ఐరన్‌లోడుతో ఉన్న భారీ వాహనం సోమవారం ఉదయం ఆగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఏజెన్సీ నుంచి విశాఖపట్నం డిపార్టుమెంట్‌ టెస్ట్‌కు హాజరయ్యేందుకు వెళ్లే ఉద్యోగులు అక్కడ చిక్కుకుపోయారు. సకాలంలో డిపార్టుమెంట్‌ టెస్ట్‌కు హాజరుకాలేమని తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలో ప్రయాణికుల సహకారంతో మొరాయించిన భారీ వాహనాన్ని కాస్త పక్కకు తీయడంతో రాకపోకలకు వీలు కలిగింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఈ ఏడాది సెప్టెంబరు 11న కోమాలమ్మపనుకు మలుపు వద్ద ఆయిల్‌ ట్యాంకర్‌ అడ్డంగా ఆగిపోవడంతో మూడు గంటల పాటు ఏజెన్సీకి, మైదాన ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యం ఘాట్‌లో ఇదే పరిస్థితి తలెత్తుతుండడంతో డ్రైవర్లు, ప్రయాణికులు భారీ వాహనాలంటే భయపడుతున్నారు. పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి రాకపోకలు సాగించాలంటే, ఘాట్‌ ప్రయాణం తప్పనిసరి. పాడేరు మండలం మినుములూరు నుంచి వి.మాడుగుల మండలం గరికబంద వరకు 25 కిలోమీటర్లు ఘాట్‌ మార్గమే. ఏజెన్సీలో పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాలతో పాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తాయి. అలాగే పాడేరు జిల్లా కేంద్రం కావడంతో గతంతో పోలిస్తే ఈ మధ్య వాహనాల రాకపోకలు మరింతగా పెరిగాయి. దీంతో స్థానిక ఘాట్‌ మార్గం నిత్యం వాహనాలతో రద్దీగానే ఉంటోంది. ఈ తరుణంలో ఏ మాత్రం రాకపోకలకు అంతరాయం ఏర్పడినా అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోతున్నాయి.

తరచూ మొరాయిస్తున్న భారీ వాహనాలు

ఇటీవల కాలంలో స్థానిక ఘాట్‌ మార్గంలో తర చూ భారీ వాహనాలు పలు మలుపుల వద్ద ఆగిపోతున్నాయి. ఎక్కువగా రాజాపురం గ్రామానికి సమీపంలో, ఏసుప్రభు బొమ్మ మలుపు, కోమాలమ్మపనుకు మలుపు, గరికబందకు సమీపంలోనే భారీ వాహనాలు ఘాట్‌ ఎక్కలేక ఆగిపోతున్నాయి. దీంతో గంటల తరబడి ప్రయాణికులు అడవిలో జాగరణ చేయాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. ఈ ఏడాది మార్చి 26వ తేదీ రాత్రి ఏసుప్రభు బొమ్మ మలుపు వద్ద సిమెంట్‌ రేకుల లోడుతో ఉన్న భారీ లారీ ఆగిపోయింది. దీంతో సుమారుగా 14 గంటల పాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. బస్సుల్లో, సొంత వాహనాల్లో ఉన్న వారంతా రాత్రంతా వాహనాల్లో తిండీతిప్పలు లేకుండా అవస్థలు పడ్డారు. ఇది మచ్చుకు మాత్రమే. ఇటీవల కాలంలో ఇటువంటి పరిస్థితులు తరచూ చోటుచేసుకుంటున్నాయి.

అమలుకాని నిబంధనలు

స్థానిక ఘాట్‌లో భారీ వాహనాలు రాకపోకలు సాగించకూడదనే నిబంధనలు మచ్చుకైనా అమలు కావడం లేదు. గతంలో సిమెంట్‌ రేకులు, సిమెంట్‌ బస్తాలతో వచ్చే వాహనాలను గరికబంద జీసీసీ చెక్‌గేటు వద్ద నిలిపివేసి అక్కడ నుంచి ఆయా సరకులను మినీ వ్యాన్లలో లోడ్‌ చేసి ఘాట్‌ మీదుగా ఏజెన్సీకి తరలించేవారు. అయితే గత నాలుగేళ్లుగా అలా చేయకుండా ఆయా సరకులతో ఉన్న భారీ లారీలు సైతం ఘాట్‌లో రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా లారీలు మరమ్మతులకు గురై మలుపుల వద్ద ఆగిపోతున్న సందర్భాల్లో ఇతర వాహనాల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. అలాగే ఆయా లారీలు సైతం మోటారు చట్టాల నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌ లోడ్‌తో ఘాట్‌లో రాకపోకలు సాగించే క్రమంలో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిపై రవాణా శాఖ, పోలీసు అధికారులు కనీసం దృష్టి సారించకపోవడంతో వారంలో కనీసం రెండు సార్లు ఇటువంటి ఇబ్బందులు తప్పడం లేదని బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-12-13T00:11:13+05:30 IST