‘ఇదేం ఖర్మ’లో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-11-23T02:31:03+05:30 IST

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు వంతెన వద్ద టీడీపీ నేతలు చేపట్టిన ‘ఇదే ఖర్మ ఈ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని వైసీపీ స్థానిక నేతలు అడ్డుకోవడం..

‘ఇదేం ఖర్మ’లో ఉద్రిక్తత

యనమలకుదురు వంతెనపై టీడీపీ ఆందోళన

దీనిని అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన వైసీపీ

పెనమలూరు, నవంబరు 22: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు వంతెన వద్ద టీడీపీ నేతలు చేపట్టిన ‘ఇదే ఖర్మ ఈ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని వైసీపీ స్థానిక నేతలు అడ్డుకోవడం.. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ హయాంలో 90ు పూర్తయిన స్థానిక యనమలకుదురు వంతెన వైసీపీ హయాంలో ఆగిపోవడంపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. దీనికి ప్రతిగా వైసీపీ నాయకులు వంతెనపైకి చేరుకుని టీడీపీ నేతలు రాకుండా అడ్డుపడ్డారు. ఈ క్రమంలో కొందరు కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను నిలువరించి వైసీపీ శ్రేణులను వెనక్కు నెట్టేశారు.

దీంతో వాళ్లు.. వంతెనకు ఒక పక్కన బైఠాయించిన టీడీపీ వారిని పంపించివేస్తే గానీ తాము అక్కడి నుంచి కదలబోమని తేల్చి చెప్పారు. అయితే, తాము ప్రభుత్వ వైఫల్యాలపై శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చామని, తామెందుకు వెళ్తామంటూ కొనకళ్ల నారాయణ, బోడే ప్రసాద్‌లు కొత్త వంతెనపైకి నిచ్చెన సాయంతో ఎక్కి అక్కడి నుంచి నిరసన తెలపడం ప్రారంభించారు. వైసీపీ కార్యకర్తల వత్తిడితో పోలీసు అధికారులు బోడే ప్రసాద్‌ను అరెస్టు చేయడానికి వంతెన ఎక్కే ప్రయత్నం చెయ్యబోగా తాను కృష్ణా కాల్వలోకి దూకుతానంటూ బోడె ప్రసాద్‌ హెచ్చరించారు. దీంతో పోలీసులు అరెస్టు యత్నాన్ని విరమించి వైసీపీ శ్రేణులను అక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు 4 గంటల హైడ్రామా అనంతరం, టీడీపీ కార్యకర్తలను అరెస్టు చెయ్యబోమని పోలీసులు హామీ ఇవ్వడంతో బోడే ప్రసాద్‌ వెళ్లిపోయారు.

Updated Date - 2022-11-23T02:31:03+05:30 IST

Read more