49 టేకు దుంగలు స్వాధీనం

ABN , First Publish Date - 2022-02-23T05:35:30+05:30 IST

స్థానిక పోలీసులు, నర్సీపట్నం ఫారెస్ట్‌ అధికారులు మంగళవారం కోటవురట్లలో మూడుచోట్ల దాడులు నిర్వహించి 49 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

49 టేకు దుంగలు స్వాధీనం

వేర్వేరు ప్రదేశాల్లో పట్టివేత


కోటవురట్ల, ఫిబ్రవరి 22: స్థానిక పోలీసులు, నర్సీపట్నం ఫారెస్ట్‌ అధికారులు మంగళవారం కోటవురట్లలో మూడుచోట్ల దాడులు నిర్వహించి 49 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఆయా శాఖల అధికారులు తెలిపిన వివరాలు... మండలంలోని సన్యాసిరాజుపాలెం గ్రామంలో ఓ రైతు తన అసైన్డ్‌ భూమిలో టేకు చెట్లు పెంచుకుంటున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి టేకు చెట్లను ఇటీవల నరికి వేయించాడు. టేకు దుంగలను మంగళవారం తెల్లవారుజామున వ్యాన్‌లో లోడింగ్‌ చేయిస్తున్నాడు. దీనిపై గుర్తు తెలియని వ్యక్తి నర్సీపట్నం ఫారెస్ట్‌ అధికారులకు, కోటవురట్ల పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని 20 టేకు దుంగలతోపాటు వ్యాన్‌ని స్వాధీనం చేసుకుని ఫారెస్ట్‌ అధికారులకు అప్పగించారు. 

కాగా వెంకటాపురం గ్రామానికి చెందిన ఒక రైతు తిమ్మాపురంలో మరో రైతు వద్ద 20 టేకు దుంగలను కొనుగోలుచేసి తన పొలంలో నిల్వ చేశాడు. వీటిని కూడా అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో కోటవురట్ల పాల కేం ద్రం వద్ద గడ్డి మేటులో దాచిన తొమ్మిది టేకు దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో నర్సీపట్నం ఫారెస్ట్‌ రేంజర్‌ రాజాబాబు, కోటవురట్ల, డౌనూరు ఫారెస్టు ఆఫీసర్లు అనిల్‌కుమార్‌, కేవి రమణ, సిబ్బంది పాల్గొన్నారు. 


Read more