గోవాడలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-12-13T01:01:41+05:30 IST

మండలంలోని గోవాడలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు ఎంపిక చేసిన స్థలంపై ఇరువర్గాల మధ్య గొడవ జరిగి, ఉద్రిక్తతకు దారితీసింది.

గోవాడలో ఉద్రిక్తత
కరెంటు స్తంభం ఎక్కిన వెంకటరావు

బంజరు భూమిని నివాస స్థలాలుగా ఇవ్వాలని అధికారులకు ఎమ్మెల్యే ధర్మశ్రీ ఆదేశం

ఆ భూమి తమ ఆధీనంలో ఉందంటూ ఓ వ్యక్తి అభ్యంతరం

ఇళ్ల పట్టాలకు ఇవ్వొద్దంటూ కరెంటు స్తంభం ఎక్కిన వైనం

బంజరు భూమిలోనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మరో వ్యక్తి డిమాండ్‌

పోటీగా మరో విద్యుత్‌ స్తంభం ఎక్కి నిరసన

ఇరువర్గాల గొడవతో పోలీసులు రంగ ప్రవేశం

కరెంటు స్తంభాలపై నుంచి కిందకు దిగాలని హెచ్చరిక

అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలింపు

చోడవరం, డిసెంబరు 12: మండలంలోని గోవాడలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు ఎంపిక చేసిన స్థలంపై ఇరువర్గాల మధ్య గొడవ జరిగి, ఉద్రిక్తతకు దారితీసింది. తమ ఆధీనంలో వున్న స్థలాన్ని ఇళ్ల పట్టాలకు ఎలా కేటాయిస్తారంటూ ఒక వర్గానికి చెందిన వ్యక్తి విద్యుత్‌ స్తంభం ఎక్కాడు. అది పూర్తిగా బంజరు భూమి అని, ఇళ్ల స్థలాలు అక్కడే కేటాయించాలంటూ పోటీగా మరో వ్యక్తి కూడా విద్యుత్‌ స్తంభం ఎక్కాడు. పోలీసులు వచ్చి హెచ్చరించడంతో ఇద్దరు వ్యక్తులు కరెంటు స్తంభాల మీద నుంచి కిందకు దిగారు. వీరిని స్టేషన్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

‘గడప గడపకు...’ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మక్ష సోమవారం మండలంలో గోవాడ గ్రామానికి వచ్చారు. ఒకటో వార్డులో పర్యటిస్తుండగా, పలువురు మహిళలు ఇళ్ల స్థలాల గురించి మాట్లాడారు. గతంలో తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా పేర్లను పెండింగ్‌ జాబితాలో ఉంచారని, ఇప్పటికైనా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. స్పందించిన ధర్మశ్రీ.. ఈ వార్డులో ఉన్న బంజరు భూమిని చదును చేసి, ఇళ్లు ఇవ్వలేని 25 మందికి స్థలాలు కేటాయించాలని తహసీల్దార్‌ తిరుమలబాబుకు సూచించారు. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే ఎంతోకాలంగా ఈ భూమి తమ ఆధీనంలో వుందని, ఇళ్ల స్థలాలకు ఇవ్వడానికి వీలులేదంటూ గ్రామానికి చెందిన సింగంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కరెంటు స్తంభం ఎక్కి ఆందోళనకు దిగాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ తిరుమలబాబు, ఎస్‌ఐ యమున అక్కడకు వచ్చి, స్తంభం మీద నుంచి కిందకు దిగాలని శ్రీనివాసరావును కోరారు. తమ ఆధీనంలో స్థలాన్ని ఇతరులకు ఇవ్వడానికి ఒప్పుకునేది అతను స్పష్టం చేశారు. కాగా ఎమ్మెల్యే చెప్పిన బంజరు భూమిలోనే తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ వెంకటరావు అనే యువకుడు పోటీగా మరో విద్యుత్‌ స్తంభం ఎక్కాడు. తమ వార్డులో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వేరే స్థలాలు లేవని, అందువల్ల ఈ బంజరు భూమినే కేటాయించాలని, లేకపోతే కరెంటు వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. ఇదే సమయంలో ఇరువర్గాల వారు వాదనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కరెంటు స్తంభాల మీద నుంచి వెంటనే దిగకపోతే సహించేది లేదని ఎస్‌ఐ యమున హెచ్చరించడంతో వారు కిందకు దిగారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2022-12-13T01:01:43+05:30 IST